Asianet News TeluguAsianet News Telugu

వేరబుల్స్‌లో షామీ టాప్

చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం షామీ వేరియంట్స్ విక్రయాల్లో మొదటి స్థానంలో నిలిచిందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ వెల్లడించింది. తర్వాతీ స్థానంలో టైటాన్, శామ్‌సంగ్ ఉన్నాయి. 

Chinas Xiaomi tops Apple and Fitbit in smart tech wearables in Q3, analysts say
Author
New Delhi, First Published Dec 7, 2018, 9:57 AM IST

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షామీ దేశీయ మార్కెట్‌లో ధరించే పరికరాల (వేరబుల్స్‌) అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. షామీ దేశీయ విపణిలోకి ఎంఐ బ్యాండ్‌ 3 ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రవేశపెట్టింది. వేరబుల్స్‌ విభాగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయిలో అమ్మకాలు జరగడంతో షామీ ఈ విభాగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మూడో త్రైమాసికం ముగిసే సరికి 41 శాతం వాటాతో షామీ అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌(ఐడీసీ) తెలిపింది. మరో సంస్థ గోకీ ఇదే విభాగంలో 19 శాతం మార్కెట్‌ వాటాతో రెండో స్థానంలో ఉంది. టైటాన్‌, శామ్‌సంగ్‌, ఫాసిల్‌ తర్వాతీ స్థానాల్లో ఉన్నాయి. రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో త్రైమాసికంలో వేరబుల్స్‌ మార్కెట్‌ అమ్మకాలు 11 శాతం మేర తగ్గడం గమనార్హం.

ఈ ఏడాది వేరబుల్స్‌ విభాగంలో మొత్తంగా 8,97,000 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. మూడో త్రైమాసికంలో 1,02,000 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. దేశీయ మార్కెట్‌లో వేరబుల్స్‌ రంగం 17% వృద్ధి నమోదు చేసినట్లు ఐడీసీ నివేదికలో తెలిపింది. 2017తో పోలిస్తే ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 20% మేర షిప్‌మెంట్స్‌ తగ్గినా మొత్తంగా 77% వృద్ధి నమోదు చేయడం గమనార్హం. ఇప్పటివరకు భారత్‌లో వేరబుల్స్‌ విభాగంలో మునుపెన్నడూ లేనివిధంగా అత్యధిక అమ్మకాలతో ఎంఐ బ్యాండ్‌ 3 ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ చరిత్ర నెలకొల్పింది.

విక్రయానికి కెఫే కాఫీడే..?
కెఫే కాఫీడే, మైండ్‌ట్రీ లిమిటెడ్‌ సంస్థల నుంచి వైదొలుగాలని వీజీ సిద్ధార్థతోపాటు మరో ఐదుగురు పెట్టుబడిదారులు కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం. బెంగళూరుకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కె కె ఆర్‌ అండ్‌ కో ఆసక్తి చూపడంతో దానితో చర్చలు జరుపుతున్నారు. ఆ సంస్థ మైండ్‌ట్రీలో అత్యధిక వాటాలను కొనుగోలు చేయాలని భావిస్తోంది. 1999లో సిద్ధార్థ మైండ్‌ట్రీ సంస్థను 1999లో ప్రారంభించారు. ఆయన గత మార్చిలో డైరెక్టర్‌ పదవి నుంచి వైదొలగారు. 

సిద్ధార్థ , కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌కు, కాఫీడే ట్రేడింగ్‌ లిమిటెడ్‌కు మైండ్‌ ట్రీలో దాదాపు 21 శాతం వాటాలు ఉన్నాయి. మైండ్‌ట్రీ మార్కెట్‌ విలువ రూ.16,000 కోట్లుగా అంచనా వేశారు. దీనిపై మైండ్‌ట్రీ ఛైర్మన్‌ కృష్ణకుమార్‌ మాట్లాడుతూ ‘మాకు చాలా మంది పెట్టుబడిదారులు ఉన్నారు. వీరంతా ఎంతోకాలంగా మైండ్‌ట్రీ అభివృద్ధికి కృషి చేశారు. వారు వాటాలను ఆర్థిక అవసరాలను బట్టి మార్చుకుంటుంటారు. దీనిలో మైండ్‌ట్రీ జోక్యం ఉండదు’ అని చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios