న్యూఢిల్లీ: పార్ట్‌టైం ఉద్యోగాలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా సంస్థలో పార్ట్‌టైం ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఉద్యోగులైనా, నిరుద్యోగులైనా ఖాళీ సమయంలో అమెజాన్‌ ప్యాకేజీలను డెలివరీ చేసి గంటలకు రూ. 140 వరకు సంపాదించుకోవచ్చ. ‘అమెజాన్‌ ఫ్లెక్స్‌’ పేరుతో ఈ పార్ట్‌టైం ప్రోగ్రామ్‌ను కంపెనీ తాజాగా భారత్‌లో ప్రారంభించింది. 

ఇందుకోసం అమెజాన్‌ ఫ్లెక్స్‌ యాప్‌లో పేరు నమోదు చేసుకుని ప్యాకేజీలను డెలివరీ చెయ్యొచ్చని కంపెనీ తెలిపింది. అయితే రిజిస్టర్ అయ్యేవారికి కనీసం సొంత ద్విచక్ర వాహనం ఉండాలని పేర్కొంది. దీంతో పాటు ఆండ్రాయిడ్‌ ఫోన్‌ కూడా ఉండాలి. ఎందుకంటే అమెజాన్‌ ఫ్లెక్స్‌ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తోంది.
 ప్యాకేజీలు డెలివరీ చేసే ముందు అమెజాన్ కంపెనీ పార్ట్‌టైం ఉద్యోగులకు కొంత శిక్షణ కూడా ఇస్తుందట. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్‌ను బెంగళూరు, ముంబై, దిల్లీలో ప్రారంభించారు. త్వరలోనే భారత్‌లోని ఇతర నగరాలకు కూడా విస్తరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. 

అమెజాన్‌ ఫ్లెక్స్‌ను తొలిసారిగా 2015లో అమెరికాలో ప్రారంభించారు. ఇప్పుడు భారత్‌కు తీసుకొచ్చారు. దీని ద్వారా వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం ఆనందంగా ఉందని అమెజాన్‌ పేర్కొంది. తమకు వీలైన సమయాల్లోనే డెలివరీ చేసేందుకు వీలుండటంతో యువత ఎక్కువగా దీనిపై ఆసక్తి చూపుతారని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.