Asianet News TeluguAsianet News Telugu

టెక్నాలజీపై పట్టు ఉంటేనే ఇక కొలువు.. ఇదీ లింక్డ్‌ఇన్ సర్వే

శరవేగంగా ప్రగతిపథంలో ప్రయాణిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశంలో టెక్నాలజీలోనే ఉద్యోగావకాశాలు మెరుగవుతున్నాయని లింక్డ్ఇన్ అనే సంస్థ సర్వేలో తేలింది. మెషిన్ లెర్నింగ్ మొదలు అప్లికేషన్ డెవలప్ మెంట్ అనలిస్ట్ నుంచి సాఫ్ట్ స్కిల్స్ ఉన్న వారికి మాత్రమే ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయని ఆ సర్వే సారాంశం. 

8 out of 10 fastest growing jobs in India in technology  sector: Survey
Author
Delhi, First Published Sep 7, 2018, 9:17 AM IST

సాంకేతిక రంగంలో పట్టు సాధించిన వారికే సమీప భవిష్యత్‌లో ఉద్యోగావకాశాలు ఉన్నాయని తేలిపోయింది. మెషిన్ లెర్నింగ్ మొదలు అప్లికేషన్ డెవలప్ మెంట్ అనలిస్ట్, బ్యాక్ ఎండ్ డెవలపర్, డేటా సైంటిస్ట్, ఫుల్ స్టాక్ ఇంజినీర్ వంటి టాప్ ఐదు పోస్టుల నియామకానికి ప్రాధాన్యం పెరుగుతున్నది.

దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో గల ఉద్యోగాలు క్లర్క్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌, ఎగ్జిక్యూటివ్‌, మేనేజర్‌, ఇంజినీర్‌, శాస్త్రవేత్త. కానీ సత్వర ఆర్థికాభివృద్ధికి తోడు శాస్త్ర- సాంకేతిక రంగం బహుముఖంగా విస్తరిస్తున్న పరిస్థితుల్లో సమీప భవిష్యత్‌లో ఉద్యోగాల తీరుతెన్నులు సమూలంగా మారిపోతున్నాయి.

అందునా భారతదేశంలో ప్రతి పది ఉద్యోగాల్లో ఎనిమిది ఉద్యోగాలు టెక్నాలజీ రంగంలోనే లభిస్తున్నాయి. అన్ని రంగాల్లోనూ ఉద్యోగ నియామకాల్లో టెక్నాలజీపై పట్టు గల వారికే ప్రాధాన్యం లబిస్తున్నది. ఇంతకు ముందెన్నడూ చూడని, ఊహకు అందని కొత్త తరహా ఉద్యోగాలు పుట్టుకొస్తాయి.

అవి ఏమిటో, ఎలా ఉంటాయనే అంశంపై అతిపెద్ద ‘ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌’ సంస్థ అయిన లింక్డ్‌ ఇన్‌ అధ్యయనం చేసింది. దీని కోసం దేశంలో 5 కోట్ల కంటే ఎక్కువ మంది వ్యక్తిగత అర్హతల (ప్రొఫైల్స్‌)ను పరిశీలించి ‘భారతదేశంలో 10 కొత్త ఉద్యోగాలు’ అనే పేరుతో ఒక నివేదిక రూపొందించింది. దేశంలో ఏటా 50 లక్షల మంది ఉద్యోగాల విపణిలోకి వస్తున్నారు.

కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటేనే ఉద్యోగం... లేకుంటే వెనకబడిపోవడమే. సంప్రదాయ ఇంజినీరింగ్ ఉద్యోగాల నుంచి నూతన ప్రమాణాలతో కూడిన టెక్నాలజీని తెలిసి ఉన్న వారి వైపే ఉద్యోగాలు మళ్లుతున్నాయి. ఐదేళ్ల క్రితం వరకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్, సీనియర్ బిజినెస్ అనలిస్ట్ ఉద్యోగాలని చెప్పుకునే వారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల కల్పనలో మెషిన్ లెర్నింగ్ మార్మోగిపోతున్నది.

కృత్రిమ మేధస్సులో భాగమైన మెషిన్ లెర్నింగ్ చేసిన వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతోంది. ఆటోమేటిక్‌గా డేటాను మోడలింగ్‌గా మార్చగల సామర్థ్యం కావాల్సి ఉంటుంది. ప్రతి సంస్థ కూడా తమ వద్ద అందుబాటులో ఉన్న సమాచారంతో వినియోగదారుడికి మెరుగైన సేవలందించే వారి కోసం ఆసక్తిగా చూస్తున్నాయి.

