Asianet News TeluguAsianet News Telugu

రిసెషన్‌లో ఎకానమీ: దేశీయ ఐటీ దిగ్గజాలకు సవాలే

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కమ్ముకున్న ‘మాంద్యం’ మేఘాల ప్రభావం భారత ఐటీ దిగ్గజాలపై తప్పక కనిపిస్తున్నది. ఇప్పటికే అంతర్జాతీ ఐటీ సంస్థలు తమ గైడెన్స్ తగ్గించుకున్నాయి. దేశీయ ఐటీ దిగ్గజాల గైడెన్స్ పైనే మార్కెట్ వర్గాలు, ఐటీ నిపుణులు విశ్లేషకులు కేంద్రీకరించారు.

IT earnings season set to begin under overhang of US slowdown fears
Author
New Delhi, First Published Jan 5, 2019, 10:43 AM IST

న్యూఢిల్లీ: వచ్చే వారం ఆర్థిక ఫలితాలు వెల్లడి కానున్నాయి. 2018లో మంచి పనితీరు కనబర్చిన దేశీయ ఐటీ దిగ్గజాలు ఈ ఏడాది తొలి నుంచే కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఆంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంటుందన్న అంచనాలతో ఐటీ కంపెనీలు అయోమయంలో పడ్డాయి. వృద్ధి రేటు మందగించితే వివిధ దేశాల్లో ఐటీ రంగానికి ఖర్చు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నది. 2018 ప్రారంభంలో ఐటీ కంపెనీల్లో వృద్ధి పుంజుకోవడంతో లాభాలను ఆర్జించగలిగాయి. 

కానీ, ఈ ఏడాది పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా-చైనా మధ్య వాణిజ్య పోరు, బ్రెగ్జిట్ కారణంగా యూరోజోన్‌లో నెలకొన్న అనిశ్చితి తదితర కారణాలతో సెంటిమెంట్ బలహీనంగా కనిపిస్తున్నది. తత్ఫలితంగా ఐటీ కంపెనీలు తమ ఆశావాహ దృక్పథాన్ని తగ్గించుకుంటున్నాయి.

ఇప్పటికే కొన్ని ఐటీ రంగ షేర్లు చాలా వరకూ పతనం అయ్యాయి. వచ్చే త్రైమాసికంలో రెవెన్యూ పెద్దగా పెరుగకపోవచ్చునని ప్రముఖ గ్లోబల్ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ ప్రకటించింది. ఆ కంపెనీ బ్యాంకింగ్, బీమా విభాగాలు కేవలం ఒక్క శాతం మేర మాత్రమే గత త్రైమాసికంలో వృద్ధి చెందాయి. 

మరో అతిపెద్ద ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ కూడా రెవెన్యూ గైడెన్స్‌ను తగ్గించింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి దేశీయ కంపెనీల బీఎఫ్‌ఎస్‌ఐ విభాగం రెవెన్యూలో దాదాపు సగం అమెరికన్ మార్కెట్ నుంచే వస్తున్నది. మరికొన్ని మిడ్‌క్యాప్ కంపెనీల ఆదాయం కూడా ఈ విభాగం నుంచి సగానికి పైగా లభిస్తున్నది. కాగ్నిజెంట్, యాక్సెంచర్ లాంటి దిగ్గజ కంపెనీలే రెవెన్యూ గైడెన్స్‌ తగ్గించుకున్నాయి. 

ఈ నేపథ్యంలో దేశీయ కంపెనీల గైడెన్స్‌పై మార్కెట్ వర్గాలు ఆసక్తిగా వేచిచూస్తున్నాయి. బ్యాంకింగ్ రంగం నుంచి డిమాండ్ తగ్గడంతోపాటు అమెరికాలో కార్యకలాపాల నిర్వహణ కూడా వివిధ కారణాలతో వ్యయభరితమైంది దీంతో ఐటీ కంపెనీల మార్జిన్లు కూడా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. దేశీయ నిపుణులకు వీసాలు దొరకక, స్థానికంగా నిపుణుల లభ్యత కొరత తదితర కారణాలు దేశీయ ఐటీ కంపెనీలకు సవాళ్లను విసురుతున్నాయని కోటక్ ఈక్విటీస్ రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. 

మిడ్‌క్యాప్ ఐటీ కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్ నిపుణుల కొరత వల్లే సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించలేకపోయినట్టు తెలిపింది. 2019 జూన్ త్రైమాసికం వరకూ పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. అమెరికాలో నిపుణలు కొరత గురించి దేశంలో అతి పెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ కూడా గతంలో పలుసార్లు ప్రస్తావించింది.

పెద్ద కంపెనీల కన్నా చిన్న ఐటీ కంపెనీలే ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఎడెల్‌వైజ్ సెక్యూరిటీస్ తన నివేదికలో తెలిపింది. ఒకవేళ ఐటీ కంపెనీలు రెవెన్యూ గైడెన్స్‌ను తగ్గిస్తే గతేడాదిలో మాదిరిగా షేర్లను కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు ముందుకు రాకపోవచ్చు.

సాధారణంగా డిసెంబర్ త్రైమాసికంలో చాలా తక్కువ పనిరోజులే ఉన్నందున ఆర్థిక ఫలితాల్లో జోష్ ఉండదు. ఇటీవల డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఏ మేరకు లబ్దిపొందాయో కూడా ఈ త్రైమాసిక ఫలితాలు తేల్చనున్నాయి. డిసెంబర్ త్రైమాసికంలో రూపాయి మారకం విలువ 2.7 శాతం నష్టపోయింది. దీంతో కంపెనీల మార్జిన్లు చాలా వరకూ తగ్గిపోకుండా ఉండే అవకాశం ఉంది. 

దేశీయ ఐటీ రంగంలో టాప్-5 కంపెనీల నిర్వహణ మార్జిన్లు దాదాపు ఒక శాతం వరకూ పెరగవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆటోమేషన్‌పై దృష్టిని సారించడం వల్ల కూడా ఐటీ కంపెనీలు చాలా వరకు రెవెన్యూ కాపాడుకోగలిగాయి. ఇన్ఫోసిస్ లాభ మార్జిన్లు ఈ సారి కుదించుకుపోయే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశీయ ఐటీ కంపెనీల రెవెన్యూ సగటున 4 శాతం, అలాగే నికరలాభం 6 శాతం మేర వృద్ధి చెందవచ్చునని అంచనా. 

అలైట్ సొల్యూషన్స్ ఒప్పందం వల్ల విప్రో మార్జిన్లు 23 శాతం పెరగవచ్చునని భావిస్తున్నారు. మిడ్ క్యాప్ ఐటీ కంపెనీలలో ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ అత్యధిక రెవెన్యూ వృద్ధిని సాధించవచ్చు. పెద్ద కంపెనీల కన్నా కొన్ని మిడ్‌క్యాప్ కంపెనీల లాభాలే ఎక్కువ శాతం పెరిగే అవకాశాలు కఃనిపిస్తున్నాయి. డిజిటల్, క్రుత్రిమ మేధస్సు, ఆటోమేషన్ సేవల వల్లఈసారి మెజారిటీ ఐటీ కంపెనీలు గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios