బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై చైనా రగిలిపోతుంది. తమ దేశీయ టెక్నాలజీ దిగ్గజం హువావేపై అమెరికా విధించిన ఆంక్షలపై ప్రతీకారానికి తహతహలాడుతోంది. ఇందుకు అమెరికా కంపెనీలపై ప్రతీకారం తీర్చుకొనేందుకు చట్టాలకు పదును పెడుతోంది. దీని ప్రకారం చైనాకు చెందిన సైబర్‌ స్పేస్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ కొన్ని నిబంధనలను సిద్ధం చేసింది. 

ఇందులో భాగంగా కీలక విదేశీ పరికరాలు, సేవలను పొందితే వచ్చే ముప్పును పరిశీలిస్తోందని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్ తెలిపింది. ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వచ్చేనెల 24లోపు ఈ ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో అందుబాటులో పెట్టనున్నారు. 

టెక్నాలజీ లీకింగ్‌, తస్కరణ, కీలక సమాచారం సరిహద్దులు దాటడం వంటి ముప్పు అనే నిబంధనలు ఉండవచ్చు. చైనా మార్కెట్లో ఉన్న అమెరికా సాంకేతికతను అడ్డుకొనేందుకు ఈ నిబంధనలు ఉపయోగపడనున్నాయి. గత వారం చైనాకు చెందిన హువావే, దానికి చెందిన 68 అనుబంధ సంస్థలు అమెరికాకు చెందిన సంస్థల నుంచి ఎటువంటి సాంకేతికత కొనుగోలు చేయకుండా ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే.  

హువావే, దాని అనుబంధ సంస్థలతో లావాదేవీల నిర్వహణకు, టెక్నాలజీ మార్పిడికి ప్రభుత్వ అనుమతులు తప్పనిసరని అమెరికా పేర్కొంది. దీంతో హువావేతో అమెరికా టెక్‌ దిగ్గజాలు గూగుల్‌, ఇంటెల్‌, క్వాల్‌కామ్‌, బ్రాడ్‌కామ్‌ సంస్థలు తెగదెంపులు చేసుకున్నాయి.

హువావేపై నిషేధాన్ని అమెరికా 90 రోజులు సడలించింది. దీంతో హువావే ఫోన్లకు గూగుల్‌ యాప్‌ సేవలు అందని పరిస్థితి నెలకొంది. ఇది వాణిజ్య యుద్ధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. అయితే హువావే వ్యవస్థాపకుడు రెన్ జెంగ్ ఫీ మాత్రం అమెరికా ఉత్పత్తులు ప్రత్యేకించి ‘ఆపిల్’ ఉత్పత్తులపై నిషేధం విధించడానికి తాను వ్యతిరేకమని చెప్పారు. ఈ విషయమై చైనా ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తానన్నారు. 

ట్రంప్ ప్రభుత్వం విధించిన నిషేధానికి ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై చైనా నిషేధం విధిస్తుందని తాను భావించడం లేదని రెన్ జెంగ్ ఫీ స్పష్టం చేశారు. అదే జరిగితే తానే ముందుగా నిరసన తెలియజేస్తానని చెప్పారు. అమెరికా నిషేధం విధించిన తర్వాత యూరోపియన్ యూనియన్ (ఈయూ) సభ్య దేశాలు కూడా హువావేతో సంబంధాలు తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. నిషేధం అంశాన్ని మరిచిపోయి లండన్ డౌన్ స్ట్రీట్‌లో ట్రంప్- ఎలిజబెత్- థెరెసా మే చర్చల సందర్బంగా ట్రంప్ తో తేనీటి విందు రాయబారానికి రెన్ జెంగ్ ఫీ సిద్దమని ప్రకటించారు.