ఐటీ, స్టార్టప్ సంస్థలు నూతన సంవత్సరంలో దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉందని ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌ అంచనా వేశారు. ఈ రంగాల్లో కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి జీతభత్యాలు 2018తో పోల్చితే వచ్చే ఏడాదిలో 20 శాతం అధికంగా ఉండవచ్చునన్నారు. 
ఐటీ రంగ ఉద్యోగుల ప్రాధమిక వేతనాలు ఇప్పుడు ఏడాదికి రూ.4.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెరిగాయని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయి పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ఐటీ రంగంలో స్తబ్దత ఉండగా, వచ్చే ఏడాదిలో పరిస్థితి ఎంతో ఆశావహంగా మారుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. 
‘హెచ్‌1బీ’ వీసా నిబంధనలు కఠినతరం కావడంతో ఇక్కడి ఐటీ కంపెనీలు అమెరికాకు బదులు జపాన్‌, ఆగ్నేయాసియా దేశాల వైపు మొగ్గు చూపుతున్నాయని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయి పేర్కొన్నారు. 

కొత్త తరం ఐటీ కంపెనీలకు హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని, ఇక్కడ ఉన్న మౌలిక వసతులు, రాష్ట్ర ప్రభుత్వం సహకారం దీనికి ప్రధాన కారణాలని విశ్లేషించారు. ఐటీ, స్టార్టప్ రంగాల్లో ఫ్రెషర్లకు డిమాండ్‌ పెరిగిందని, వచ్చే ఏడాది ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగావకాశాలు భారీగా పెరగనున్నాయని అన్నారు. ప్రస్తుతం 6 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోన్న స్టార్టప్‌లు వచ్చే ఏడాదిలో మరో 2 లక్షల మందిని ఉద్యోగాల్లో నియమించుకునే అవకాశం ఉందని పాయ్‌ అంచనా వేశారు.

ప్రస్తుత ఏడాదిలో ఐటీ, స్టార్టప్‌లు కలిసి 3.5-4 లక్షల మేర సిబ్బందిని నియమించుకుని ఉండవచ్చని, అందులో స్టార్ట్‌పల హైరింగ్‌ 1.50 లక్షల స్థాయిలో ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.

కొత్త ఏడాదిలో అమెరికాలో కృత్రిమ మేథ, డిజిటైజేషన్‌, బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌) విభాగాల్లో ఐటీ కార్యకలాపాలు అధికంగా ఉన్నట్లు, ఈ విభాగాలపై దృష్టి సారించటం ద్వారా ఇక్కడి ఐటీ కంపెనీలు లాభపడవచ్చునని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయి తెలిపారు. యూరప్‌, ఆసియా దేశాల్లోనూ కొత్త మార్కెట్లు దేశీయ ఐటీ కంపెనీలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. 

దేశంలో స్టార్టప్‌ సంస్థలకు స్వర్ణయుగం రాబోతోందని ఆయన అభిప్రాయాలను బట్టి స్పష్టమవుతోంది. స్టార్టప్‌ సంస్థల్లో ఇప్పుడు 6 లక్షల ఉద్యోగాలు ఉన్నట్లు, కొత్త ఏడాదిలో ఈ సంస్థల్లో 2 లక్షల కొత్త ఉద్యోగాలు రావచ్చని మోహన్‌దాస్‌ పాయ్‌ అంచనా వేశారు. దేశంలో ఇప్పుడు 39,000 స్టార్టప్‌ సంస్థలున్నాయని, దీనికి తోడు ఏటా 5,000 స్టార్టప్‌లు పుట్టుకొస్తున్నాయని, తత్ఫలితంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నాయని వివరించారు. మొత్తం మీద వచ్చే ఏడాది ఐటీ, ఐటీ సేవల సంస్థలకు కలిసి వస్తుందని మోహన్‌దాస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

మోహన్‌దాస్‌ పాయ్‌ ప్రస్తుతం మణిపాల్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. వెంచర్‌ ఫండ్‌ సంస్థ ఆరిన్‌ క్యాపిటల్‌లో భాగస్వామి. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డులో సభ్యుడు కూడా. దేశీయ ఐటీ పరిశ్రమ మళ్లీ వృద్ధిబాటలో పయనిస్తోందని ఆయన పేర్కొన్నారు. బడా ఐటీ కంపెనీలు కార్యకలాపాలను భారీగా విస్తరించడంతోపాటు పెద్ద మొత్తాల్లో బైబ్యాక్‌లు ప్రకటించాయని గుర్తు చేశారు.  దేశంలోని ఐటీ కంపెనీలు ఇప్పటికే సగానికి పైగా సిబ్బందికి కొత్త టెక్నాలజీల్లో శిక్షణ ఇచ్చాయని, కంపెనీలు డిజిటల్‌ విభాగ ఆదాయంలో రెండంకెల వృద్ధి సాధిస్తున్నాయని మోహన్ దాస్ పాయ్ వివరించారు.