న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం నెట్‌వర్క్‌ రిలయన్స్‌ జియోకు ఇంటర్‌ కనెక్షన్‌ పాయింట్లను కేటాయించేందుకు నిరాకరించిన భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలపై భారీ జరిమానా విధించాలన్న నిర్ణయానికి డిజిటల్‌ కమ్యునికేషన్స్‌ కమిషన్‌ (డీసీసీ) ఆమోదం తెలిపింది. 

ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా తమకు ఇంటర్‌ కనెక్టివిటీ పాయింట్లను కేటాయించడానికి నిరాకరించాయని రిలయన్స్‌ జియో టెలికం శాఖకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎయిర్ టెల్, వొడాఫోన్ సంస్థలకు రూ. 3,050 కోట్ల జరిమానా విధించాలని డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీపీ)కి భారతీయ టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) డీసీసీకి 2016 అక్టోబర్ నెలలో సిఫారసు చేసింది.

ట్రాయ్‌ సిఫారసును సమర్థిస్తూ వాటిపై భారీ జరిమానా విధించేందుకు అంగీకరిస్తూ డీసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం టెలికాం రంగంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో వీటిపై విధించిన జరిమానాను సవరించే విషయమై పునరాలోచించాలని ట్రాయ్‌కి సూచించినట్లు డీసీసీ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

సరైన అనుసంధాన పాయింట్లను కేటాయించని కారణంగా నెట్‌వర్క్‌ సమస్యలు తలెత్తి దాదాపు 75 శాతం కాల్స్‌ కనెక్ట్‌ అవడం లేదంటూ రిలయన్స్ జియో ట్రాయ్‌ని ఆశ్రయించడంతో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలపై జరిమానా విధించాలని ట్రాయ్‌ డీసీసీకి ప్రతిపాదించింది.‌

టెలికం రంగంలో తీవ్ర ఆర్థిక సమస్యల నేపథ్యంలో రూ.3,050 కోట్ల జరిమానాను అమలు చేసే ముందు దీన్ని సవరించే విషయంలో ట్రాయ్‌ సూచనలను తీసుకోవాలని డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్‌ నిర్ణయించింది. 

ఇందులో ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లకు రూ.1,050 కోట్ల చొప్పున, ఐడియాపై రూ.950 కోట్ల జరిమానా అమలు చేయాల్సి ఉంది. వొడాఫోన్, ఐడియాలు విలీనమై ఒకే సంస్థగా ఏర్పడడంతో ఇప్పుడు ఉమ్మడి జరిమానాను వొడాఫోన్‌ ఐడియా చెల్లించాల్సి ఉంటుంది. 

నాణ్యమైన సేవలను తన కస్టమర్లకు అందించనందుకు రిలయన్స్‌ జియోపై కూడా పెనాల్టీ విధించాల్సి ఉంటుందని, నాణ్యమైన సేవలందించే ప్రాథమిక బాధ్యతను ఇతరులపై మోపవచ్చా? అంటూ డీసీసీలో భాగమైన ఓ శాఖా కార్యదర్శి ప్రశ్నించగా దీన్ని డీసీసీ సభ్యులు కొట్టిపారేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.