బెంగళూరు: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భారతీయ ఐటీ దిగ్గజాల కష్టాలు చెప్పనలవి కాదు. ఈ ఏడాది మూడు త్రైమాసికాల్లో వీసాల లాబీయింగ్ కోసం ఇమ్మిగ్రేషన్ తదితర అంశాల పరిష్కారం కోసం 2017తో పోలిస్తే భారత ఐటీ దిగ్గజాలు చేస్తున్న ఖర్చు 40 శాతం పెరిగింది. ప్రత్యేకంగా హెచ్1-బీ వీసా దరఖాస్తులు తిరస్కరణ కాకుండా నిలువరించేందుకు లాబీయింగ్ ఖర్చు భారీగా పెరిగాయని సీఎల్ఎస్ఏ సంస్థ నివేదించింది. 

భారత ఐటీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సంస్థ (టీసీఎస్), విప్రో, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ తదితర ఐటీ సంస్థలతోపాటు ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ కలిసి 2015లో 2.4 మిలియన్ల డాలర్లు ఖర్చు చేశాయి. 2016లో 2.9 మిలియన్లకు, 2017లో 3.3 మిలియన్ల డాలర్లకు చేరింది. 

ఇక ఈ ఏడాది తొలి మూడు త్రైమాసికాల్లోనే లాబీయింగ్ ఖర్చు 3.2 మిలియన్ల డాలర్ల (గతేడాది ఇదే సమయానికి 2.3 మిలియన్ల డాలర్లు)కు చేరుకున్నది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) గత నెలలో హెచ్1-బీ వీసాల దరఖాస్తుల ఫైలింగ్‌లో పలు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డీహెచ్ఎస్ చేసే మార్పులు, చేర్పులను గురించి తెలుసుకోవడానికి లాబీయింగ్ జరుపాల్సిన అవసరం ఉన్నదని భారత ఐటీ దిగ్గజాలు భావించాయి. హెచ్1 బీ వీసా పొందే నిపుణుల వేతనం ఎంత పెరుగుతుందన్న విషయమై ఐటీ దిగ్గజాలు కేంద్రీకరించాయి. 

హెచ్1-బీ వీసాల్లో మార్పులతో అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్‌లో భారత ఐటీ దిగ్గజాల సమస్యలు పెరగనున్నాయి. మొత్తం వీసా పద్దతి బాధాకరంగా మారుతుంది. అమెరికాలో ఐటీ దిగ్గజాల వ్యాపార లావాదేవీలు, వ్యయం పెరిగి, లాభాలు తగ్గుముఖం పడతాయని మోర్గాన్ స్టాన్లీ అనలిస్ట్ పరాగ్ గుప్తా చెప్పారు. 

వాణిజ్య లావాదేవీలపై ఒత్తిడి ఐటీ దిగ్గజాలపై ధరవరల ఒత్తిళ్లు కొనసాగుతాయని నొమురా అనలిస్ట్ అశ్విన్ మెహతా తెలిపారు. దీనికి తోడు ఇమ్మిగ్రేషన్ నిబంధనల కఠినతరంతోపాటు రూపాయి విలువ బలోపేతం వంటి అంశాలు ప్రభావితం చేస్తాయన్నారు.

సీఎల్ఎస్ఏ నోట్ ప్రకారం ఏటా ఇన్ఫోసిస్ 3.20 లక్షల డాలర్లు, విప్రో 2 లక్షల డాలర్లు ఖర్చు చేశారు. మరోవైపు టీసీఎస్ 80 వేల నుంచి 3.80 లక్షల డాలర్లకు ఖర్చును పెంచేసింది. వాషింగ్టన్‌లోని సీనియర్ ప్రభుత్వాధికారులతో సంప్రదింపులకు కాగ్నిజెంట్ ఏటా 30-40 లక్షల డాలర్ల బడ్జెట్ ఖర్చు చేస్తోందని సీఎల్ఎస్ అనలిస్ట్ అంకుర్ రుద్ర చెప్పారు. తన సిబ్బందిలో అత్యధికులకు గ్రీన్ కార్డు వచ్చేలా చూస్తోంది.