Asianet News TeluguAsianet News Telugu

గూగుల్ పే+ఫోన్ పే సవాల్.. నష్టాల్లో పేటీఎం

డిజిటల్ చెల్లింపుల సంస్థ ‘పేటీఎం’ నష్టం రూ.3,960 కోట్లకు చేరుకున్నది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2018-19 ఆర్థిక సంవత్సరంలో సంస్థ నష్టం 165 శాతం పెరిగింది. ఇతర అనుబంధ సంస్థలతో కలిపితే పేటీఎం నష్టం రూ.4,217 కోట్లకు చేరుకున్నది.

At Rs 3,960 crore, losses mount 165% for Paytm parent One97
Author
Hyderabad, First Published Sep 11, 2019, 2:21 PM IST

న్యూఢిల్లీ: దేశీయ డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎం.. పీకల్లోతు నష్టాల్లోకి కూరుకుపోయింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) సంస్థ నష్టాలు మరింతగా పెరిగాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2017-18)తో పోల్చితే ఏకంగా 165 శాతం ఎగిశాయి. దీనికి గూగుల్ పే, ఫోన్ పే నుంచి డిజిటల్ మార్కెట్‌లో గట్టి పోటీ ఏర్పడటమే కారణమని తెలుస్తోంది. 

2018-19లో పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ నికర నష్టం రూ.3,959.6 కోట్లుగా నమోదైంది. 2017-18లో ఇది రూ.1,490 కోట్లు మాత్రమేనని తమ భాగస్వాములకు సంస్థ తెలియజేసింది. అంటే క్రిందటి ఆర్థిక సంవత్సరంలో రోజుకు రూ.11 కోట్లదాకా నష్టపోయిందన్నమాట.

ఇక సంస్థ ఆదాయం గతంతో పోల్చితే స్వల్పంగా పెరిగి రూ.3,229 కోట్ల నుంచి రూ.3,319 కోట్లకు చేరింది. కాగా, సంస్థ ఏకీకృత నష్టం  2018-19లో రూ.4,217 కోట్లుగా ఉండగా, 2017-18లో రూ.1,604 కోట్లుగా నమోదైంది. దీంతో 162 శాతం పెరిగినట్లయింది. 

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్లను చూస్తున్న పేటీఎం మనీతోపాటు పేటీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్, పేటీఎం ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్, ఇతర అనుబంధ సంస్థలన్నీ కూడా నష్టాల్లోనే ఉండటం గమనార్హం. పేటీఎం మనీ నష్టం రూ.36.8 కోట్లుగా ఉన్నట్లు వాటాదారులకు వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. 

సంస్థను దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశపెట్టాలని చూస్తున్నామని, దానికి ముందు సంస్థను లాభాల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ అంటున్నారు. వచ్చే రెండేళ్లలో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

భారతీయ డిజిటల్ పేమెంట్స్ రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందిన పేటీఎం ఆధిపత్యానికి గూగుల్ పే, ఫోన్‌పేలు బ్రేకులు వేశాయి. ఈ రెండింటి రాకతో పేటీఎం వైభవం తగ్గిపోయింది. చిన్నచిన్న వ్యాపారుల వద్ద ఇప్పటికీ పేటీఎందే హవా. అయినప్పటికీ డిజిటల్ లావాదేవీల్లో పేటీఎం వాటా మాత్రం పడిపోయింది.

ప్రముఖ దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ యెస్ బ్యాంక్‌లో వాటా కోసం పేటీఎం చర్చలు జరుపుతున్నది. బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్ నుంచి ఈ వాటాను కొనేందుకు పేటీఎం వర్గాలు సంప్రదిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఆర్బీఐ ఆమోదంపై ఈ డీల్ ఆధారపడి ఉన్నట్లు సదరు వర్గాలు చెబుతున్నాయి. 

యస్ బ్యాంకులో వాటాల కొనుగోలు వార్తలపై స్పందించేందుకు పేటీఎం నిరాకరించింది. రాణా కపూర్ మాత్రం అందుబాటులో లేరు. యెస్ బ్యాంక్‌లో కపూర్, ఆయన అనుబంధ సంస్థలకు 9.6 శాతం వాటా ఉన్నది. ఈ మొత్తం వాటాను విక్రయించనున్నారా? అన్నదానిపై మాట్లాడేందుకు బ్యాంక్ వర్గాలూ విముఖత వ్యక్తం చేశాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios