గీత దాటారో తస్మాత్ జాగ్రత్త: ఈ-కామర్స్ సంస్థలకు సీసీఐ వార్నింగ్

ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీల విధానాలపై తీవ్ర ఆరోపణలు చేసిన వ్యాపారుల సంఘాల బాటలో కాంపిటీషన్‌‌ కమిషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (సీసీఐ) చేరింది

CCIs Self-Regulation Relief For Ecommerce Upsets Traders Bodies

న్యూఢిల్లీ: ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీల విధానాలపై తీవ్ర ఆరోపణలు చేసిన వ్యాపారుల సంఘాల బాటలో కాంపిటీషన్‌‌ కమిషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (సీసీఐ) చేరింది. వివిధ కంపెనీలతో కుదుర్చుకునే ఒప్పందాలను ఈ ‘ఆన్​లైన్​ రిటైల్’ సంస్థలు రహస్యంగా ఉంచుతున్నాయని మండిపడింది. కొన్ని కంపెనీలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుంటూ మొబైల్‌‌ఫోన్‌‌ వంటి ప్రొడక్టులను తక్కువ ధరలకు అందజేస్తున్నాయని అభ్యంతరం తెలిపింది.

ఫలితంగా రిటైలర్లకు అన్యాయం జరుగుతోందని సీసీఐ భావిస్తోంది. ఇలాంటి పద్ధతులను వదిలేయకుంటే విచారణకు ఆదేశించాల్సి ఉంటుందని అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌ వంటి ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీలను హెచ్చరించింది. ఇవి అనుసరిస్తున్న పద్ధతులు అభ్యంతరకరంగా ఉంటున్నాయని సీసీఐ చైర్మన్‌‌ అశోక్‌‌ కుమార్‌‌ గుప్తా స్పష్టం చేశారు. 

కస్టమర్ల సెర్చ్‌‌లను బట్టి ప్రొడక్టులకు, సేవలకు ఇవి కేటాయించే ర్యాంకుల వల్ల కొనుగోలుదారులకు నష్టం కలుగుతుందని సీసీఐ ఆరోపిస్తోంది. ర్యాంకింగ్‌‌లపై స్టడీ చేసి తయారు చేసిన రిపోర్టును కొన్ని రోజుల క్రితం విడుదల చేసింది. షియోమీ, వివో, రియల్‌‌మీ వంటి కంపెనీలు విడుదల చేసే కొత్త మోడల్స్‌‌ కేవలం కొన్ని ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీల ద్వారా మాత్రమే లభిస్తుండటంపై సీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

తమ విధానాల వల్ల మార్కెట్లో పోటీకి కలుగుతున్న నష్టాన్ని కంపెనీలు భర్తీ చేయకుంటే చర్యలు ఉంటాయని, విచారణకూ ఆదేశిస్తామని సీసీఐ చైర్మన్ అశోక్ కుమార్‌‌ గుప్తా హెచ్చరించారు. ఇటీవల పీహెచ్‌‌డీ చాంబర్‌‌ ఆఫ్‌‌ కామర్స్‌‌ అండ్‌‌ ఇండస్ట్రీ పోటీ చట్టంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ తాము లేవనెత్తిన అభ్యంతరాలు ఎంతో ముఖ్యమైనవని స్పష్టం చేశారు. 

‘అయితే పరిస్థితులను చక్కదిద్దడానికి కంపెనీలకు మనం తగినంత టైం ఇవ్వాలి. ప్రతి అంశంపై మా అభ్యంతరాలను, అనుమానాలను రిపోర్టులో పేర్కొన్నాం. వీటిపై కేసు కూడా పెట్టవచ్చు. ప్రస్తుతం అన్ని అంశాలనూ పరిశీలిస్తున్నాం. రేపు ఎవరైనా ఇదే విషయంపై ఆందోళన చేస్తే సమస్య పెద్దది అవుతుంది’’ అని సీసీఐ చైర్మన్ అశోక్ కుమార్ గుప్తా వివరించారు.

భారతీయ స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌‌ దాదాపు 45 శాతం వాటా ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీలకే ఉంది. దీనివల్ల రిటైలర్లు, చిన్న షాపులు ఎంతో నష్టపోతున్నాయని వ్యాపారుల సంఘం ఇటీవల సీసీఐకి ఫిర్యాదు చేసింది. గతంలో ఇదే విషయమై ఆందోళనలూ చేసింది.

ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీల వ్యాపార విధానాలపై స్టడీ చేశాక ‘మార్కెట్‌‌ స్టడీ ఆన్‌‌ ఈ–కామర్స్‌‌ ఇన్‌‌ ఇండియా’ పేరుతో తయారు చేసిన నివేదిక విడుదల చేసింది. భారీ డిస్కౌంట్లు ఇవ్వడానికి వనరులు ఎలా సమకూరుతున్నాయో తెలియడం లేదని పేర్కొన్నది. 

‘డిస్కౌంట్ల వల్ల కస్టమర్లకు తక్కువ ధరలకు వస్తువులు వస్తాయి. ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీలకు ఆదరణ పెరుగుతుంది. అయితే ఇలాంటి ధరల విధానాల వల్ల మార్కెట్‌‌ సప్లై విధానానికి నష్టం కలుగుతుంది. పైగా అందరి మధ్యా సమాన పోటీ ఉందా ? అనే ప్రశ్న కూడా వస్తుంది’’ అని సీసీఐ నివేదిక తెలిపింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios