టీం ఇండియా క్రికెటర్లను.. తన పెళ్లికి అతిథులుగా ఆహ్వానిస్తానని పాక్ క్రికెటర్  హసన్ అలీ చెబుతున్నారు. పాక్ బౌలర్ హసన్ అలీ భారత్ కి చెందిన షమీయా అర్జూని వివాహమాడుతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 20వ తేదీన దుబాయిలో వీరి వివాహం జరగనుంది. ఈ సందర్భంగా హసన్ అలీ తన పెళ్లి గురించి మాట్లాడాడు

టీం ఇండియా క్రికెటర్లను తన పెళ్లికి ఆహ్వానిస్తానని ఈ సందర్భంగా హసన్ ప్రకటించాడు. తామంతా క్రికెటర్లమని.. తమ మధ్య పోరు మైదానంలో మాత్రమే ఉంటుందని.. బయట కాదని చెప్పారు. ఇండియన్ క్రికెటర్లు తన పెళ్లికి వస్తే.. తాను చాలా సంతోషిస్తానని కూడా చెప్పాడు

షమీయా అర్జూతో తన వివాహాన్ని కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచాలనుకున్నప్పటికీ మీడియా ద్వారా బయటకు వచ్చిందని చెప్పాడు. దాంతో తాను అధికార ప్రకటన చేయాలని నిర్ణయించుకుని పెళ్లికి సంబంధించి స్పష్టత ఇవ్వాల్సి వచ్చిందన్నాడు. రూమర్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలనే ఉద్దేశంతోనే బహిరంగ ప్రకటన చేశానని హసన్‌ అలీ చెప్పుకొచ్చాడు.

హరియాణా రాష్ట్రానికి చెందిన షమీయా భారత్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉన్నత చదువు కోసం ఇంగ్లండ్‌కు వెళ్లారు. అనంతరం ఫ్లైట్‌ ఇంజనీర్‌గా ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం దుబాయ్‌లో ఇద్దరి మధ్య మొదలైన పరిచయం ఇప్పుడు పరిణయం దాకా వచ్చింది.