విదేశాల్లో టీ 20 టోర్నీలు ఆడేందుకు భారత క్రికెటర్లెవరికీ ఇక నుంచి నిరభ్యంతర పత్రాలు(ఎన్ఓసీ)లు ఇవ్వమమని క్రికెట్ పరిపాలక కమిటీ (సీఓఏ) తెలిపింది. కెనడాలో జరిగిన గ్లోబల్ టీ20ల్లో ఆడేందుకు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు సీఓఏ బోర్డు అనుమతించింది. కాగా... యువరాజ్ కి ఇచ్చిన నిరభ్యంతర పత్రమే చివరిదని తేల్చి చెప్పింది.

ఈ విషయంలో సీఓఏ సభ్యుడు ఒకరు మాట్లాడారు. ‘‘యువరాజ్ సింగ్ కి నిరభ్యంతర పత్రం ఇచ్చాం. ఇక ఇదే ఆఖరిది. ఇక మీదట ఏ భారత క్రికెటర్ విదేశీ లీగ్ లో ఆడేందుకు అనుమతి ఇవ్వం’’ అని తేల్చి  చెప్పారు. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధికారులు విస్మయం ప్రకటించారు.

రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లను ఇక ఏ టోర్నీలోనూ ఆడకుండా చేయడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బోర్డులో సరైన పాలక వ్యవస్థ లేకపోతే ఇలాంటి అనిశ్చితి నిర్ణయాలే వస్తాయని ఓ అధికారి అన్నారు. మరో అధికారి మాట్లాడుతూ... ఒక దేశానికి రిటైర్ అయినంత మాత్రన మొత్తం బౌగోళిక ప్రాంతానికి రిటైర్మెంట్ ప్రకటించినట్లు కాదన్నారు. ఒక దేశపు రిటైర్డ్ క్రికెటర్లను అనుమతించడమనేది నిర్వాహకుల ఇష్టమని చెప్పారు. ఇందులో ఏదైనా సమస్య ఉంటే ఐసీసీ చూసుకుంటుందని చెప్పారు.