లింక్డ్ ఇన్ నివేదిక ప్రకారం కొత్త ఉద్యోగాల కల్పనలో టెక్నాలజీ రంగానిదే అగ్రస్థానం. అందువల్ల సాంకేతిక నైపుణ్యం ఉన్నవారికి కొత్త తరహా ఉద్యోగాలు, అధిక సంఖ్యలో లభించే అవకాశం ఉంది. ఉదాహరణకు వ్యాపార సంస్థల్లో ‘మెషీన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్‌’ పాత్ర గత అయిదేళ్లలో 43 శాతం మేరకు విస్తరించింది.

ఆసియా- పసిఫిక్‌ దేశాల్లో కస్టమర్‌ సక్సెస్‌ మేనేజర్‌ (సీఎస్‌ఎం) ఉద్యోగానికీ ఎంతో గిరాకీ ఉంది. ఆస్ట్రేలియాలో ఇదే అగ్రశ్రేణి ఉద్యోగం. సింగపూర్‌లో 4వ స్థానంలో, మనదేశంలో 6వ స్థానంలో ఉంది.ఐటీ, ఐటీ సేవల రంగాల్లో ఈ ఉద్యోగాల సంఖ్య 27 శాతం పెరిగింది. 

భారతదేశంలో అత్యధిక శాతం వ్యాపార సంస్థలు బిగ్ డేటా, డిజిటల్ ప్రొడక్ట్స్ దిశగా అడుగులేస్తున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగ సేవలు మొదలు ఉత్పాదకత, మీడియా, వినోదం, నైపుణ్య రంగం, రిటైల్, వినియోగదారీ ఉత్పత్తలు, టెక్నాలజీ - సాఫ్ట్‌వేర్ నుంచి సామర్థ్యం, వ్రుద్ధి సాధించిన వారికి ఉద్యోగాల కల్పనలో ప్రాధాన్యం లభిస్తోంది.

మున్ముందు సమాచారానికి (డేటా) గిరాకీ మరెంతో పెరగనున్నది. ఈ విభాగంలో ఉద్యోగాలు అధిక సంఖ్యలో లభిస్తాయి. మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్‌, డేటా సైంటిస్ట్‌, బిగ్‌ డేటా డెవలపర్‌ ఉద్యోగాలకు ఇప్పుడే ఎంతో ప్రాధాన్యం ఉంది. ముంబై, ఎన్‌సీఆర్‌ (ఢిల్లీ పరిసరాలు)లో డేటా సైంటిస్ట్‌ ఉద్యోగాలు అధికంగా లభిస్తున్నాయి. 

మనదేశం నుంచి సింగపూర్‌కు అధికంగా వెళ్తున్న ఉద్యోగుల్లో డేటా సైంటిస్టులు, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు ఉంటున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, కొన్ని దక్షిణాసియా దేశాల్లో ‘డేటా సైంటిస్ట్‌’ లకు ఎంతో డిమాండ్‌ ఉంది. డేటా సైంటిస్టు ఉద్యోగాలకు అమెరికాలో ఎంఎస్‌ వంటి ఉన్నత విద్యార్హతతో వెళ్లే వారి సంఖ్య ఎక్కువ.

మనదేశంలో బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు కొంత అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాల్లో చేరుతున్నారు. అమెరికాలో 17 శాతం మంది డాక్టరేట్ డిగ్రీ గల నూతన గ్రాడ్యుయేట్లు మెషిన్ లెర్నింగ్, డేటా సైంటిస్ట్ ఉద్యోగాలు పొందుతున్నారు. ప్రస్తుతం ఉద్యోగాలు పొందుతున్న వారిలో సగానికి పైగా బాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి శిక్షణ ఇచ్చి మరీ ఉద్యోగాలు కల్పిస్తున్నాయి సంస్థలు. ఉన్నత స్థాయి విద్యార్హతలు గల విద్యార్థులు దొరకడం సంస్థలకు కష్టంగా మారింది. 

కేవలం టెక్నాలజీ నైపుణ్యం ఉన్నవారే మంచి ఉద్యోగాల్లో కుదురుకుంటారని మిగిలిన వారికి కష్టమని అనుకుంటే అది తప్పు. నేర్పుగా మాట్లాడటం, ఎదుటివారిని ఒప్పించడం, బాగా రాయగల నేర్పు, బృందంలో కలిసి పనిచేయడం.. వంటి నైపుణ్యాలు (సాఫ్ట్‌ స్కిల్స్‌) ఉన్న అభ్యర్ధులకు ఇప్పుడే ప్రాధాన్యం ఉంది.

ఇవి కలిగిన వారికి భవిష్యత్‌లో ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. కస్టమర్‌ సక్సెస్‌ మేనేజర్‌ (సీఎస్‌ఎం) ఉద్యోగం ఇప్పుడే ‘టాప్‌ 10’ జాబితాలో ఉంది. భవిష్యత్‌లో దీనికి ఇంకా ప్రాధాన్యం పెరుగుతుందని అంచనా.

Follow Us:
Download App:
  • android
  • ios