ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ ప్రభావంతో అమెరికా అల్లాడి పోతోంది. ఇప్పటికే ఆ దేశంలో కరోనా వైరస్ వల్ల  115 మంది మరణించగా దాని బారిన 6,515 మంది దీని బారినపడ్డారు.

ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. కరోనా భయంతో అమెరికన్లు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే వణికి పోతున్నారు. పెద్దమొత్తంలో ఆఫీసులు కూడా మూతపడ్డాయి. 

కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసేందుకు వీలు కల్పించాయి. దీంతో మార్కెట్లు, వీధులు మూగబోయాయి. అంతేకాకుండా పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు తమ ఉద్యోగులను తొలగించే పరిస్థితి ఏర్పడింది. 

ఈ సమయంలో ఇళ్లకే పరిమితమైన ప్రజలు నిత్యావసర సరకులు, ఇతర సామగ్రి ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసుకోవడం ఎక్కువైంది. ఆర్డర్‌ చేసినవి కూడా వారికి చేరేందుకు చాలా సమయం తీసుకుంటున్నాయి. 

దీంతో ఆన్‌లైన్‌ షాపింగ్‌కు భారీ డిమాండ్ ఏర్పడటంతో ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ లక్ష ఉద్యోగులను నియమించుకునేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా వేర్‌హౌజ్‌, డెలివరీ, షాప్‌ కీపర్లను నియమించుకుంటామని ప్రకటించింది.

అమెరికాలో చాలా రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ భయంతో ప్రజలు నిత్యావసర సరకులను ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొని తెచ్చుకుంటున్నారు. దీంతో దుకాణాల్లో సరకులు ఖాళీ అవుతున్నాయి. ఇదిలా ఉంటే చాలా రెస్లారెంట్లు, ట్రావెల్‌ సంస్థలు, వినోద వ్యాపారాలు మూత పడడంతో వాటిలోని సిబ్బందికి పనిలేకుండా పోయింది. 

ఈ సమయంలో ఈ-కామర్స్‌ సంస్థలు కాస్త ఊరట కలిగించాయి. దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడేవరకూ వారికి తమ కంపెనీలో పూర్తి, పార్ట్‌టైం ఉద్యోగాలు కల్పిస్తామని అమెజాన్‌ తెలిపింది. 

అమెజాన్‌ బాటలోనే అల్బెర్‌స్టోన్, క్రోగర్‌, రేలీ వంటి రిటైల్‌ సంస్థలూ కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు ప్రకటించాయి. అంతేకాక ప్రతి గంటకు వారికి చెల్లించే మొత్తాన్ని 15నుంచి 17డాలర్లకు పెంచుతున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది.