న్యూఢిల్లీ: ప్రస్తుతం కమ్యూనికేషన్‌ రంగంలో వాట్సాప్‌ కంటే ప్రజాదరణ పొందిన యాప్‌ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. భారతదేశంలోనైతే  దీని వినియోగం మరీ ఎక్కువ. ఇండియాలో వాట్సాప్‌ దాదాపు 45 కోట్ల మంది వాడుతున్నారు. మరి ఇంత ఎక్కువగా జనం ఆధారపడిపోయిన యాప్‌లో ఏవైనా సెక్యూరిటీ సమస్యలు ఉంటే? అవి మన సమాచారం బయటపడితే మన జీవితం.. సంసారం నడిరోడ్డున పడతాయి. 

‘వాట్సాప్‌ మెసేజింగ్‌తో ఏ ప్రాబ్లం లేదు... మాది ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ అంటూ వాట్సాప్‌ వాళ్లు నిత్యం గొప్ప చెబుతారు. కానీ ఈ ఎన్‌క్రిప్షన్‌ బడాయి అంతా ఒట్టి ఉపయోగం లేని వ్యవహారం అని విమర్శలు వస్తున్నాయి. నిజానికి వాళ్లు ఎలాంటి ఎన్‌క్రిప్షన్‌ టెక్నిక్స్‌ వాడుతున్నారు? అవి హ్యాకర్లకి కష్టసాధ్యమైనవేనా? నిజంగా హ్యాకర్లు తలచుకుంటే వాట్సాప్‌‍లో యూజర్ల సమాచారానికి సెక్యూరిటీ ఉంటుందా? అంటే అన్నీ సందేహాలే!

also read నోయిస్ ఫిట్ ఫ్యూజన్ హైబ్రిడ్ స్మార్ట్ వాచ్ ఇండియాలో లాంచ్...
 
నిజంగా వాట్సాప్‌ వాడడం ప్రమాదకరమా? అవుననే అంటున్నారు కొందరు. మరి వాట్సాప్‌ వాడితే ఎంత ప్రమాదమో తెలియాలంటే... మనం వీళ్లనీ వాళ్లనీ అడిగితే సరిపోదు. డైరెక్ట్‌గా పావెల్‌ డురోవ్‌ని అడగాలి. ఆయన ఎవరో కాదు, మరో ప్రజాదరణ పొందిన కమ్యూనికేషన్‌ టూల్‌ రూపకర్త, టెలిగ్రామ్‌ సిఇవో.
 
పావెల్‌ డురోవ్‌ నిత్యం తన బ్లాగ్‌లో వాట్సాప్‌ మీద విమర్శలతో విరుచుకుపడుతుంటాడు. వాట్సాప్‌ ఆయనకి పోటీ సాఫ్ట్‌వేర్‌ కాబట్టి ఇలా చేస్తున్నాడని తీసిపారేయడం సులువే. కానీ ఆయన మాటల్లో నిజం మీద కూడా మనసు పెట్టాలని టెక్ నిపుణులు అంటున్నారు. వాట్సాప్ తన ‘ఎండ్ టు ఎండ్’ ఎన్స్క్రిప్షన్ పేరిట వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తోందని పావెల్ డురోవ్ తెలిపారు. 

ప్రపంచంలో నంబర్‌ వన్‌ ధనవంతుడైన అమెజాన్‌ ఓనర్‌ జెఫ్‌ బెజోస్‌ ఐఫోన్‌నూ వాట్సాప్‌ ద్వారానే హ్యాక్‌ చేశారని వార్తలొచ్చాయి. మెసేజింగ్ యాప్ ద్వారా సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ వాట్సాప్ ద్వారా మాలిసియస్ ఎంపీ4 ఫైల్ జెఫ్‌కు పంపడమే దీనికి ఉదాహరణ. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ భద్రత గురించి ఎంతోమంది పునరాలోచిస్తున్నారు.

also read పెబుల్ స్టీరియో ఇయర్‌పాడ్స్‌ లాంచ్... 25 గంటల నాన్-స్టాప్ మ్యూజిక్‌తో...

వాట్సాప్‌ యాప్‌కు ఉన్న పాపులారిటీ మీద అసూయతోనే వ్యతిరేకులంతా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా? నిజంగానే వాట్సాప్‌లో భద్రతా సమస్యలు ఉన్నాయా ? అన్నది ఆలోచించాల్సిన విషయం. 2019లో వాట్సాప్‌ తనలో ఉన్న 12 భద్రతాపరమైన సమస్యల్ని స్వయంగా బయటపెట్టింది. వాట్సాప్ తనలో గల 12 భద్రతాపరమైన సమస్యల్లో ఐదు సమస్యలు సాధారణం, ఏడు సమస్యలు సంక్లిష్టం అని కూడా అన్నారు.

తరువాత వాటిని సరిచేయడం కూడా జరిగింది. వాట్సాప్‌లోనే కాదు, ప్రతి యాప్‌లోనూ సెక్యూరిటీ సమస్యలు ఉంటాయి. అంతమాత్రాన దాని ప్రయోజనాల్ని మనం వదిలేసుకోలేం. అలాగని సెక్యూరిటీనీ గాలికి వదిలేయలేం. వాట్సాప్‌ చాలామంది నిత్యజీవితంలో భాగం అయిపోయింది. దీన్ని మరింత భద్రంగా చేసి ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా పొందేలా చేసుకునే బాధ్యత వాట్సాప్‌దే!