Asianet News TeluguAsianet News Telugu

మిడిల్‌క్లాస్ ‘ఐటీ’ సంస్థకు ఎల్&టీ ఆఫరే వరం: ప్రమోటర్లకు మైండ్‌ట్రీ బోర్డు అడ్వైజ్

‘మైండ్ ట్రీ’ మేనేజ్మెంట్ ముందు ఎల్ అండ్ టీ ఆఫర్‌ను ఆమోదించడం తప్ప మరో మార్గాంతరం లేదని ప్రమోటర్లకు సంస్థ బోర్డు హితవు చెప్పేసింది. అడ్డుగోడలు కట్టే కంటే వాటా విలువ పెంచుకునేందుకు బేరసారాలు చేయాలని సూచించింది.

కాఫీ డే అధిపతి వీజీ సిద్ధార్థ నుంచి 20.4 శాతం వాటా కొనుగోలు చేసిన ఎల్ అండ్ టీ ఓపెన్ ఆఫర్ ద్వారా మెజారిటీ వాటా కొనుగోలు ప్రయత్నాలు చేస్తోంది. అందుకు అవసరమైన చర్యలన్నీ చేపట్టిన నేపథ్యంలో టేకోవర్ యత్నాలను అడ్డుకుంటే న్యాయ, వాణిజ్యపరమైన సమస్యలు వస్తాయని హెచ్చరించింది.

మిడిల్ క్లాస్ ఐటీ సంస్థను టేకోవర్ చేయడానికి ఎల్ అండ్ టీ వంటి సంస్థ ముందుకు రావడమే గొప్ప అని ఐటీ పరిశ్రమ ప్రముఖులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 

Consider L&T Offer, Mindtree board tells promoter group
Author
Hyderabad, First Published Mar 21, 2019, 1:54 PM IST

లార్సెన్‌ అండ్‌ టర్బో (ఎల్‌&టీ) బలవంతపు టేకోవర్‌ ప్రయత్నాలను అడ్డుకునేందుకు మైండ్‌ ట్రీ ప్రమోటర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు ఎల్‌&టీ చేసిన ప్రయత్నాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రమోటర్ల గ్రూప్‌కు బోర్డు సూచించింది.

అందువల్లే ‘బై బ్యాక్’ ఆఫర్ వాటాదారులకు ఇవ్వాలని బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయాన్ని వాయిదావేశారని తెలుస్తున్నది. ఎల్‌&టీ ఆఫర్‌ను కాదంటే న్యాయపరమైన, వాణిజ్యపరమైన సవాళ్లు తలెత్తుతాయని బోర్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని సమాచారం. 

ఇంజినీరింగ్ కం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థగా ఎల్ అండ్ టీ చేసిన ప్రతిపాదనకు అడ్డుగోడలు నిర్మించడానికి బదులు వాటాలపై అధిక ధర పొందేందుకు చర్చించాలని కొందరు డైరెక్టర్లు ప్రమోటర్ల గ్రూప్‌నకు సూచించారని తెలుస్తోంది.

‘మైండ్ ట్రీ (వ్యవస్థాపకులు) యాజమాన్యం’ ప్రస్తుత షేర్ ఓపెన్ ఆఫర్ ధర రూ.980కు కనీసం రూ.200 అదనంగా డిమాండ్ చేయొచ్చునని ఒక సీనియర్ ఇన్వెస్టర్ ఒకరు సూచించినట్లు సమాచారం. 

అదే సమయంలో వీజీ సిద్ధార్థకు చెందిన 20.4 శాతం వాటా కొనుగోలు పూర్తి వివరాలు తెలుసుకోవాలని మైండ్ ట్రీ బోర్డు కోరింది. సిద్ధార్థకు వాటా కింద రూ.3,269 కోట్లు చెల్లించింది ఎల్ అండ్ టీ.

మైండ్ ట్రీ సంస్థలో మొత్తం 66.32 శాతం వాటా స్వాధీనానికి రూ.7,464 కోట్ల వ్యయానికి సిద్ధంగా ఉన్నట్లు ఎల్ అండ్ టీ సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపింది.  ఈ నేపథ్యంలో మైండ్ ట్రీ వ్యవస్థాపక డైరెక్టర్ల దారులన్నీ మూసుకుపోయాయని ఐటీ పరిశ్రమ విశ్లేషకులు, ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

‘ఈ మధ్యస్థాయి ఐటీ కంపెనీ’ యాజమాన్యానికి టేకోవర్‌ ఆఫర్‌ అంగీకరించడం తప్ప మరో ప్రత్యామ్నాయం కన్పించడం లేదని వారంటున్నారు. మరికొంత కాలానికైనా మైండ్‌ట్రీ యాజమాన్యం ఎల్‌ అండ్‌ టీతో విభేధాలను పరిష్కరించుకోక తప్పదన్నారు.

మైండ్‌ట్రీలో అతిపెద్ద షేర్‌హోల్డరైన కేఫ్‌ కాఫీడే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థకు చెందిన 20.4 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా ఎల్‌ అండ్‌ టీ ఈ బలవంతపు టేకోవర్‌ ప్రయత్నాలకు తెరలేపింది. మైండ్‌ట్రీ షేర్‌హోల్డర్ల నుంచి మరో 31 శాతం మేర వాటా కొనుగోలు చేసేందుకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. 

అందుకోసం మైండ్ ట్రీ సంస్థలో ఒక్కో షేర్‌కు రూ.980 చెల్లించేందుకు ముందుకు వచ్చింది. అంతేకాదు, ఓపెన్‌ మార్కెట్‌ నుంచి మరో 15 శాతం వాటా కొనుగోలుకు బ్రోకర్ల ద్వారా ఆర్డర్లు పెట్టింది. మొత్తం 66 శాతం వాటా కోసం దాదాపు రూ.10,800 కోట్లు ఆఫర్‌ చేసింది. ఎల్‌ అండ్‌ టీ ప్రయత్నాలను మైండ్‌ట్రీ వ్యవస్థాపకులు ప్రతిఘటిస్తున్నారు.

ఎల్‌ అండ్‌ టీని నిలువరించేందుకు మైండ్‌ట్రీ ప్రమోటర్లు, వ్యవస్థాపకులు ఐటీ ఇండస్ట్రీ వర్గాలు, ఇతరుల మద్దతు కూడగడుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా తమ కంపెనీని టేకోవర్‌ చేయకుండా ఎల్‌ అండ్‌ టీకి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

బలవంతపు టేకోవర్‌ ఐటీ రంగానికి ప్రతికూలంగా పరిణమించవచ్చని, నూతన పారిశ్రామికవేత్తల ఉత్సాహాన్ని నీరుగార్చవచ్చని మైండ్‌ట్రీ ప్రమోటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఐవీఆర్‌సీఎల్‌ గతంలో ఇదే తరహాలో మద్దతు కూడగట్టడం ద్వారా ఎస్సెల్‌ గ్రూపు టేకోవర్‌ ప్రయత్నాలను విజయవంతంగా తిప్పికొట్టింది.
 
మైండ్‌ట్రీ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవాలనుకునే షేర్‌హోల్డర్లకు ఎల్‌ అండ్‌ టీ ప్రకటించిన ఓపెన్‌ ఆఫర్‌ ఒక విధంగా సదవకాశమే. ఈ టేకోవర్‌ ప్రయత్నాలపై ఎక్కువగా ఆందోళన చెందుతోంది ఎల్‌ అండ్‌ టీ షేర్‌హోల్డర్లే. ఈ ఇంజనీరింగ్‌ దిగ్గజం కీలకేతర వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెడుతుండటం వారిని కలవర పెడుతోంది. 

అయితే మైండ్‌ట్రీ ప్రమోటర్ల అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతపు టేకోవర్‌కు ప్రయత్నిస్తున్న ఎల్‌ అండ్‌ టీ రిస్క్‌ తీసుకుంటోందన్న భావన కూడా వ్యక్తమవుతోంది. మైండ్‌ట్రీ బోర్డు షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనపై నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది.  

‘సమగ్ర చర్చ అనంతరం బోర్డు తన సమావేశాన్ని భవిష్యత్‌ తేదీకి వాయిదా వేయడం జరిగింది. షేర్ల తిరిగి కొనుగోలు ప్రతిపాదనకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’అని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు మైండ్‌ట్రీ సమాచారం అందించింది.

వీజే సిద్ధార్థ (58) కేఫ్‌ కాఫీ డే స్టోర్ల అధిపతి, మైండ్‌ట్రీలో ప్రధాన వాటాదారుగా కార్పొరేట్‌ రంగానికి సుపరిచితం. కొద్ది మందికే తెలిసిన విషయం ఏంటంటే.. సిద్ధార్థ ఒకప్పుడు ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకర్‌ కూడా. ఇన్వె స్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌లో అనుభవం మైండ్‌ట్రీ పెట్టుబడుల విషయంలో ఆయనకు బాగా కలిసి వచ్చింది. 

సంస్థ అభివృద్ధి చెందుతున్న కొద్దీ తన వాటాను పెంచుకుంటూ పోయిన సిద్ధార్థకు ఇప్పుడు భారీ లాభాల పంట పండించింది. 1999లో అశోక్‌ సూతా నేతృత్వంలో పది మంది కలిసి మైండ్‌ట్రీని స్థాపించారు. ప్రారంభ సంవత్సరంలో రూ.44 కోట్ల పెట్టుబడితో మైండ్‌ట్రీలో 6.6 శాతం వాటా తీసుకున్నారు. 

ఆ తర్వాత కాలంలో తన వాటాను క్రమంగా పెంచుకుంటూ పోయారు. 2012నాటికి మైండ్ ట్రీ కంపెనీలో సిద్ధార్థ వాటా 20.4 శాతానికి చేరుకుంది. మైండ్ ట్రీలో వాటా కొనుగోలు కోసం వీజీ సిద్ధార్థ మొత్తం రూ.340 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. 

ఈ వారంలో తన వాటాను ఎల్‌ అండ్‌ టీకి విక్రయించేందుకు రూ.3,269 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే, పెట్టిన పెట్టుబడిపై ఆయనకు దాదాపు పది రెట్ల ఆదాయం లభించనుందన్నమాట.


 

Follow Us:
Download App:
  • android
  • ios