ముంబై: కోట్ల మంది భారతీయులకు టెలిఫోన్‌ వసతి అందుబాటులోకి తెచ్చిన భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌( బీఎస్‌ఎన్‌ఎల్‌) నేడు కష్టాల్లోకి కూరుకుంది. కనీసం సిబ్బంది జీతాలు కూడా చెల్లించలేని స్థితిలోకి పడిపోయింది. 

బీఎస్ఎన్ఎల్ స్థితిగతులపై చర్చించేందుకు మంగళవారం బీఎస్ఎన్ఎల్ యాజమాన్యంతో ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) సమావేశం అవుతోంది. సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)తోపాటు నాలుగు ప్రత్యామ్నాయాలపై చర్చించనున్నట్లు సమాచారం.

బీఎస్ఎన్ఎల్‌లో ఫిబ్రవరిలో పక్షం రోజులు జీతాలు ఆలస్యంగా ఇవ్వగా, మార్చిలోనూ అదే పరిస్థితి ఎదుర్కోనున్నది. పాలకుల విధానాలతో బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలను ఉపయోగించుకుంటూ నడుస్తున్న ఎయిర్‌టెల్‌, ఐడియా, రిలయన్స్, వొడాఫోన్‌ లాంటి సంస్థలు లాభాలు గడిస్తున్నాయి.

ప్రయివేట్ సంస్థలకు విచ్చలవిడిగా రాయితీలిస్తూ 4జీ, 5జీ స్పెక్ట్రం సేవలను కట్టబెడుతూ లాభాలు కొల్లగొట్టేలా సహకరిస్తున్న మన పాలకులు బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఏటా ఇవ్వాల్సిన సబ్సిడీలను, రాయితీలనూ ఇవ్వకుండా 4జీ, 5జీ స్పెక్ట్రం ఇవ్వకుండా వినియోగదారులను దూరం చేసే కుట్రకు ఏలికలు పూనుకున్నారు.

దొడ్డిదారిన చావుదెబ్బ తీస్తూ నష్టాల సాకు చూపి బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థను మూసేసే కుట్రకు కేంద్రం పూనుకున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 11.5 కోట్ల మంది మొబైల్‌ కస్టమర్లు ఉన్నా బీఎస్‌ఎన్‌ఎల్‌ను కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఎప్పుడు మూసి వేస్తుందోనన్న ఆందోళన అందులో పని చేస్తున్న ప్రతి ఉద్యోగిలోనూ వ్యక్తమవుతున్నది.

కస్టమర్ల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఖజానాలో జమ అయ్యే నిధుల్లో నుంచి 55 నుంచి 60 శాతం వరకు జీతాలకే ఖర్చవుతోంది. ఫిబ్రవరి నెలలో 850 కోట్ల మేర జీతాలను సంస్థ ఇవ్వలేకపోయింది. దీన్ని మార్చి నెలలో ఇచ్చారు. మరోవైపు టెలికం శాఖ తరఫున స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్‌) చేసే వారికి ఇంటికి సాగనంపే ఏర్పాట్లు చేసింది. దీనికోసం రూ. 6,535 కోట్లు కేటాయించింది.

బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉన్న ఉద్యోగులను కుదించాలని యోచిస్తున్నది. స్వచ్ఛంద పదవీ విరమణ అస్త్రంతో సగానికి పైగా సిబ్బందిని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న దని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థకు భూములు ఉన్నాయి. వీటిని అమ్మి ఎంతో కొంత నిలుదొక్కుకోవచ్చని భావిస్తు న్నది.ఈ విషయాన్ని పెట్టుబడుల మంత్రిత్వ శాఖకు విన్నవించింది. ఈ ప్రతి పాదనకు ఇంతవరకూ లైన్‌క్లియర్‌ కాలేదు. 
ఇంకోవైపు బీఎస్‌ఎన్‌ఎల్‌ నిబంధనల ప్రకారం.. సంస్థకు చెందిన భూములను ప్రయివేట్‌ సెక్టార్‌కు అద్దెలకు ఇచ్చుకోలేని దుస్థితి నెలకొంది.
4 జీ స్పెక్ట్రమ్‌ను తీసుకోని కంపెనీ 2017లో బీఎస్‌ఎన్‌ఎల్‌ 4 జీ స్పెక్ట్రం వేలంపాటలో గైర్హాజరైంది. ఆ సమయంలో మోడీ సర్కార్‌ ఇతర కంపెనీల మాదిరిగానే బీఎస్ఎన్ఎల్ సంస్థకు 4జీ స్పెక్ట్రం  ఇస్తామని ప్రకటించింది.

