న్యూఢిల్లీ: సెర్చింజన్ గూగుల్​ సంస్థకు చెందిన 'గూగుల్​ పే' యాప్‌ను భారత రిజర్వ్​ బ్యాంకు (ఆర్బీఐ) నిషేధించలేదని రిటైల్​ చెల్లింపుల సాధికార సంస్థ 'నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్పీసీఐ)' తెలిపింది. చెల్లింపుల వ్యవస్థను నిర్వహించకపోవడం వల్ల అధీకృత ఆపరేటర్ల జాబితాలో లేదని ఆర్బీఐ తెలిపింది.

దీనితో గూగుల్‌ పే నిషేధానికి గురైందంటూ సోషల్ మీడియలో ఇటీవల జరుగుతున్న ప్రచారానికి ఇంతటితో తెరపడింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో ఆర్థిక వేత్త అభిజిత్‌ మిశ్రా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి జవాబుగా.. గూగుల్‌ పే ఏ విధమైన చెల్లింపుల వ్యవస్థ (పేమెంట్ సిస్టమ్‌)ను నిర్వహించడం లేదని.. అందుకే సంస్థ పేరు అధీకృత ఆపరేటర్ల జాబితాలో లేదని ఆర్బీఐ తెలిపింది. 

వివిధ బ్యాంకుల భాగస్వామ్యంతో యూపీఐ ద్వారా చెల్లింపులు, తదితర ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు సంస్థకు చట్టపరమైన అన్ని అనుమతులు ‘గూగుల్ పే’కు ఉన్నాయని కూడా ఆర్బీఐ న్యాయస్థానానికి స్పష్టం చేసింది. అయితే ఈ వివరణను పెడచెవిన పెట్టిన కొందరు ఆర్‌బీఐ, గూగుల్‌ పేను నిషేధించిందంటూ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం ఊపందుకోవటంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. 

ఎన్పీసీఐ విడుదల చేసిన అధీక్రుత చెల్లింపుల నిర్వహణ సంస్థల జాబితాలో జీపే లేదని, అది సురక్షితం కాదని, అందుకే దాన్ని ఆర్బీఐ నిషేధించిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. 

ఈ నేపథ్యంలో ‘గూగుల్ పే ను 'థర్డ్‌ పార్టీ యాప్‌ ప్రొవైడర్‌'గా భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గుర్తించింది. ఈ సంస్థ చట్టబద్ధమైందని, దీని ద్వారా జరిగే లావాదేవీలన్నీ సురక్షితమవని ఆర్‌బీఐ నిర్ధారించింది’ అని ఎన్పీసీఐ ప్రకటన చేసి వినియోగదారులకు స్పష్టత వచ్చింది.

జీ-పే ఎలాంటి చెల్లింపుల వ్యవస్థలో పాల్గొనడం లేదని, కేవలం నగదు బదిలీ చేస్తే థర్డ్ పార్టీ ఏజంట్ గానే వ్యవహరిస్తున్నదని ఆర్బీఐ తెలిపింది. కనుక ‘పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టం యాక్ట్-2007’ను జీ-పే ఉల్లంఘించినట్లు పరిగణించలేమని వివరణనిచ్చింది. జీ-పేను నగదును ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు బదిలీ చేసే థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ (టీపీఏపీ)గా పరిగణిస్తున్నట్లు తెలిపింది.