శాన్ ఫ్రాన్సిస్కో : ఏదైనా రెస్టారెంట్‌, ఒక సినిమా హాల్, హాస్పిటల్‌, వ్యాపార సంస్థలు లేదా ఫంక్షన్ హాల్ చిరునామా తెలుసుకునేందుకు ఈ రోజుల్లో గూగుల్‌ మ్యాప్స్‌ ఎంతగా ఉపయోగపడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తికమక రోడ్లలోనూ ఈ యాప్‌ ద్వారా చిరునామాను‌ సులువుగా పట్టేయొచ్చు. ఈ క్రమంలో గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా ముందుగానే రెస్టారెంట్‌లో టేబుల్‌ బుక్‌ చేసుకోవడం, ఆస్పత్రిలో అపాయింట్‌మెంట్‌ తీసుకునే వెసులుబాటు ఉండే ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. దీనికోసం మనం ఎంపిక చేసుకున్న వాణిజ్య సంస్థతో నేరుగా ఛాట్‌ చేసే ఫీచర్‌ను కూడా గూగుల్ తీసుకొచ్చింది.

‘రెస్టారెంట్‌ ప్రతినిధితో ఛాట్‌ చేసి ముందుగానే టేబుల్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలపై ఆస్పత్రిలో అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకోచ్చు’ అని గూగుల్‌ సంస్థ తన బ్లాగ్‌లో వివరించింది. ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వాడుతున్న ఫోన్లలో అందుబాటులో ఉంటుందని తెలిపింది. బిజినెస్‌ ప్రొఫైల్‌ దగ్గరే మెసేజ్‌ ఆప్షన్‌ ఉంటుందని, దాని ద్వారా ఛాట్‌ చేయొచ్చని సంస్థ తెలిపింది.సదరు వాణిజ్య సంస్థ రిజిస్టర్‌ అయి ఉంటేనే ఈ ఆఫ్షన్‌ కనిపిస్తుంది’ అని గూగుల్ మ్యాప్స్ ప్రొడక్ట్ మేనేజర్ ఆదిత్యా టెండూల్కర్ బ్లాగ్ తెలిపారు. 

ఒకవేళ యూజర్లు స్థానిక బిజినెస్‌ల వివరాలను కూడా తెలుసుకోవాలనుకుంటే సెర్చింజన్ జెయింట్ ‘మై బిజినెస్ యాప్’ ఇన్ స్టాల్ చేసుకోవాలి. తదుపరి మెసేజెస్ పొందొచ్చు. ‘మై బిజినెస్ యాప్’ అనేది చిన్న వ్యాపార యజమానులకు సాయ పడేందుకు రూపొందించిన ఫ్రీ టూల్. గూగుల్ ద్వారా ఆన్‌లైన్‌లో కస్టమర్లతో కనెక్ట్ కావడానికి ఇది వెసులుబాటు కలిగిస్తుంది. ఫేస్ బుక్ లోనైతే ‘పేజేస్’లో కనెక్ట్ కావచ్చు. 

యాపిల్ ఫోన్లు వాడొద్దన్న ఫేస్ బుక్ సీఈఓ జుకర్ బర్గ్ 
యాపిల్, ఫేస్‌బుక్‌ల మధ్య పరోక్ష యుద్ధం నడుస్తున్నది. తమ ఉద్యోగులు యాపిల్ ఫోన్లను వాడొద్దంటూ ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్ ఆదేశించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆపిల్ సీఈవో టిమ్‌కుక్ మాట్లాడుతూ యూజర్ల వ్యక్తిగత జీవితాలు, గోప్యతకు భంగం వాటిల్లకుండా యాపిల్ చూస్తుంటుందని అన్నారు. గోప్యత మనిషి హక్కు అని ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అయితే ఈ వ్యాఖ్యలకు నొచ్చుకున్న జుకర్‌బర్గ్ తన కార్యాలయంలోని ఎగ్జిక్యూటివ్‌లను పిలిచి ఇకపై సంస్థ ఉద్యోగులు యాపిల్ ఉత్పత్తులను, ఫోన్లను వాడవద్దంటూ ఆదేశించారు. ఫేస్‌బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారం చోరీ అవుతున్నదని గతంలో పుకార్లు వచ్చాయి. కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణం వెలుగుచూసినప్పుడు ఈ పుకార్లు షికార్లు కొట్టాయి.