న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధికి  ఊతమిచ్చేందుకు ప్రధాని మోదీ సారధ్యంలోని సర్కార్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించనున్నది. దీంతో అమెరికా, చైనా టెక్‌ కంపెనీలకు భారీ ఊరట లభించనుంది.  ప్రధానంగా భారత వినియోగదారులకు విలాసవంతమైన ఆపిల్‌ ‘ఐ’ ఫోన్లపై మోజు ఎక్కువే. 

ఎఫ్‌డీఐ నిబంధనల సవరణలతో ఇక ఆపిల్‌ ఉత్పత్తులు తక్కువ ధరలకే కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఆపిల్‌ వంటి కంపెనీలు సొంత ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా అమ్మకాలు చేపట్టే వెసులు బాటు లభించనుంది. ఆపిల్‌ కంపెనీ, ఐ ఫోన్లు, వాచ్‌లు, మాక్‌బుక్స్‌, ఇతర ఉత్పత్తులను విక్రయించేందుకు ఇప్పటి వరకు మూడో పక్షం సంస్థలపై ఆధారపడిన సంగతి తెలిసిందే. 

కానీ, సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ వాణిజ్యంలో ప్రభుత్వం ఇటీవల ఎఫ్‌డీఐ నిబంధనల్ని సరళతరం చేయడంతో ఆపిల్‌ భారత మార్కెట్లోకి  దూసుకు రానుంది. గతంలో విదేశీ కంపెనీలకు 30 శాతం ప్రొడక్ట్‌లను ఇక్కడే తయారు చేయాలనే షరతు విధించింది. కానీ భారత ప్రభుత్వం తాజా నిబంధనల ప్రకారం దీనికి కొంత సడలింపు ఇచ్చింది. అంటే వార్షికంగా 30 శాతం అనే నిబంధనను సవరించి..ఇకపై ఐదేళ్లకు సగటున 30శాతం సమీకరించినా సరిపోతుందని తెలిపింది.

విదేశీ సంస్థల ఆన్‌లైన్‌ విక్రయాలకు కూడా అనుమతినిచ్చింది. ఇంకా, ఐదేళ్ల ఎగుమతులను పరిగణనలోకి తీసుకునే ప్రస్తుత పరిమితిని తొలగించాలని ప్రతిపాదించారు. సింగిల్-బ్రాండ్ రిటైల్‌లో ఎఫ్‌డిఐ కోసం దరఖాస్తు చేసుకున్న బ్రాండ్లు ఆన్‌లైన్ రిటైల్ సేల్స్‌ను ప్రారంభించవచ్చు. అయితే రెండేళ్లలో ఫిజికల్‌ స్టోర్‌ను తెరవాల్సి వుంటుంది. ఈ నిర్ణయంతో ఆపిల్‌లాంటి దిగ్గజ కంపెనీలు దేశంలో తమ మార్కెట్‌ను మరింత పెంచుకునేందుకు అవకాశం లభించినట్టేనని విశ్లేషకులు అంటున్నారు. 

ఈ క్రమంలోఅతి త్వరలోనే ఆపిల్‌ భారత్‌లో తన తొలి ఆన్‌లైన్‌ స్టోర్‌ను ప్రారంభించనుందని తెలుస్తోంది. దీంతోపాటు వచ్చే ఏడాది నాటికి ఆపిల్‌ ముంబైలో తన రిటైల్‌ స్టోర్‌ను కూడా ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా భారతదేశంలో 140 రిటైల్ దుకాణాల ద్వారా తన ఫోన్‌లను విక్రయిస్తున్న ఆపిల్‌ ఎగుమతుల విషయంలో సుమారు 1.2శాతం  మార్కెట్ వాటాను కలిగి ఉంది.

ప్రభుత్వ నిర్ణయంతో ఆపిల్‌ లాంటి కంపెనీలు దేశంలో తమ మార్కెట్‌ను మరింత పెంచుకునేందుకు అవకాశం లభించినట్లయింది. ఎందుకంటే ఇతర ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లలో దొరికే ఆపిల్‌ ఉత్పత్తుల్లో కొన్ని నకిలీలు కూడా ఉంటున్నాయి. దీని వల్ల కొనుగోలుదారుల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. సొంత బ్రాండ్ నుంచే ఆన్‌లైన్ అమ్మకాలు చేయడం వల్ల గిరాకీ పెరిగే అవకాశముంటుందని ఆపిల్‌ భావిస్తోంది.

భవిష్యత్‌లో ఐఫోన్‌, ఐపాడ్స్‌, యాపిల్‌ మాక్‌ కంప్యూటర్స్ తదితర ఉత్పత్తులను ఆపిల్‌ తమ సొంత ఆన్‌లైన్‌ స్టోర్‌ నుంచి విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఆపిల్‌ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 

మరోవైపు ఆపిల్‌కు ‘సిరి’ కాంట్రాక్టర్లు కంపెనీకి కొత్త తలనొప్పులు తెస్తున్నారు. దీంతో ఆపిల్‌ కంపెనీ ఐర్లాండ్‌లోని తమ సంస్థలో పని చేస్తున్న దాదాపు 300 కాంట్రాక్టర్లను ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. తమ వినియోగదారులకు చెందిన సున్నితమైన విషయాలను 'సిరి' పోగ్రామ్‌ కాంట్రాక్టర్లు రహస్యంగా విని, ఆపిల్‌ సేవలను దుర్వినియోగం చేసినందుకు వారిని తొలగించడం యూరప్‌ వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయంశయైంది. 

వాయిస్‌ కమాండింగ్‌ ద్వారా ఆపిల్‌ ఫోన్‌ను వినియోగించడం కోసం తీసుకొచ్చిన 'సిరి' ప్రోగ్రామింగ్‌ సేవలను నిలిపి వేస్తున్నట్లు ఇటీవలే ఆపిల్‌ వెల్లడించింది. ఆపిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్లు, వినియోగదారులు - సిరితో చేసిన సంభాషణలు విని అది ఇచ్చే రెస్పాన్స్‌లో అవసరమైన మార్పులు చేయాలి.

కానీ వినియోగదారులు మాట్లాడుకునే వ్యక్తిగత శృంగార సంభాషణలు, డ్రగ్స్‌, బిజినేస్‌ డీల్స్‌ను సిరి కాంట్రాక్టర్లు పదేపదే విన్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై  దుమారం రేగడంతో ఆపిల్‌ కంపెనీ వెంటనే సిరి గ్రేడింగ్‌ ప్రోగ్రామ్‌ను నిలిపివేసి కాంట్రాక్టర్లపై కొరడా ఝళిపించింది. తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన ‘సిరి’ సేవలను కాంట్రాక్టర్లు దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి.

ఐఫోన్లలో రికార్డైన సంభాషణలను రహస్యంగా వింటున్నారని ఓ ప్రజావేగు(విజిల్‌ బ్లోయర్‌) గార్డియన్‌ పత్రిక ద్వారా తెలపడంతో వినియోగదారులు షాక్‌కు గురయ్యారు. దీనిపై ఆపిల్‌ వివరణ ఇస్తూ ‘తమ కంపెనీ ప్రధానంగా వినియోగదారుని భద్రతకి ప్రాధాన్యం ఇస్తుందని, ఈ ఘటనపై వినియోగదారులను క్షమాపణలు కోరుతున్నామని’  తెలిపింది. సదరు కాంట్రాక్టర్లతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని వివరణ ఇచ్చింది.