వాషింగ్టన్‌: టెక్ దిగ్గజ సంసథ గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కి అరుదైన గౌరవం దక్కింది. అమెరికా-భారత వాణిజ్య మండలి (యూఎస్‌ఐబీసీ) ప్రతి ఏటా ఇచ్చే గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డుకు 2019 సంవత్సరానికి సుందర్‌ పిచాయ్‌తోపాటు నాస్‌డాక్‌ సీఈవో అడేనా ఫ్రైడ్‌మాన్‌ను ఎంపిక చేసింది. 

ప్రపంచ సాంకేతికరంగ అభివృద్ధికి ఇరు కంపెనీలు అందిస్తున్న సేవలకు వారిని ఎంపిక చేసినట్లు మండలి పేర్కొన్నది. వచ్చే వారం జరిగే ‘ఇండియా ఐడియాస్‌’ సదస్సులో వారికి అవార్డును ప్రదానం చేయనున్నారు. 

గూగుల్‌, నాస్‌డాక్‌ కంపెనీల సహకారంతో 2018లో అమెరికా-భారత్‌ మధ్య వస్తుసేవల ద్వైపాక్షిక వాణిజ్యంలో 150% మేర అభివృద్ధి చెందినట్లు యూఎస్‌ఐబీసీ తెలిపింది. పిచాయ్‌ మాట్లాడుతూ గూగుల్‌ వృద్ధికి భారత్‌ ఎంతగానో తోడ్పాటునందిస్తోందన్నారు. 

ఈ క్రమంలో జరిగిన సాంకేతికాభివృద్ధితో ప్రజల జీవన విధానం ఎంతగానో మెరుగు పడిందని సుందర్ పిచాయ్ అన్నారు. నాస్‌డాక్‌ సీఈవో ఫ్రైడ్‌మాన్‌ స్పందిస్తూ.. యూఎస్‌ఐబీసీ కృషితో ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలతో పాటు సాంస్కృతిక బంధం కూడా బలపడుతోందని పేర్కొన్నారు.

2007 నుంచి యూఎస్‌ఐబీసీఈ గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డు ఇస్తోంది. భారత్, అమెరికా దేశాల వాణిజ్య బంధం బలోపేతానికి సహకరిస్తున్న కార్పొరేట్‌ కంపెనీల దిగ్గజాలకు ప్రదానం చేస్తూ వస్తున్నారు.