న్యూఢిల్లీ: దేశీయంగా స్టార్టప్ సంస్థలకు  అనువైన ప్రదేశంగా ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌ నిలిచింది. ఢిల్లీలో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర పారిశ్రామిక విధాన ప్రోత్సాహక శాఖ (డీఐపీపీ)  ఇందుకు సంబంధించిన ర్యాంకులను గురువారం విడుదల చేసింది. స్టేట్స్‌ స్టార్టప్‌ ర్యాంకింగ్‌ 2018 పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో స్టార్టప్ సంస్థలకు అనువుగా ఉండే వాతావరణం, అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు,, పెట్టుబడులు, అవగాహన, సంస్థల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆరు కేటగిరీలుగా విభజించారు. 

‘బిగినర్స్‌’, ‘ఎమర్జింగ్‌ స్టేట్స్‌’, ‘యాస్పరింగ్‌ లీడర్స్‌’, ‘లీడర్స్‌’, ‘అత్యుత్తమ ప్రదర్శకులు’, ‘బెస్ట్‌ పెర్ఫామర్స్‌’ కింద రాష్ట్రాలను వేరు చేశారు. వీటిలో అత్యుత్తమ ప్రదర్శనలో గుజరాత్‌ నిలిచింది. ఇక ఉత్తమ ప్రదర్శకుల కేటగిరీలో కర్ణాటక, కేరళ, ఒడిశా, రాజస్థాన్‌ నిలిచాయి. ఈ రాష్ట్రాలు స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు 85శాతం అనువుగా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు ‘లీడర్స్’ విభాగంలో చోటు దక్కించుకోవడం ఆసక్తికర పరిణామం. 

ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలు, సేకరణ, నియంత్రణ, సమాచార, నూతన ఆవిష్కరణల ప్రాతిపదికన స్టార్టప్ పాలసీ, ఇంక్యుబేషన్ హబ్స్, సీడింగ్ ఇన్నోవేషన్, స్కేలింగ్ ఇన్నోవేషన్, రెగ్యులేటరీ చేంజ్ చాంపియన్స్, ప్రొక్యూర్‌మెంట్ లీడర్స్, కమ్యూనికేషన్ చాంపియన్స్ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రాష్ర్టాలను డీఐపీపీ ప్రకటించింది. స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి, నిర్మాణం, ప్రోత్సాహం కొలమానంగా ర్యాంకులను ఇచ్చారు. 

ఇక లీడర్స్‌ విభాగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు చోటు దక్కించుకున్నాయి. యాస్పరింగ్‌ లీడర్స్‌ కేటగిరీలో హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, జార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ్ బెంగాల్ నిలిచాయి. ఎమర్జింగ్‌ స్టేట్స్‌గా అసోం, ఢిల్లీ, గోవా, జమ్ముకశ్మీర్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు, ఉత్తరాఖండ్‌ నిలిచాయి. బిగినర్స్‌ విభాగంలో ఛండీగఢ్‌, మణిపూర్‌, మిజోరం, నాగాలాండ్‌, పుదుచ్చేరి, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలు ఉన్నాయి.

అసోం, ఢిల్లీ, గోవా తదితర ఎనిమిది రాష్ర్టాలను స్టార్టప్‌లపరంగా అభివృద్ధి చెందుతున్నవిగా అభివర్ణించింది. ఇక స్టార్టప్‌లు ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న చండీగఢ్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, పుదుచ్చెరి, సిక్కిం, త్రిపుర రాష్ర్టాలు బిగినర్స్ కేటగిరీలో నిలిచాయి. ‘మా ఈ ర్యాంకులు స్టార్టప్‌ల విస్తరణ, పురోగతికి అవసరమైన పరిస్థితులు ఏర్పడేందుకు దోహదం చేయగలవు’ అని రమేశ్ అభిషేక్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ర్యాంకులతో ఏ రాష్ట్రాన్నీ నొప్పించడం మా ఉద్దేశం కాదన్న డీఐపీపీ కార్యదర్శి రమేశ్ అభిషేక్ ఔత్సాహికులకు తగిన ప్రాధాన్యం ఇచ్చి వారిని ప్రోత్సహిస్తారనేదే తమ ఆశ అన్నారు. కాగా, ఆన్‌లైన్ ఇన్ఫర్మేషన్‌తోపాటు నియంత్రణ, నిబంధనల సరళీకరణ, వెంచర్ ఫండ్స్ ఏర్పాటు, ప్రజా సేకరణలో ప్రాధాన్యం వంటి అంశాలపై రాష్ర్టాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని డీఐపీపీ కార్యదర్శి రమేశ్ అభిషేక్ పేర్కొన్నారు.  

దేశంలోని 22 రాష్ర్టాలు ఇప్పటిదాకా తమ స్టార్టప్ విధానాలను ప్రకటించాయని డీఐపీపీ కార్యదర్శి రమేశ్ అభిషేక్ తెలిపారు. ర్యాంకుల కోసం తమ అధ్యయనంలో మొత్తం 27 రాష్ట్రాలను, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలనూ పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. అభివృద్ధి సామర్థ్యం పెంచడానికే ఈ సర్వేకు దిగినట్లు వివరించారు. దేశంలో ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయింపులతో కూడిన స్టార్టప్ ఇండియా యాక్షన్ ప్లాన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఏంజిల్ ట్యాక్స్‌పై ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామికవేత్తల నుంచి వ్యక్తమవుతున్న ఆందోళనపై రమేశ్ అభిషేక్ స్పందించారు. స్టార్టప్‌లూ పన్ను మినహాయింపులను కోరవచ్చని స్పష్టం చేశారు. అయితే ఇంటర్-మినిస్టీరియల్ బోర్డు నుంచి ఈ మినహాయింపులను కోరాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని రెవిన్యూ శాఖ వద్దకూ తీసుకెళ్లామని చెప్పారు.

స్టాక్ మార్కెట్లలో లేని సంస్థలు.. మార్కెట్ విలువకు మించి షేర్లను జారీ చేసి ఎవరైనా వ్యక్తుల నుంచి పెట్టుబడులు సమకూర్చుకుంటే దానిపై వేసే పన్నే ఈ ఏంజిల్ ట్యాక్స్. ఆదాయం పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 56 కింద ఏంజిల్ ఫండ్స్‌పై పన్నులు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా 14,000లకుపైగా స్టార్టప్‌లో నమోదై ఉన్నట్లు డీఐపీపీ కార్యదర్శి రమేశ్ అభిషేక్ తెలిపారు.  కొన్ని ప్రామాణాల ఆధారంగా రూ.25 కోట్ల టర్నోవర్ ఉన్న స్టార్టప్‌లు ఆదాయం పన్ను నుంచి మినహాయింపు పొందవచ్చన్నారు.