Asianet News TeluguAsianet News Telugu

దటీజ్ జియో ఎఫెక్ట్: ఇంటర్నెట్‌ వినియోగంలో మనకు రెండోస్థానం

ఇంటర్నెట్ వినియోగంలో భారతదేశానికి రెండో స్థానం అని మేరీ మేకర్ -2019 నివేదిక పేర్కొంది. భారత దేశానికి రెండో స్థానం తేవడంలో ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో పాత్ర ఎనలేనిదని ఆ నివేదిక ప్రశంసించింది. 

India home to world's second largest internet user base, thanks to Jio: Report
Author
New Delhi, First Published Jun 13, 2019, 12:45 PM IST

న్యూఢిల్లీ: అత్యధికంగా ఇంటర్నెట్‌ వినియోగదారులు గల దేశాల్లో భారతదేశం రెండోస్థానానికి చేరింది. ఈ ఘనత దక్కడంలో, అధికవేగం డేటా సేవల (4జీ)ను, తక్కువ ధరల్లో అందుబాటులోకి తెచ్చిన రిలయన్స్‌ జియో పాత్ర ఎంతో కీలకం అని తేలింది. 

అంతర్జాతీయంగా ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 12% మంది భారత్‌లోనే ఉన్నారని ఇంటర్నెట్ ట్రెండ్స్ అధ్యయన సంస్థ ‘మేరీ మీకర్’తన 2019 నివేదికలో పేర్కొంది. అమెరికా బయట చూస్తే, అత్యంత వినూత్న సేవలు అందిస్తున్న ఇంటర్నెట్‌ కంపెనీల్లో జియో ఒకటని ఆ సంస్థ పేర్కొంది. 

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య 380 కోట్ల మందికి చేరింది. ప్రపంచ జనాభాలో ఇది సగానికి కంటే ఎక్కువ. నెట్‌ వినియోగదారుల సంఖ్య స్థిరంగా పెరుగుతున్నా, గతంతో పోలిస్తే వృద్ధి నెమ్మదిస్తోంది. 

2016తో పోలిస్తే, 2017లో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య ఏడు శాతం వృద్ధి చెందగా, 2018లో వృద్ధి ఆరు శాతానికి పరిమితమైంది. ప్రపంచ దేశాల్లో చూస్తే, ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్యా పరంగా చైనా అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో భారత్‌ నిలిచింది.

ప్రపంచ ఇంటర్నెట్‌ వినియోగదారులలో చైనా వాటా 21 శాతం కాగా, భారత వినియోగదార్ల వాటా 12 శాతం ఉంటే.. అగ్రరాజ్యం అమెరికాలో ఇంటర్నెట్ వాడకం దారులు 8 శాతం మంది ఉన్నారు. 
ఇంటర్నెట్‌పై అమలులో ఉన్న నియంత్రణ భారత్‌లో మధ్యశ్రేణిలో ఉంటాయని మేరీ మీకర్ తన నివేదికలో పేర్కొంది. అవమానించే కంటెంట్‌పై సెన్సార్‌షిప్‌ ఉంటుందని తెలిపింది.

ఉచిత కాల్స్‌, డేటాకు తక్కుధ రుసుములు వసూలు చేయడంతో, ఏడాది లోపే రిలయన్స్ జియోకు అత్యధిక చందాదారులు జత కలిశారు. అంతే కాదు రిలయన్స్ జియో సాయంతో డేటా వినియోగం రెండింతలైంది. 30.7 కోట్ల మొబైల్‌ కనెక్షన్లు కలిగిన రిలయన్స్‌ జియో, ఈ- కామర్స్‌ రంగాన్ని సంప్రదాయ దుకాణదార్లతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తోంది.

‘దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్‌ రిటైల్‌ విక్రయశాలల్లో అడుగిడే 35 కోట్ల మందిని, జియో చందాదారులైన 30.7 కోట్ల మందిని, 3 కోట్ల మంది చిరు వ్యాపారులను అనుసంధానించి, మారుమూల ప్రాంతాల వినియోగదారులకు అన్ని రకాల ప్రయోజనాలు చేకూరుస్తాం’ అని రిలయన్స్‌ జియో అధిపతి ముకేశ్‌ అంబానీ ప్రకటించారని మేరీ మేకర్ నివేదిక గుర్తు చేసింది. 

తమ ఆన్‌లైన్‌ పోర్టల్‌ నుంచి సరకు చేరవేసేందుకు, వస్తువుల సమీకరణకు కేంద్రాలుగా జియో స్టోర్లను వినియోగించుకోవాలన్నది రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రణాళిక. మొత్తం 95 శాతం జనాభాకు చేరువ కావాలన్నది రిలయన్స్ ఆశయం. రిలయన్స్ ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లు 11 వేలు ఉన్నాయి. వీటిలో ఐదు వేల నగరాల పరిధిలో 5100కి పైగా జియో పాయింట్ స్టోర్లుగా  వినియోగిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios