న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ‘వాట్సప్’ తన వినియోగదారుల రోజువారీ జీవితంలో భద్రత, వారి వ్యక్తిగత గోప్యత వంటి అంశాలపైనే ద్రుష్టి సారిస్తుందని తెలిపింది. బూటకపు సందేశాలను నివారించేందుకు వ్యవస్థను అందుబాటులోకి తేవాలని నరేంద్రమోదీ ప్రభుత్వ అభ్యర్థనపై వాట్సప్ ఉపాధ్యక్షుడు చిరిస్ డానియల్ పై విధంగా వ్యాఖ్యానించారు. అలాగే భారతదేశ పెట్టుబడుల్లో భాగస్వామ్యం కోసం చిన్న, మధ్య తరగతి పారిశ్రామిక వేత్తల బిజినెస్ విస్తరణకు చేయూతనిస్తామని తెలిపారు. 

‘మా సంస్థ నిరాడంబరత, నాణ్యత, భద్రత, వ్యక్తిగత గోప్యత అనే నాలుగు అంశాలపైనే ఫోకస్ పెట్టింది. తమ సంస్థ నిర్వహించే ప్రతి సేవలోనూ ఈ విలువలకు ప్రాధాన్యం ఇస్తుంది. రోజువారీగా మా సేవలను వినియోగించుకునే కస్టమర్ల ఆలోచనలు, విలువలకు పెద్ద పీట వేయడమే మా విధానం’ అని తెలిపారు. 

130 కోట్ల మంది వాట్సప్ వినియోగదారుల్లో 20 కోట్ల మంది భారతీయులే ఉన్నారు. మూక దాడులను ప్రోత్సహిస్తున్న హేయమైన నేరాలను అరికట్టేందుకు వాట్సప్ లో స్ప్రెడ్ అయ్యే ‘సినిస్టర్’ మెస్సేజ్’లు ఎక్కడ నుంచి వస్తున్నాయో గుర్తించేందుకు సొల్యూషన్ నెలకొల్పాలని వాట్సప్ యాజమాన్యాన్ని భారత ప్రభుత్వం పదేపదే కోరుతోంది. కానీ దీనివల్ల వినియోగదారుల వ్యక్తిగత గోప్యతపై ప్రభావం చూపుతుందని పేర్కొన్న వాట్సప్.. మోదీ ప్రభుత్వ డిమాండ్‌ను తిరస్కరించింది. 

వాట్సప్‌ను ప్రజలకు సున్నితమైన అంశాలపై చర్చా వేదికగా మార్చాలన్నదే తమ అభిమతం అని సంస్థ యాజమాన్యం చెబుతోంది. బూటకపు, తప్పుడు ప్రచారాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడంపై ద్రుష్టి సారించామన్నారు క్రిష్ డానియల్. ఓలా, ఫ్లిప్ కార్ట్, జొమాటో, మేక్ మై ట్రిప్ వంటి సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపుతాయన్నారు.  

సమీప భవిష్యత్ లో దేశంలోని 15 రాష్ట్రాల పరిధిలో తమ బిజినెస్ టూల్స్‌పై వినియోగదారులకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. స్టార్టప్ ఇండియా యాత్ర ప్రోగ్రాంలో భాగంగా మున్ముందు 60వేలకు పైగా బిజినెస్ లపై ప్రభావం చూపేలా ముందుకు సాగుతున్నట్లు తెలిపింది.