ఎయిర్ టెల్‌కు భారీ నష్టాలు.. పెరుగనున్న మొబైల్ చార్జీలు?

 డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసింలో ఎయిర్ టెల్ రూ.1035 కోట్ల నష్టం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మొబైల్‌ సేవలు మరింత భారం కానున్నాయి. ఎయిర్ టెల్ సీఈఓ గోపాల్ విఠల్ కూడా నష్టాల భారం తగ్గించుకునేందుకు మరో దఫా టారిఫ్ చార్జీలు పెంచే అవకాశాలు ఉన్నాయని సంకేతాలిచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా టెలికం చార్జీలు మరో 30 శాతం పెరగనున్నాయి. ఆ దిశగా టెల్కోలు కసరత్తు మొదలుపెట్టాయని తెలుస్తోంది.

Aitrtel Posts Massive Loss in Last Quarter, Hints at a Tariff Hike

దేశంలోని టెలికం సంస్థలు వినియోగదారులపై మొబైల్‌ సేవల చార్జీల భారం మోపేందుకు సిద్ధం అవుతున్నాయి. పలు సాకులు చూపుతూ 100 కోట్ల మంది ప్రజలపై చార్జీల భారం మోపే పనిలో పడ్డాయని తెలుస్తోంది. 

తాజాగా టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్‌ నష్టాల పరంపర కొనసాగుతున్నది. డిసెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో సంస్థ రూ.1,035 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రకటించింది. ఏడాది క్రితం ఇది రూ.86 కోట్ల లాభాన్ని గడించింది. గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 8.5 శాతం ఎగబాకి రూ.21,947 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది.

గతేడాది చివర్లో చార్జీలు పెరుగడం మంచి పరిణామమని, దీంతో టెలికం సంస్థలు ఆర్థికంగా నిలదిక్కుకోవడానికి దోహదం చేయనున్నదని, మరోదఫా ధరలు పెంచాల్సిన అవసరం ఉన్నదని భారతీ ఎయిర్‌టెల్‌ ఇండియా ఎండీ, సీఈవో గోపాల్‌ విఠల్‌ తెలిపారు. టెలికం రంగంలో వస్తున్న టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా నూతన టెక్నాలజీని ఆపాదించుకోవాలంటే మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉన్నదని, దీంతో ధరలు మరోదఫా పెంచకతప్పదని ఆయన సంకేతాలిచ్చారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ప్రస్తుతచార్జీలను మరో 25-30 శాతం వరకు పెంచేందుకు టెలికం సంస్థలు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా నివేదికలు వస్తున్నాయి. గడిచిన మూడేండ్లలో వినియోగదారుడి నుంచి సగటు రాబడి రూ.180-200 కంటే తక్కువగా ఉండటం, ప్రపంచ దేశాలతో పోలిస్తే టెలికాంపై వినియోగదారులు వెచ్చించే మొత్తం భారత్‌లో తక్కువే కావడం వంటి అంశాలను పరిశీలిస్తే టెలికాం కంపెనీలు ఈ ఏడాది చివరిలో టారిఫ్‌లను 30 శాతం వరకూ పెంచే అవకాశం ఉందని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ భాసిన్‌ అంచనా వేశారు. 

గత రెండు నెలల్లోనే భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఇండియా, రిలయన్స్‌ జియో సంస్థలు వివిధ కారణాలతో కాల్‌ చార్జీలను 14 నుంచి 33 శాతం వరకూ పెంచేశాయి. టెలికాం కంపెనీలు ఇటీవల టారిఫ్‌ను పెంచినా వినియోగదారులు ఇప్పటికీ వారి కమ్యూనికేషన్‌ అవసరాలపై కేవలం 0.86 శాతం మాత్రమే తలసరి ఆదాయం వెచ్చిస్తున్నారని ఇది నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే ఇది చాలా స్వల్పమని సెల్యులార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (కారు) డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మ్యాథ్యూస్‌ అన్నారు. 

మరోవైపు డేటా అందుబాటులోకి రావడంతో మొబైల్‌ వినిమయం విపరీతంగా పెరిగిన క్రమంలో మొబైల్‌ బిల్లు కొంత అదనంగా చెల్లించేందుకు అంగీకరిస్తారని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ భాసిన్‌ పేర్కొన్నారు. టెలికం కంపెనీలు పలు ప్రపంచ దేశాల వినియోగదారల సగటు మొబైల్‌ బిల్‌ వ్యయంతో పోల్చుతూ భారత్‌లో ధరల పెంపునకు ప్రధాన సాకుగా చూపుతున్నాయి. 

అందులో ప్రధానంగా సింగపూర్‌, మలేషియా, చైనా, ఫిలిప్పిన్స్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాల వినియోగదారుల సగటు వ్యయంతో పోల్చితే భారత్‌లో తక్కువ మొబైల్‌ చార్జీలు అమల్లో ఉన్నాయని పేర్కొంటున్నారు. అయితే ఆయా దేశాల ప్రజల తలసరి ఆదాయంతో పోల్చితే భారతీయుల ఆదాయం అత్యల్పమన్న విషయాన్ని టెలికాం కంపెనీలు గుర్తించకపోవడం గమనార్హం. 

అదే విధంగా భారత్‌తో పోల్చితే ఆయా దేశాల్లో వినియోగదారుల సంఖ్య చాలా తక్కువ. భారత్‌లో వాడకందారులు ఎక్కువ కాబట్టి.. చార్జీలు తక్కువగా ఉన్న ఎక్కువగా రెవెన్యూ వస్తుందనేది నిజం. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించాలంటే చార్జీలు పెంచక తప్పదని ఈ రంగంలో చాలా పెట్టుబడులు అవసరమవుతాయని చెబుతున్నాయి. 

ఇటీవలి కాలంలో భారతీ ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ మిట్టల్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వినియోగదారుల నుంచి సగటున రూ.300 రెవెన్యూ ఉంటేనే మొబైల్‌ సేవలు అందించగలమని సన్నాయి నొక్కులు నొక్కడం వెనుక అసలు ఉద్దేశ్యం ధరల పెంపు అని నిపుణులు పేర్కొన్నారు. గత కొన్ని త్రైమాసికాలుగా టెలికం కంపెనీలకు వినియోగదారుల నుంచి నెలకు సగటున రూ.120-160 రెవెన్యూ అందుతుంది. మిట్టల్‌ వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ప్రస్తుత చార్జీలను రెట్టింపు చేయాల్సి ఉంటుందని స్పష్టం అవుతుంది. అదే జరిగితే వినియోగదారులపై భారీగా భారం పడనుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios