చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ హువావే టెక్నాలజీస్‌ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌వో),  కంపెనీ వ్యవస్థాపకుడు రెన్ జెంగ్‌ఫే కుమార్తె మెంగ్‌ వాంగ్‌జోను కెనడా అధికారులు అరెస్ట్‌ చేశారు. అమెరికా అభ్యర్ధన మేరకు కెనడియన్‌ అధికారులు హువావే డిప్యూటీ చైర్మన్‌ను అరెస్ట్‌ చేశారన్న షాకింగ్‌ న్యూస్‌  పరిశ్రమ వర్గాలను విస్మయ పర్చింది. అంతేకాదు సీఎఫ్‌వోను త్వరగా అమెరికాకు రప్పించే చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 

ఇరాన్‌పై అమెరికా విధించే వాణిజ్యపరమైన నిబంధలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈ అరెస్టు జరిగింది. ఇరాన్ దేశానికి చైనా తమ ఉత్పత్తులను ఎగుమతి చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. ఇటీవలే అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో జీ 20 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య జరిగిన చర్చల్లో ఇరు దేశాలు సంధి కుదుర్చుకున్నాయి కూడా.

ఏప్రిల్ నెలలో అమెరికా ఫిర్యాదు మేరకు కెనడా అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తున్నది. హువావే బోర్డు డిప్యూటీ చైర్, కంపెనీ వ్యవస్థాపకుడు రెన్ జెంగ్‌ఫే కుమార్తె మెంగ్‌ వాంగ్‌జోను వాంకోవర్‌లో ఈ నెల ఒకటో తేదీన  అరెస్టు చేశామని కెనడా అధికారులు బుధవారం ప్రకటించారు. ఆమె బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనున్నదని న్యాయశాఖ ప్రతినిధి ఇయాన్ మెక్లాయిడ్ వెల్లడించారు. ఇంతకుమించి తాము ఎటువంటి వివరాలను అందించలేమన్నారు. 

మరోవైపు ఈ  పరిణామాన్ని  హువావే, చైనా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది మానవహక్కులకు తీవ్ర హానికరమైన చర్య అని పేర్కొంది. మెంగ్ ఎలాంటి  నిబంధనలను ఉల్లంఘించలేదని, తక్షణమే ఆమెను విడుదల చేయాలని ఒట్టావాలోని చైనీస్ రాయబార కార్యాలయం డిమాండ్‌ చేసింది. తాము  చట్టపరమైన అన్ని నిబంధనలను విధిగా పాటిస్తున్నామని హువావే ప్రకటించింది. అమెరికా తన పొరుగు దేశం పొరపాట్లను సరిదిద్దాలని కోరింది.

హువావే సీఎఫ్ఓ మెంగ్ వాంగ్‌జోను అరెస్టు చేసిన వెంటనే అమెరికా స్పందించడంతోపాటు కెనడాలోని చైనా దౌత్య కార్యాలయ సిబ్బంది నిరసనకు దిగారు. మరోవైపు ఇది అమెరికా-చైనా మధ్య నెలకొన్న ట్రేడ్‌వార్‌కు సంబంధించి తీవ్రమైన పరిణామంగా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వ్యాఖ్యానించింది.  హువావే సీఎఫ్ఓ మెంగ్‌ వాంగ్‌జో అరెస్ట్‌పై స్పందించడానికి అమెరికా న్యాయశాఖ నిరాకరించింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడే ఈ అంశాన్ని న్యాయశాఖకు సిఫారసు చేశారు.

‘5జీ’లో హువావే సంస్థ క్రుత్రిమ మేధస్సు, చిప్ మేకింగ్‌లో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తోంది. మున్ముందు అమెరికాలో అడుగు పెట్టకుండా భవిష్యత్‌లో తమకు ఎదురు రాకుండా హువావేను నిలువరించేందుకు సీఎఫ్ఓ మెంగ్ జోను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. మేరీలాండ్ సెనెటర్ చిరిస్ వాన్ హోల్లెన్ మాట్లాడుతూ హువావే సంస్థ నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలు వచ్చాయి.

తమ అధికారిని తప్పుడు ఆరోపణలపై అరెస్ట్ చేశారని హువావే ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టులో హువావే ఉత్పత్తులను ఆస్ట్రేలియా నిషేదించింది. అమెరికా ధరవరలకు భిన్నంగా హువావే ఆ దేశ మార్కెట్లోకి అడుగు పెడుతున్నదన్న విమర్శలు వచ్చాయి.