Asianet News TeluguAsianet News Telugu

బీఎస్ఎన్‌ఎల్ సూపర్బ్ డేటా ప్లాన్లు: రూ.693& రూ.1212

 బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం ఇయర్లీ ప్లాన్లు ప్రవేశ పెట్టింది. రూ.693, రూ.1212లతో ఈ ప్లాన్లు అమలులోకి వస్తాయి. మరోవైపు కరోనాపై ప్రజల్లో చైతన్యం కోసం బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియా తమ డిస్ ప్లేలు మార్చేశాయి.

BSNL introduces Rs 693, Rs 1212 plans: Data, validity and more
Author
Hyderabad, First Published Apr 3, 2020, 11:12 AM IST

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం మరో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకు వచ్చింది. రూ.693, రూ.1212తో తీసుకొచ్చిన ఈ ప్లాన్లలో రోజువారీ డేటా పరిమితి ఉండదు. 

ఈ బల్క్ డేటా ప్రయోజనాలు ఏడాది కాల పరిమితితో లభిస్తాయి. రూ.693 డేటా ప్లాన్‌లో 300 జీబీ డేటా లభిస్తుంది. కాలపరిమితి ఉన్నంత వరకు దీనిని వాడుకోవచ్చు. 

రూ.1212 ప్లాన్‌లో 500 జీబీ డేటా ప్రయోజనాలు లభిస్తాయి. దీని కాలపరిమితి కూడా 365 రోజులే.  

అయితే, ఈ ప్లాన్లతో వాయిస్ కాల్స్ కానీ, ఎస్సెమ్మెస్ వంటి ప్రయోజనాలు కానీ లభించవు. అంతేకాదు, ఎంపిక చేసిన సర్కిళ్లలోనే ఇవి అందుబాటులో ఉంటాయి. అంటే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్లలో మాత్రమే ఈ ప్లాన్లు అందుబాటులో ఉంటాయి. 

మరోవైపు కరోనా వైరస్ దూసుకు వస్తున్న వేళ సందేశాత్మకంగా బీఎస్ఎన్ఎల్‌తోపాటు వొడాఫోన్ ఐడియా కొత్త డిస్ ప్లే పేర్లు తీసుకొచ్చాయి. కరోనా వైరస్‌పై మరింత అవగాహన పెంచేందుకు టెలికం సంస్థలు ఇప్పటికే కాలర్ ట్యూన్‌ను మార్చేశాయి. 

యూజర్లలో వైరస్‌పై మరింత అవగాహన పెంచే ఉద్దేశంతో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియా తమ నెట్‌వర్క్ డిస్‌ప్లేను మార్చేశాయి. వొడాఫోన్ ఐడియా తన నెట్‌వర్క్ డిస్‌ప్లేను ‘వొడాఫోన్-బీ సేఫ్’ అని మార్చగా, బీఎస్ఎన్ఎల్ తన డిస్‌ప్లేను ‘బీఎస్ఎన్ఎల్ స్టే ఎట్ హోం’ అని మార్చివేశాయి.   

లాక్ డౌన్ నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా ఇటీవల తమ ప్రీపెయిడ్ ఖాతాదారుల వ్యాలిడిటీని ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించడమే కాక ఉచితంగా రూ.10 టాక్‌టైం కూడా జోడించింది. 

ఇటీవల బీఎస్ఎన్ఎల్ కూడా లాక్ డౌన్ నేపథ్యంలో స్వల్ప ఆదాయ వర్గాల వారికి వాలిడిటీ, ఉచిత టాక్ టైం పొడిగించింది. మార్చి నెల 22తో గడువు ముగిసే ప్రీ పెయిడ్ కస్టమర్లకు కూడా బీఎస్ఎన్ఎల్‌ ఊరటనిచ్చింది ఏప్రిల్ 20 వరకు వ్యాలిడిటీని పెంచడంతోపాటు రూ. 10 టాక్‌టైం ఉచితంగా ఆఫర్ చేసింది. 

అలాగే, లాక్ డౌన్ వేళ వర్క్‌ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులకు 10 ఎంబీపీఎస్ డౌన్ స్పీడ్‌తో రోజుకు 5జీబీని ఉచితంగా అందిస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ పేదలు, అవసరమైన వ్యక్తులు పని చేయడానికి ఈ డేటా ప్లాన్ అవసరం అని వ్యాఖ్యానించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios