న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం టెలికం రంగంలోకి రిలయన్స్ జియో రాకతో నష్టాల్లోకి జారుకున్న టెలికాం కంపెనీలకు తాజాగా కొత్త సమస్య ఎదురవుతోంది. దేశీయ టెలికాం రంగంలో దిగ్గజాలుగా వెలుగొందిన వొడాఫోన్‌- ఐడియా, ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో సంస్థలు కనీస చార్జీలను తగ్గిస్తూ మరింత సరసమైన ధరలకు టెలికాం సేవలను అందుబాటులోకి తెస్తుండడంతో దేశంలోని సెల్‌ ఫోన్‌ వాడకందారులు తమ రెండో సిమ్‌ వాడకం అలవాటును తగ్గించుకుంటున్నారు. ఈ ధోరణి ఇటీవల దేశ యువతలో అధికంగా కనిపిస్తున్నది.  

గత మూడు, నాలుగు నెలల నుంచి టెలికాం కనెక్షన్లను (రెండో సిమ్‌ను) తీసేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో టెలికాం కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ధోరణి మరింత బలపడే అవకాశం ఉందని.. ఫలితంగా వచ్చే ఆరు నెలల కాలంలో దాదాపు 6 కోట్ల వరకు టెలికాం కనెక్షన్లు తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

మార్కెట్‌లో తన విస్తృతిని మరింత పెంచుకొనే దిశగా దూసుకుపోతున్న జియో పోటీని తట్టుకునేందుకు పోటీ సంస్థలైన భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ఐడియా తక్కువ విలువ కలిగిన వాడకందారుల కోసం టారీఫ్‌ను గణనీయంగా తగ్గించి పలు ప్లాన్లను అందుబాటులోకి తెచ్చాయి. దీంతో అన్ని కంపెనీల కనీస ప్రీపెయిడ్‌ టారీఫ్‌లు ఒకే దరిదాపుల్లోకి చేరుకున్నాయి. ఫలితంగా మార్కెట్లో ఏ కంపెనీ ప్లాన్‌ తీసుకున్నా తమకు గతంలో మాదిరిగా పెద్దగా కలిసొచ్చేదేమీ లేదన్న వాదన సెల్‌ఫోన్‌ వాడకందారుల్లో కనిపిస్తోంది. 

గతంలో మాదిరిగా నెట్‌కోసం ఒక సిమ్‌, కాల్స్‌ కోసం మరో సిమ్‌, తక్కువ ఫ్రీకాల్‌ చార్జిల కోసం ఒక కంపెనీ సిమ్‌లను వినియోగిస్తూ వచ్చిన వారు చాలా మంది.. ఇప్పుడు ఒకే సిమ్‌లో అన్ని సేవలు అందుబాటు ధరల్లో లభిస్తుండడంతో రెండో సిమ్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారు. దీనికి తోడు ప్రధాన కంపెనీలు తమ నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని పెంచి మెరుగైన డేటా, వాయిస్‌ సేవలను అందిస్తుండడంతో తమకు కలిసి వచ్చిన, ఎక్కువ మందికి తెలిసిన ఫోన్‌ నంబర్‌ను మాత్రం ఉంచుకొని, డేటా, తదితర అవసరాల కోసం తీసుకున్న రెండో సిమ్‌ సేవలను ముగించేస్తున్నారని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి.

తత్ఫలితంగా వచ్చే ఆరు నెలల్లో ప్రధాన టెలికాం సంస్థలకు దాదాపు 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు సెల్‌ఫోన్‌ కనెక్షన్లు తగ్గిపోనున్నాయని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఏఏఐ) వర్గాలు చెబుతున్నాయి. టెలికాం మార్కెట్‌ విశ్లేషకులు మాత్రం వచ్చే ఆరు నెలల్లో ఈ సంఖ్య ఆరు కోట్లకు దరిదాపుల వరకు వెళ్లొచ్చనని టెలికం ప్రొవైడర్లు అంచనా వేస్తున్నారు. 

సేవల్లో పెరిగిన నాణ్యత, అందుబాటులోకి వచ్చిన ధరలే ఇందుకు ప్రధాన కారణమని వారు చెబుతున్నారు. మార్కెట్లో తమ విస్తృతిని పెంచుకొనేందుకు గాను భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియా సంస్థలు రూ.35, రూ.65, రూ.95లతో 28 రోజుల వ్యాలిడిటీతో పలు కనీస పథకాలను అందుబాటులోకి తెచ్చాయి. వీటిలో లభించే సేవలు మార్కెట్లో జియో తీసుకు వచ్చిన తక్కువ ధర కలిగిన 49 ప్యాక్‌కు దాదాపు దరిదాపుల్లో ఉండడంతో చాలా మంది రెండో సిమ్‌ను వదిలి ఒకే సిమ్‌కు సర్దుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. 

