Asianet News TeluguAsianet News Telugu

సంచలనం: అమెజాన్‌ చెంతకు ఇంద్రా నూయి

భారత సంతతికి చెందిన పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి రిటైల్ ‘ఈ- దిగ్గజం’ అమెజాన్ బోర్డు డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. గతేడాది అక్టోబర్ లో పెప్సికో సీఈఓగా వైదొలిగిన ఇంద్రా నూయి.. అమెజాన్ సంస్థ డైరెక్టర్ల బోర్డులో నియమితురాలైన ఐదో మహిళ కావడం విశేషం.

Former Pepsi CEO Indra Nooyi Becomes Second Woman to Join Amazon Board
Author
Washington, First Published Feb 26, 2019, 10:26 AM IST

వాషింగ్టన్‌: శీతల పానీయాల తయారీ సంస్థ ‘పెప్సికో’ మాజీ సీఈఓ భారత సంతతికి చెందిన అమెరికన్ ఇంద్రా నూయి ఈ- కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ బోర్డు సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఆమె అమెజాన్‌ ఆడిట్‌ కమిటీలో తన సేవలు అందించనున్నారని ఈ మేరకు అమెజాన్‌ యాజమాన్యం ఓ ప్రకటన చేసింది.

ఇంద్రా నూయి చేరికతో అమెజాన్‌ బోర్డు సభ్యుల్లో మహిళల సంఖ్య ఐదుకు చేరింది. కంపెనీ కొత్త పాలసీ ప్రకారం వివిధ కంపెనీల్లో ఉత్తమ సేవలు అందించిన, అందిస్తున్న కార్పోరేట్‌ దిగ్గజాలను బోర్డు డైరెక్టర్లుగా నియమిస్తూ వస్తోంది. ఆమెకు అమెజాన్ కంపెనీ కామన్ స్టాక్ నుంచి 549 షేర్లకు కేటాయించింది. వచ్చే ఏడాది మే 15 నుంచి మూడు దఫాలుగా కేటాయిస్తుంది. 

అదే విధంగా మహిళా ప్రాధాన్యం పెంచే క్రమంలో గతేడాది స్టార్‌బక్స్‌ కార్పోరేషన్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రోసాలిండ్‌ బ్రూవర్‌ను బోర్డు డైరెక్టర్‌గా నియమించిన అమెజాన్‌... జామీ గోరెలిక్‌, జూడిత్‌ మెగ్రాత్‌, పాట్రిసియా స్టోన్సిఫర్‌లకు అవకాశం కల్పించింది. తాజాగా ఇంద్రా నూయి నియామకంతో 11 మంది సభ్యులతో కూడిన బోర్డులో మహిళల సంఖ్య ఐదుకు చేరింది.

కాగా శీతల పానీయాలు, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ తయారీలో ప్రపంచ రెండో అగ్రగామి సంస్థ, అమెరికాకు చెందిన ‘పెప్సీకో’  సీఈవోగా పనిచేసిన ఇండో-అమెరికన్‌ ఇంద్రా నూయి తన పదవి నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. 12 ఏళ్ల పాటు కంపెనీకి సారథ్యం వహించిన ఆమె గతేడాది అక్టోబర్‌ మూడో తేదీన తన బాధ్యతల నుంచి వైదొలగారు.  ఆమె స్థానంలో కంపెనీ ప్రెసిడెంట్‌ రామన్‌ లగుర్తా నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.

అమెజాన్ సీఈఓ కమ్ చైర్మన్‌గా ఉన్న జెఫ్‌ బెజోస్‌తోపాటు మద్రోనా వెంచర్‌ గ్రూపు స్థాపకులు టామ్‌ అల్‌బర్గ్‌, స్టార్‌బక్స్‌ సీఓఓ రోసాలిండ్‌ బ్రూవర్, అమెరికా మాజీ డిప్యూటీ అటార్నీ జనరల్‌ జామీ గోరెలిక్‌ 
డీన్‌ ఆఫ్‌ కార్నెల్‌ టెక్‌ డానియల్‌ హట్టెన్‌లోచర్‌,  ఎంటీవీ నెట్‌వర్క్‌ మాజీ సీఈఓ జూడిత్‌ మెగ్రాత్, 
ఆపిల్‌ మాజీ ఎగ్జిక్యూటివ్, పాల్‌ సీఈఓ జొనాథన్‌ రూబీన్‌స్టీన్‌, ది రీడర్స్‌ డైజెస్ట్‌ అసోసియేషన్‌ మాజీ సీఈఓ థామస్‌ రైడర్, మార్తా టేబుల్‌ సీఈఓ పెట్రిసియా స్టోన్సిఫర్‌, కార్నింగ్‌ సీఈఓ వెండల్‌ వీక్స్‌ డైరెక్టర్లుగా ఉన్నారు. వారికి పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి జత కలిశారు.

ఇంద్రా నూయిని తమ డైరెక్టర్‌గా ఎంపిక చేసుకున్నందుకు థ్రిల్లింగ్ గా ఉన్నదని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. రోజ్ బ్రెవర్, ఇంద్రా నూయిలను అమెజాన్ తన డైరెక్టరలుగా ఈ నెల ప్రారంభంలో నియమించుకున్నది. 

ఇంద్రా నూయి 2006 అక్టోబర్ నుంచి పెప్సికో సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించారు. పెప్సికో బోర్డు చైర్మన్ గా 20107 మే నుంచి ఈ నెలాఖరు వరకు బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు పెప్సికో బోర్డు డైరెక్టర్‌గా, అధ్యక్షురాలు, చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. 1994లో పెప్సికోలో చేరిన తర్వాత సంస్థ ఫైనాన్స్, కార్పొరేట్ స్ట్రాటర్జీ అండ్ డెవలప్ మెంట్, ప్లానింగ్ విభాగాల్లో పని చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios