వాషింగ్టన్‌: అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం వల్ల ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం ఆపిల్‌ కంపెనీ విలువ పతనమవుతోంది. తాజాగా ఉభయ దేశాల పరస్పర సుంకాల పెంపు నేపథ్యంలో యాపిల్‌ కంపెనీ విలువ శుక్రవారం నాటి మార్కెట్‌లో ఏకంగా 44 బిలియన్‌ డాలర్లు పడిపోయింది. ఐఫోన్‌ల ఉత్పత్తికి చైనా ప్రముఖ కేంద్రంగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సుంకాల పెంపు నిర్ణయం ఆపిల్‌ సంస్థపై ప్రత్యక్షంగా కనిపించింది. చైనాపై అధికంగా ఆధారపడడమే ఆపిల్‌కు ఇప్పుడు ముప్పుగా పరిణమిస్తోంది. చైనా కేంద్రంగా పని చేస్తున్న అమెరికన్‌ కంపెనీలు ప్రత్యామ్నాయాల్ని వెతుక్కోవాలని గతవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఇప్పటికిప్పుడు ఆపిల్‌ సంసిద్ధంగా లేకపోవడమే విలువ పతనానికి కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ఐఫోన్‌లలో 25శాతం అమెరికాలో అమ్ముడవుతున్నాయి. కానీ, 20శాతం ఐఫోన్‌ ఉత్పత్తుల్లో వాడే ఆపిల్ మౌలిక వసతులను చైనా నుంచి తరలించడానికి మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని ప్రముఖ విశ్లేషకులు డానియెల్‌ ఇవ్స్‌ తెలిపారు.

కనిష్ఠంగా ఐదు నుంచి ఏడు శాతం వసతుల్ని తరలించడానికే 18 నెలల సమయం పడుతుందని అంచనా వేశారు. మరోవైపు ఆపిల్‌ ఉత్పత్తి కేంద్రాన్ని తరలించడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని ఆపిల్‌ ఉత్పత్తులతో సంబంధం ఉన్న కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

నైపుణ్యం గల ఉద్యోగులు, తక్కువ ధరలో ముడిపదార్ధాలు చైనా వెలుపల దొరకడం కష్టతరమైన పని అని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ తరలించినా వీటికోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో ఉత్పత్తి వ్యయం పెరిగి ఆపిల్‌ వస్తువుల ధరలను పెంచడం అనివార్యం అవుతుంది.

ఇక ఆర్థిక ప్రయోజనాలను పక్కబెడితే.. చైనాలో నిరుద్యోగం పెరిగే ప్రమాదం ఉంది. చైనాలో ప్రైవేట్‌ ఉద్యోగాల కల్పనలో ఆపిల్‌, దాని అనుబంధ సంస్థలదే సింహభాగం. ఈ నేపథ్యంలో యాపిల్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకుంటే చైనా దిద్దుబాటు చర్యలకు పూనుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మరో సెల్‌ఫోన్‌ దిగ్గజం హువావే చైనా విపణిని ఒడిసిపట్టే అకాశం ఏర్పడుతుంది. చైనాలో ఆపిల్‌ ఉనికికే ఇది పెద్ద ప్రమాదం అని విశ్లేషకులు తెలిపారు.