ఈ పథకాల ముఖ్య ఉద్దేశం ఎక్కువ మంది వినియోగదారులను ఆక్టివ్‌గా ఉంచుకోవడమైనా ఇవి సంస్థ ఆదాయంపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి ఆక్టివిటీ వల్ల వినియోగదారుల నుంచి లభించే కనీస ఆదాయం తగ్గిపోతోందని సంస్థలు గగ్గొలు పెడుతున్నాయి. 

ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఆగస్టు నెలాఖరు నాటికి దేశంలో 120 కోట్ల టెలికాం కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 73-75 కోట్ల మంది వినియోగదారులు ఒక్క సిమ్‌ను మాత్రమే వినియోగిస్తూ.. టెలికం సేవలను పొందుతున్నారు. మిగతా 45 కోట్ల కనెక్షన్లు రెండు సిమ్‌లను వాడుతున్న వారి వద్ద ఉన్నాయి. అంటే దేశంలో దాదాపు 22 కోట్ల మంది వినియోగదారులు రెండు, అంతకంటే ఎక్కువసిమ్‌లను వినియోగిస్తున్నారని అంచనా. ఇప్పుడు టెలికం సేవలు అందుబాటులోకి వచ్చి.. అవి అందిస్తున్న టారీఫ్‌లలో, సేవల్లో ఎలాంటి తేడా లేని నేపథ్యంలో రానున్న ఆరు నెలల కాలంలో 6 కోట్ల కనెక్షన్లు తగ్గి రెండు సిమ్‌ల వాడకం దారుల సంఖ్య దాదాపు 19 కోట్లకు జారే అవకాశం ఉందని టెలికాం పరిశ్రమ వర్గాలు లెక్కగడుతున్నాయి.

ఇక ఇన్ కమింగ్ కాల్స్ పైనా చార్జీల మోతే 
మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు షాకిచ్చేలా లైఫ్‌టైం ఫ్రీ ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ప్లాన్‌లను రద్దుచేయాలని ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌- ఐడియా సంస్థలు నిర్ణయించాయి. టెలికం సంస్థలు తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో భవిష్యత్తులో ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు సైతం డబ్బులు చెల్లించాల్సిందే. ఈ సేవలను కొనసాగించేందుకు సంబంధిత కంపెనీల చందాదారుల కనీస రీఛార్జిలు చేయించుకోవాల్సి ఉంటుంది. టెలికం మార్కెట్లోకి రిలయన్స్‌ జియో ప్రవేశంతో తమ ఆదాయానికి గండి పడటంతో.. ఈ సంస్థలు జియో పోటీని తట్టుకొనేందుకు ప్రస్తుత టారిఫ్‌లలో మార్పులు చేస్తున్నాయి. ఇందులో భాగంగా లైఫ్‌టైం ఫ్రీ ఇన్‌కమింగ్‌ కాల్స్‌ పథకాలకు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా సంస్థలు స్వస్తి పలకనున్నాయి. 
వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ ఆధ్వర్యంలో ఇన్ కమింగ్ కాల్స్ రీ చార్జి ఇలా
అందులో భాగంగా కనీస రీఛార్జి పథకాలను ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా అందుబాటులోకి తెస్తున్నాయి. ఇన్‌కమింగ్‌ కాల్స్‌పై నిమిషాల చొప్పున ఛార్జీలు వడ్డించకుండా కనీస రీఛార్జిలను చేసుకున్న వారికి నిర్ణీత కాలానికి ఫ్రీ ఇన్‌కమింగ్‌ కాల్స్ వసతి కల్పించనున్నాయి. అందులో భాగంగా రూ.35, రూ.65, రూ.95తో రీఛార్జి ప్లాన్‌లను ఎయిర్‌టెల్‌ అందుబాటులోకి తెచ్చింది. సంబంధిత రీఛార్జి పథకాల ద్వారా 28 రోజల పాటు డేటా, టాక్‌టైం లభించడంతో పాటు ఫ్రీ ఇన్‌కమింగ్‌ కాల్స్‌ సౌకర్యం కూడా లభిస్తుంది. ఇదే తరహాలో రూ.30లతో కనీస రీఛార్జి పథకాన్ని తేవాలని వొడాఫోన్‌ ఐడియా సంస్థ కూడా నిర్ణయించింది.