న్యూఢిల్లీ: భారత్‌లో ఐ-ఫోన్ల అసెంబ్లింగ్‌ యూనిట్‌ను టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌ ప్రారంభించే అవకాశం ఉంది. తమిళనాడులో శ్రీపెరంబుదూర్‌లో ఉన్న ఫ్యాక్స్‌కాన్‌ ప్లాంట్‌లో వీటి అసెంబ్లింగ్‌ ప్రక్రియను జరగనుంది. వచ్చే ఏడాది ఈ పని మొదలు కావొచ్చని సంబంధిత వర్గాల కథనం. ప్రధానంగా ఐఫోన్‌-శ్రీ శ్రేణి ఫోన్లు లాంటి అత్యంత ఖరీదైన మోడళ్లను తైవాన్ కేంద్రంగా పని చేస్తున్న ‘ఫ్యాక్స్‌కాన్‌’ సంస్థ  అసెంబ్లింగ్‌ చేయనుందని ఆ వర్గాలు తెలిపాయి. ఐఫోన్ టెన్, దాని తర్వాతి శ్రేణి ఫోన్లు.. ఐఫోన్ ఎక్స్, ఎక్స్ ఎస్, ఎక్స్ ఆర్ వంటి ఖరీదైన ఫోన్ల అసెంబ్లింగ్ ఇక్కడే జరుగనున్నదని తెలుస్తున్నది. 

కొత్త శిఖరాలకు ఆపిల్ వ్యాపారం
ఈ పరిణామం తర్వాత మనదేశంలో ఆపిల్‌ వ్యాపారం మరో కొత్త శిఖరాలకు చేరుకునే అవకాశం ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఐఫోన్ల తయారీ నిమిత్తం ప్లాంట్‌ సామర్థ్యం విస్తరణ కోసం ఫాక్స్ కాన్ రూ.2500 కోట్ల పెట్టుబడి పెడుతోందని తమిళనాడు రాష్ట్ర పరిశ్రమల మంత్రి ఎం.సి.సంపత్‌ తెలిపారు. ఈ విస్తరణతో మరో 25,000 మందికి ఉద్యోగావకాశాలు లభించొచ్చని చెప్పారు. మరోవైపు శ్రీపెరంబుదూర్‌ ప్లాంట్‌లోనే షామీ మోడల్ స్మార్ట్ ఫోన్లను కూడా ఇప్పటికే ఫాక్స్‌కాన్‌ తయారీ చేస్తోంది. కానీ దీనిపై అధికారికంగా స్పందించేందుకు అటు ఆపిల్, ఇటు ఫాక్స్‌కాన్ యాజమాన్యాలు నిరాకరించాయి. 

బెంగళూరులో విస్టన్ ద్వారా ఐఫోన్ ఎస్ఈ, ఆర్ఎస్ అసెంబ్లింగ్
కాగా విస్ట్రన్‌ కార్పోరేషన్‌ ద్వారా బెంగళూరులో ఐ ఫోన్‌ ఎస్‌ఈ, ఆర్‌ఎస్‌ మోడళ్లను మాత్రమే మనదేశంలో ఆపిల్ కంపెనీ అసెంబ్లింగ్ చేస్తున్నది. అలాగే చెన్నై ప్లాంట్‌లో గతంలో నోకియా ఫోన్లను తయారు చేసిన ఫాక్స్‌కాన్‌ సంస్థ.. రాష్ట్ర ప్రభుత్వంతో వచ్చిన విబేధాల వల్ల 2014లో ఉత్పత్తిని నిలిపివేసింది. రూ.21 వేల కోట్ల పన్ను వివాదం సద్దుమణగడంతో తాజాగా ఆ ప్లాంట్‌లో ఆపరేషన్స్ మొదలుపెట్టినట్టు  సమాచారం.

కస్టమర్లకు త్వరలో ‘రియల్‌ మీ’ బడ్జెట్ ఫోన్?  
చైనా స్మార్ట్ ఫోన్ మేజర్ ‘ఒప్పో’ సబ్ బ్రాండ్ రియల్‌మీ త్వరలో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను తన కస్టమర్లకు అందుబాటులోకి తేనున్నది. ‘రియల్‌ మీ ఎ1’ పేరుతో రానున్న ఈ ఫోన్ ధర రియల్‌మీ యూ1 3జీబీ ర్యామ్/32 జీబీ వేరియంట్ ధర రూ.11,999. 4జీబీ ర్యామ్/64 జీబీ వేరియంట్ ధర రూ.14,499 మాత్రమే ఉండవచ్చు. అయితే, ఇంతకుమించి వివరాలు వెల్లడికాలేదు. ధర రూ. 10వేల లోపు ఉండొచ్చని మాత్రం సమాచారం. ఇందులో ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో పీ70 ప్రాసెసర్, 2జీబీ, 3జీబీ ర్యామ్ వేరియంట్లు ఉన్నట్టు సమాచారం. డ్యూయల్ కెమెరా కూడా ఉన్నట్టు తెలుస్తోంది.