ఆచరణలో ప్రభుత్వరంగ సంస్థను నిర్వీర్యం చేసేందుకే బీజేపీ సర్కార్ నిర్ణయించిందని ఉద్యోగసంఘాలు ఆరోపిస్తున్నాయి. మరో వైపు ఆనాడు జరిగిన వేలం పోటీలో ధర ఎక్కువగా ఉన్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్‌ గుర్తించింది. ఎలాగోలా తంటాలుపడి సంస్థ 4జీ తీసుకున్నా..ఇప్పటికీ అనుకున్న వేగాన్ని ఇవ్వలేకపోతున్నదని మొబైల్‌ వినియోగదారులు అంటున్నారు.

బీఎస్ఎన్ఎల్ వద్ద 4జీ స్పెక్ట్రం ఉన్నా డేటా స్పీడ్‌, వాయిస్‌ క్వాలిటీ, నెట్‌వర్క్‌లో పురోగతి కనిపించటం లేదు. ఈ సమస్యను అధిగమించడానికి టెలికం శాఖ అనుమతి తీసుకున్నది. బ్యాంకుల నుంచి 3,500 కోట్ల మేర రుణాలు తీసుకునే అవకాశం కలిగింది. కానీ, ఇప్పటికీ రుణాలు మంజూరు కావటంలేదు. ఈ రుణాలు తక్కువేనని, వీటితో ఆశించినమేర నెట్‌వర్క్‌ మెరుగుపర్చటం అసాధ్యమని సాంకేతిక నిపుణులు అంటున్నారు.

ఒకప్పుడు ప్రతిష్టాత్మక సంస్థగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఓ వెలుగువెలిగింది. కానీ ఇపుడు ప్రయివేట్ సంస్థలతో దీటుగా ప్రభుత్వరంగ సంస్థ నిలద్రొక్కుకోలేక పోతున్నది. ఒకవైపు ఆర్థికపరమైన ఇబ్బందులు, మరోవైపు కేంద్రంలోని మోడీ సర్కార్‌ కార్పొరేట్‌ సంస్థలకు వెసులుబాట్లు కల్పించటం వల్లే బీఎస్‌ఎన్‌ఎల్‌ లాంటి సంస్థలు మూతపడే దుస్థితికి చేరుకుంటున్నాయని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు.

దేశీయ టెలికం సంస్థల వారీగా చూస్తే బీఎస్ఎన్ఎల్ సంస్థలో 1.76 లక్షల మంది ఉద్యోగులు ఉంటే, 11.4 కోట్ల మంది ఖాతాదారులు ఉండగా, రూ. 1925 కోట్ల ఆదాయం లభిస్తోంది. దేశంలోకెల్లా అతిపెద్ద టెలికం సంస్థ 
వోడాఫోన్‌ ఐడియాలో 27వేల మంది ఉద్యోగులు ఉంటే,  41.8 కోట్ల మంది ఖాతాదారులతో రూ. 7528 కోట్ల ఆదాయం సంపాదిస్తోంది. 

దేశీయంగా సేవల్లో రెండో స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్‌ సంస్థలో 17 వేల మంది పని చేస్తుండగా, 34లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. ఎయిర్ టెల్ ఆదాయం రూ. 6723 కోట్లుగా ఉన్నది. ఇక 4జీతోనే జియోగా రంగ ప్రవేశం చేసి సంచలనం నెలకొల్పిన ‘రిలయన్స్ జియో’సంస్థలో 15 వేల మంది ఉద్యోగులు ఉండగా, 28 లక్షల మంది ఖాతాదారులతో రూ. 8272 కోట్ల ఆదాయం సంపాదించింది.