ఇంటర్నెట్ సెర్చింజన్ ‘గూగుల్’ ఇకముందు డిజిటల్ బ్యాంకింగ్ సేవలందించేందుకు సిద్ధమైంది. నగదు చెల్లింపుల సేవలందించేందుకు ఆర్బీఐ నిబంధనలను లోకల్ డేటా స్టోరేజ్ నిబంధనలను అమలు చేసేందుకు అంగీకరించింది. అందుకనుగుణంగా నిబంధనల మేరకు పని చేసేందుకు డిసెంబర్ నెల వరకు సమయం కావాలని కోరింది.

గత నెలలో అమెరికాలో కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పర్యటించినప్పుడు గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ తోపాటు సంస్థ టీం కలిసి, ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా బ్యాంకింగ్ సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఇచ్చారని ప్రభుత్వ వర్గాల కథనం. 

కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కేంద్రాన్ని గతనెలాఖరులో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సందర్శించారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తో సమావేశమయ్యారు. ఇప్పటికే ‘గూగుల్ పే’ పేరుతో గూగుల్ డిజిటల్ చెల్లింపుల సర్వీసులు అందజేస్తోంది. ప్రతి నెలా 2.2 కోట్ల మంది 75 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. వార్షికంగా 30 బిలియన్ల డాలర్ల లావాదేవీలు జరుపుతోంది. 

ఆర్బీఐ కూడా డిజిటల్ చెల్లింపులు జరిపే అన్ని సంస్థలు వచ్చే అక్టోబర్ రెండో వారం కల్లా స్టోరేజీ డేటా సిద్ధం చేసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. తాజా ప్రతిపాదనపై గూగుల్ అధికార ప్రతినిధి స్పందిస్తూ అంతర్జాతీయంగా ఆర్థిక లావాదేవీల నిర్వహణలో డేటా సరిహద్దులు దాటేస్తుందన్నారు. అయితే విధాన నిర్ణయాలు ఆచరణాత్మక, సంప్రదాయ పరిష్కారాల అమలులో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాల్సి ఉన్నదన్నారు. 

కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు ఈ నెల ఐదో తేదీన గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ లేఖ రాశారు. భారతదేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యమయ్యేందుకు గ్లోబల్ సంస్థలకు ప్రోత్సాహాన్నందించాలని కోరారు. దీనివల్ల భారతీయ స్టార్టప్‌లకు లబ్ధి చేకూరుతుందని, అంతర్జాతీయంగా విస్తరణకు వీలవుతుందన్నారు.

ఇక డిజిటల్ చెల్లింపులు చేసే ప్రతి సంస్థ 15 రోజులకు ఒకసారి డేటా స్టోరేజీని అప్ డేట్ చేయాల్సి ఉంటుందన్నారు. విదేశీ సంస్థల ప్రవేశానికి ఈ ఆర్బీఐ మార్గదర్శకాలు ఆటంకంగా ఉన్నాయి. ప్రస్తుత చెల్లింపుల వ్యవస్థలో పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ ఔట్ సోర్సింగ్ భాగస్వాములతో కలిసి చెల్లింపుల వ్యవస్థ ఏర్పాటు చేయాలని, ఆ వివరాలను కూడా స్టోరేజీ ఉండాలని ఆర్బీఐ తెలిపింది. 

ఇటీవల సోషల్ మీడియా దిగ్గజం ‘ఫేస్‌బుక్’ తన ఖాతాదారుల డేటా ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొనడంతో ఆర్బీఐ ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. భారతదేశంలో ‘గూగుల్’ క్లౌడ్ రీజియన్ సేవలందిస్తున్నది. మూడు డేటా కేంద్రాల ద్వారా బిగ్ డేటా, స్టోరేజీ, నెట్ వర్కింగ్ సేవలందిస్తోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, మెక్రోసాఫ్ట్ వంటి సంస్థలతో గూగుల్ పోటీ పడుతోంది. ఈ డేటా సెంటర్లలో భారతీయ వినియోగదారుల చెల్లింపుల వివరాలను స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది.