Asianet News TeluguAsianet News Telugu

Magnus Carlsen: యే బిడ్డా.. ఇది కార్ల్సన్ అడ్డా... వరుసగా ఐదోసారి ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచిన చెస్ రారాజు

World Chess Championship: 2013 నుంచి 64 గళ్ల సామ్రాజ్యాన్ని ఏక ఛత్రాధిపత్యంగా ఏలుతున్న చదరంగ రారాజు మాగ్నస్ కార్ల్సన్.. వరుసగా ఐదో సారి  ప్రపంచ కిరీటాన్ని సొంతం చేసుకున్నాడు. తాను ఫీల్డ్ లో ఉన్నన్నాళ్లు ఢీకొట్టే వాళ్లే లేరని చెప్పకనే చెప్పాడు. 

World Chess Championship: Magnus Carlsen wins fifth crown
Author
Hyderabad, First Published Dec 11, 2021, 11:53 AM IST

ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ నార్వే యోధుడు మాగ్నస్ కార్ల్సన్ వరుసగా ఐదో సారి ఛాంపియన్ అయ్యాడు. 2013 నుంచి వరుసగా ప్రపంచ చెస్ ఛాంపియన్ గా అవతరిస్తున్న ఈ సారి కూడా టైటిల్ అందుకున్నాడు. రష్యా గ్రాండ్ మాస్టర్ ఇయాన్ నెపోమ్నియాషిపై 7.5-3.5  పాయింట్లతో విజయం సాధించాడు.  శుక్రవారం దుబాయ్ వేదికగా జరిగిన 11వ గేమ్ లో కార్ల్సన్.. వరుసగా ఐదోసారి ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ ఎగురేసుకుపోయాడు. 

64 గళ్లపై మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ కార్ల్సన్.. శుక్రవారం జరిగిన 11 వ గేమ్ లో 49 ఎత్తుల్లో గెలుపొందాడు. ఈ గేమ్ లో నల్ల పావులతో ఆడిన కార్ల్సన్.. మరో మూడు గేమ్ లు మిగిలుండగానే నెపోమ్నియాషి కథ ముగించాడు. అప్పటికే 11 గేమ్ లలో 7.5 పాయింట్ల లీడ్ తో ఉన్న  కార్ల్సన్ ను తదుపరి మూడు గేమ్ లలో గెలిచినా  ఓడించడం నెపోమ్నియాషికి కష్టమే కావడంతో.. విజేతను ముందే ఖరారు చేశారు. 

 

2013, 2014, 2016, 2018 లలో నిర్వహించిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ లలో విజేతగా నిలిచిన కార్ల్సన్.. తాజాగా 2021 లో కూడా టైటిల్  నెగ్గాడు. దీంతో ఐదు సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ రికార్డును సమం చేశాడు. 

ఈ పోటీలలో విజేతగా నిలిచిన కార్ల్సన్ కు రూ. 12 లక్షల యూరోలు (రూ. 10 కోట్ల 28 లక్షలు), రన్నరప్ నెపోమ్నియాషికి 8 లక్షల యూరోలు (రూ. 6 కోట్ల 85 లక్షలు) ప్రైజ్ మనీ లభించాయి.

 

ఛాంపియన్షిప్ అనంతరం కార్ల్సన్ మాట్లాడుతూ.. ‘ఈసారి ఛాంపియన్షిప్ ఆరంభంలో చాలా కఠినంగా అనిపించింది. కొంచెం ఒత్తిడికి గురయ్యాను. రకరకాల ఆలోచనలతో కాస్త డిస్ట్రబ్డ్ గా అనిపించింది. కానీ తర్వాత అంతా తేలికైపోయింది. అన్నీ కలిసొచ్చాయి..’ అని అన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios