బ్యాంకింగ్‌ రంగంలో కొత్త కొలువుల కోసం చూస్తున్న వారికి చేదువార్త. ఇప్పటి వరకు టెక్నాలజీ రంగంలోనే క్రుత్రిమ మేధస్సు, ఆటోమేషన్ (యాంత్రీకరణ) ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోవాల్సిన దుస్థితి నెలకొన్నది. కానీ బ్యాంకింగ్ రంగం కూడా టెక్నాలజీ అడాప్ట్ దిశగా అడుగులేస్తున్నది. యాంత్రీకరణ (ఆటోమేషన్‌)తో ఈ రంగంలోనూ కొత్త కొలువులు తగ్గిపోతున్నాయి. మనుషులు చేసే కొన్ని పనుల్ని ఇప్పుడు యంత్రాలే చేస్తున్నాయి. దీంతో బ్యాంకులకు ఉద్యోగుల అవసరం తగ్గి, యంత్రాలతోనే పనులు చక్కబెట్టుకునే సౌలభ్యం ఏర్పడింది. 

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతి పెద్దదైన ఎస్‌బఐపైనా ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. వచ్చే ఐదేళ్లలో రిటైర్మెంట్‌తో ఏర్పడే ఖాళీల్లో 75% ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయాలని ఎస్బీఐ నిర్ణయించింది. టెక్నాలజీతో అంటే యాంత్రీకరణతో ఉద్యోగాలు మిగతా 25 శాతం భర్తీ చేయాల్సిన అవసరం ఉండదని ఎస్బీఐ డిప్యూ టీ ఎండీ ప్రశాంత్‌ కుమార్‌ చెప్పారు.

ఎస్బీఐ గత రెండేళ్లలో 8,000 క్లరికల్‌ ఉద్యోగాలు భర్తీ చేసింది. ఈ పోస్టుల కోసం దాదాపు 28 లక్షల దరఖాస్తులు వచ్యాయి. నిజానికి ఎస్బీఐలో ఏటా 10వేల మంది క్లరికల్‌ ఉద్యోగులు, 2,000 మంది అధికారులు రిటైరవుతున్నారు. కానీ ఇందులో 10 వేల ఖాళీలను మాత్రమే భర్తీ చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 12,500 వరకు రిటైర్మెంట్‌లు ఉంటాయని అంచనా. ఆ తర్వాత పదవీ విరమణ చేసేవారి సంఖ్య తగ్గుముఖం పడుతుంది. బ్యాంకు ఉద్యోగుల సగటు వయస్సు కూడా 48 నుంచి 43కు తగ్గుతుంది.

కొత్తగా వచ్చేవారు లోన్‌ అడ్వైజర్లుగా, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, రికవరీ విభాగం, రిస్క్‌ మేనేజ్‌‌మెంట్‌ వంటి కొత్త బాధ్యతలను చూసుకొంటున్నారు. బ్యాంకులు కూడా నేరుగా మార్కెట్‌ నుంచి నిపుణులను నియమించుకొంటున్నాయి. నేరుగా బి-స్కూల్స్‌కు వెళ్లి నియమించుకొనే సంప్రదాయాన్ని పక్కనపెట్టేశాయి.

గతంలో బ్యాంకు ఉద్యోగాలంటే బీఏ, బీకామ్‌ లేదా ఎంకామ్‌ అభ్యర్థులు ఎక్కువగా ఆసక్తి చూపేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం కొత్తగా ఎస్బీఐ క్లరికల్‌ ఉద్యోగాల్లో చేరే వారిలో 80% మంది ఇంజనీర్లు, ఎంబీఏ పట్టభద్రులే. దీంతో సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ఎస్బీఐకి మరింత సులువవుతోంది. ఇలా క్లర్కులుగా చేరిన ఉద్యోగుల్లో ఎక్కువ మంది కొద్ది కాలంలోనే ఇంటర్నల్‌ టెస్టులు పాసై అధికారులుగా పదోన్నతులు పొందుతున్నట్టు ఎస్బీఐ డిప్యూటీ ఎండీ ప్రశాంత్‌ కుమార్‌ చెప్పారు.
 
గతంలో ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఆయా బ్యాంకుల శాఖల్లోనే ఎక్కువగా పని చేసేవారు. బ్యాంకింగ్‌ లావాదేవీల్లో ఎక్కువ భాగం శాఖల్లోనే జరిగేవి. ఆటోమేషన్‌ వల్ల శాఖల అవసరం తగ్గిపోతోంది. ఎస్బీఐ ఆర్థిక లావాదేవీల్లో 87శాతం శాఖల వెలుపలే జరుగుతున్నట్టు ఎస్బీఐ డిప్యూటీ ఎండీ ప్రశాంత్‌ కుమార్ చెప్పారు. కొత్త ఉద్యోగుల్లో చాలా మంది రుణాలు, వెల్త్‌మేనేజ్‌మెంట్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వంటి విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.
 
మన దేశంలో పని చేస్తున్న కొన్ని విదేశీ బ్యాంకులు ఇప్పటికే తమ శాఖలను కుదించి ఉద్యోగుల్లో కొంతమందిని ఇంటికి పంపించేస్తున్నాయి. బ్రిటిష్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌ఎస్బీసీ భారత్‌లో తన శాఖల సంఖ్యను సగానికి కుదిస్తోంది. స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంకుదీ ఇదే పరిస్థితి. ఆటోమేషన్‌తో ఈ బ్యాంక్‌ భారత్‌లో పని చేస్తున్న ఉద్యోగుల్లో 200 మందిని తొలగించాలని ఇప్పటికే నిర్ణయించింది. 

దేశీయ ప్రైవేట్‌ బ్యాంకుల్లోనూ పెద్ద ఎత్తున యాంత్రీకరణ జరుగుతోంది. దీంతో మున్ముందు ఉద్యోగావకాశాలు మరింత తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి.  ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీ ప్రశాంత్‌ కుమార్‌  స్పందిస్తూ ‘ఈ మార్పు మాకు చాలా మేలు చేస్తోంది. క్లరికల్‌ స్థాయిలోనే టెక్నాలజీ ఇతర రంగాల్లో మంచి నైపుణ్యాలు ఉన్నఉద్యోగులు లభిస్తున్నారు. వీరిలో అనేక మంది వెంటనే ఇంటర్నల్‌ టెస్టులు రాసి అధికారులుగా పదోన్నతులు పొందుతున్నారు’ అని తెలిపారు.