Asianet News TeluguAsianet News Telugu

నో డౌట్: పదేళ్లలో రెండో అతిపెద్ద స్మార్ట్ మార్కెట్ భారత్

చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘హువావే’ తన 5జీ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను బార్సిలోనాలో ఆవిష్కరించింది. దీని ధర 2600 డాలర్లు. వచ్చే పదేళ్లలో భారతదేశం ‘5జీ’ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లలో రెండో స్థానాన్ని ఆక్రమిస్తుందని హువావే తెలిపింది. 5జీ సేవల విస్తరణ కోసం హువావే వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ సంస్థలతో చేతులు కలిపింది. 

Huawei's foldable 5G phone Mate X launched at MWC 2019: Key highlights
Author
Hyderabad, First Published Feb 26, 2019, 9:29 AM IST

వచ్చే పదేళ్లలో ప్రపంచంలోనే భారత్‌ రెండో అతిపెద్ద 5జీ మార్కెట్‌గా అవతరించనుందని చైనాకు చెందిన టెలికం దిగ్గజం హువావే టెక్నాలజీస్‌ సదరన్‌-తూర్పు ఆసియా ప్రాంతం ప్రెసిడెంట్‌ జేమ్స్‌ వూ పేర్కొన్నారు. ‘భారత్‌ చాలా ముఖ్యమైన వర్దమాన మార్కెట్‌గా మారింది. దీర్ఘకాలంలో భారత్‌లో 5జీ మార్కెట్‌ చాలా భారీ స్థాయిలో ఉంటుంది. చైనా తర్వాత భారత్‌ రెండో స్థానంలో నిలువనుంది. వచ్చే పదేళ్ల కాలంలో ఇందుకు అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు.

వొడాఫోన్ ఐడియా- ఎయిర్ టెల్‌లతో చేతులు కలిపిన హువావే
5జీ ట్రయల్స్‌ కోసం వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌తో హువావే చేతులు కలిపింది. రానున్న కాలంలో భారత్‌లో 5జీ టెస్ట్‌లాబ్‌ను ఏర్పాటు చేయాలని కూడా హువే యోచిస్తోంది. ఇదిలా ఉంటే వచ్చే ఆరేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 5జీ కనెక్షన్ల సంఖ్య 140 కోట్ల వరకు ఉండవచ్చని గ్లోబల్‌ టెలికాం పరిశ్రమ సమాఖ్య (జీఎస్ఎం) అసోసియేషన్‌ అంచనా వేస్తోంది. ఇది మొత్తం మార్కెట్లో 15 శాతానికి సమానమని చెబుతోంది. 

ఆరేళ్లలో అమెరికాలో సగం కనెక్షన్లు 5జీకి మళ్లింపు
2025 నాటికి అమెరికాలో సగం కనెక్షన్లు 5జీకి మారిపోతాయని, చైనాలో 30 శాతం, భారత్‌లో ఐదు శాతం 5జీ కనెక్షన్లు ఉంటాయని పేర్కొంది. జీఎస్ఎంఏ ఇంటెలిజెన్స్‌ నివేదిక ప్రకారం.. భారత్‌ సహా 50కి పైగా దేశాల్లోని 79 మొబైల్‌ ఆపరేటర్లు 5జీ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. 2025నాటికి 2500 కోట్ల ఐఓటీ కనెక్షన్లు ఉంటాయని జీఎస్ఎంఏ మరో నివేదికలో అంచనా వేసింది.

జూన్ నాటికి విపణిలోకి హువావే 5జీ ఫోన్‌ ‘మేట్‌ ఎక్స్‌’
చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం హువావే మడతపెట్టే సౌలభ్యం ఉన్న 5జీ స్మార్ట్‌ఫోన్‌ ‘మేట్‌ ఎక్స్‌’ను ఆవిష్కరించింది. ప్రత్యర్థి సంస్థ శామ్‌సంగ్‌ మడతబెట్టే ఫోన్‌ విడుదల చేసిన నాలుగు రోజుల్లోనే హువావే సైతం ఇటువంటి ఫోన్‌నే విపణిలోకి తేవడం గమనార్హం. వచ్చే జూన్‌ నాటికి ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు దీనిని అందుబాటులోకి తెస్తామని హువావే హెడ్‌ (కన్జూమర్‌ బిజినెస్‌) రిచర్డ్‌ యూ పేర్కొన్నారు. 

హువావే 5జీ ఫోన్ ధర 2600 డాలర్లు
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ప్రారంభానికి ఒక రోజు ముందు హువావే 5జీ స్మార్ట్ ఫోన్ ‘మేట్ ఎక్స్’ ఆవిష్కరించడం గమనార్హం. 6.6 అంగుళాల కలిగిన ఈ మడతపెట్టే ఫోన్‌ కోసం తమ ఇంజినీర్లు మూడేళ్లకు పైగా కృషి చేశారని చెప్పారు. దీని ధర 2600 డాలర్లు (దాదాపు రూ.1.85 లక్షలు)గా నిర్ణయించారు. ధర చాలా ఎక్కువగా ఉందని, దీన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తామని యూ తెలిపారు.

రెండు వైపులా ఇలా హువావే 5జీ ఫోన్ ఫుల్ వ్యూ 
హువావే 5జీ ఫోల్డబుల్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌ మేట్‌ ఎక్స్‌లో రెండు ఓఎల్‌ఈడీ ఫుల్‌వ్యూ డిస్‌ప్లే ప్యానెళ్లు ఉన్నాయి. దీన్ని తెరిచినప్పుడు స్ర్కీన్‌ పరిమాణం 8 అంగుళాలు ఉంటుంది. డ్యూయల్‌ సిమ్‌ (నానో), ఆండ్రాయిడ్‌ 9పై ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉన్నాయి. మడిచినప్పుడు మెయిన్‌ మెయిన్‌ డిస్‌ప్లే 6.6 అంగుళాలు ఉంటుంది. వెనుకవైపు డిస్‌ప్లే 6.4 అంగుళాలు ఉంటుంది. పుస్తకం మాదిరిగా తెరిచినప్పుడు స్ర్కీన్‌ సైజు 8 అంగుళాలు ఉంటుంది.
 
డేటా సంరక్షణ విధానం మంచిదే.. కానీ
భారత్‌తోపాటు వివిధ దేశాల్లో డేటా సంరక్షణ కోసం ప్రత్యేక విధానాన్ని అనుసరించడం మంచి పరిణామమేనని జీఎస్ఎంఏ డైరెక్టర్‌ జనరల్‌ మట్స్‌ గ్రాన్‌రిడ్‌ అన్నారు. డేటా ప్రవాహం అనేది ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండాలని, సమాచార దీవులను సృష్టించినట్టుగా మాత్రం ఉండరాదని పేర్కొన్నారు. రానున్న కొన్నేళ్లలో సెల్యులార్‌పై వంద కోట్లకు పైగా ఐఓటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) కనెక్షన్లు ఉండవచ్చని, సెల్యులార్‌ వెలుపల 2,000 కోట్లకు పైగా కనెక్షన్లకు ఆస్కారం ఉందని చెప్పారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios