కాలిఫోర్నియా: టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌ గతేడాది నవంబర్ నెలలో మార్కెట్లోకి విడుదలైన కొన్ని ఐఫోన్‌ ఎక్స్‌ ఫోన్లలో టచ్‌ స్ర్కీన్లలో కొన్ని లోపాలు ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది. ఈ ఫోన్లకు తాము స్ర్కీన్‌ రీప్లేస్‌మెంట్‌ చేసి ఇస్తామని ప్రకటించింది. కొన్ని ఐఫోన్‌ ఎక్స్‌ ఫోన్లలో టచ్‌ స్ర్కీన్‌ సరిగ్గా పనిచేయకపోవడం గానీ, అతిగా స్పందించడం గానీ తెరను తాకకున్నా దానికదే స్పందించడం వంటి సమస్యలు ఉన్నాయని తెలిపింది. ఈ సమస్యలను కొద్ది రోజులుగా వినియోగదారులు ఆన్‌లైన్‌లో సంస్థ దృష్టికి తీసుకురావడంతో ఆపిల్‌ ఈ మేరకు స్పందించింది.

ఆపిల్ లాప్‌టాప్‌ల్లోనూ డేటా లాస్, డ్రైవ్ ఫెయిల్యూర్ ప్రాబ్లమ్స్
13 అంగుళాల మ్యాక్‌ బుక్‌ ప్రో మోడల్‌కు చెందిన కొన్ని ల్యాప్‌ట్యాప్‌ల్లోనూ డేటా లాస్‌, డ్రైవ్‌ ఫెయిల్యూర్‌ వంటి సమస్యలున్నట్లు కంపెనీ తెలిపింది. 2017 జూన్‌ నుంచి ‌2018 జూన్‌ వరకూ అమ్ముడుపోయిన 128 జీబీ, 256 జీబీ ల్యాప్‌ట్యాప్‌ల్లో ఈ సమస్య ఉన్నట్లు వెల్లడించింది. తమ ల్యాప్‌ట్యాప్‌ల్లో ఈ సమస్యను గుర్తించిన వినియోగదారులు వెంటనే యాపిల్‌ సర్వీస్‌ సెంటర్లను సంప్రదించాలని సంస్థ తెలిపింది. లోపాలు గల ఐఫోన్‌ ఎక్స్‌కు స్ర్కీన్‌ రీప్లేస్‌మెంట్‌, మ్యాక్‌ బుక్‌ ప్రోలకు ఉచిత సర్వీసింగ్‌ అందిస్తామని ప్రకటించింది.

కొత్తేడాదిలో ఇన్ఫోసిస్‌ సిబ్బంది వేతనాల పెంపు
ప్రముఖ సాప్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ సీనియర్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎప్పటికంటే ముందే జీతాల పెంపును ప్రకటించి ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఉద్యోగుల పనితీరు ప్రాతిపదికగా వచ్చే ఏడాది జనవరి నుంచి వారికి 3నుంచి 5శాతం జీతం పెంచనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అంతేకాదు సీనియర్ ఉద్యోగులు మొత్తం 170 మందికి ప్రమోషన్లు కూడా ఇవ్వనున్నది. సాధారణంగా ప్రతి ఏటా ఉద్యోగులకు ఏప్రిల్ నెల నుంచి జీతాలు పెంచుతారు. సీనియర్లకైతే జులై నెల నుంచి ఇంక్రిమెంట్లు ఇచ్చి మరీ జీతాలు పెంచుతారు. ఈ సారి అందుకు భిన్నంగా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లు కలిసి సీనియర్ ఉద్యోగులైన 500 మందికి జనవరి నుంచే జీతాలు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.