ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో భారత షట్లర్ ప్రణయ్ అద్భుత విజయాన్ని సాధించాడు. చైనాకు చెందిన సీనియర్ షట్లర్, ఒలింపిక్ విజేత లిన్ డాన్ పై అతడు సంచలన  విజయం సాధించాడు.  పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ లో భాగంగా డాన్ తో తలపడ్డ ప్రణయ్ 21-11, 13-21,21-7 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. 

ఇప్పటివరకు  వీరద్దరు తలపడ్డ మ్యాచుల్లో ప్రణయ్ విజయాలే ఎక్కువగా వుండటం విశేషం. ఈ  మ్యాచ్ తో కలిపి వీరిద్దరు ఐదుసార్లు తలపడగా ప్రణయ్ అత్యధికంగా మూడుసార్లు విజేతగా నిలిచాడు. ఇలా 11వ సీడ్ డాన్ పై అన్ సీడెడ్ ప్రణయ్ అద్భుత విజయాలను అందుకుంటూ ప్రతిసారీ పైచేయి సాధిస్తూ భారత బ్యాడ్మింటన్ ప్రియులను అలరిస్తున్నాడు. 

ఈ  మ్యాచ్ విషయానికి వస్తే 62 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. మొదటి సెట్లో 21-11తో అదరగొట్టిన ప్రణయ్ రెండోరౌండ్లో  వెసుకబడ్డాడు. అనూహ్యంగా డాన్ పుంజుకుని ప్రణయ్ పై పైచేయి సాధించాడు. ఇలా ఆ రౌండ్ లో 13-21 తేడాతో ప్రణయ్ వెనుకబడ్డాడు. దీంతో నిర్ణయాత్మక చివరి రౌండ్లో మళ్లీ సత్తాచాటిన ప్రణయ్ ఏకంగా 21-7 తేడాతో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించాడు. ఇలా ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ లిన్ డాన్ ను మట్టికరిపించి ప్రణయ్ ప్రీ క్వార్టర్స్ కు అర్హత సాధించాడు. 

ఈ సందర్భంగా ప్రణయ్ మీడియాతో మాట్లాడుతూ... బలమైన ప్రత్యర్థి లిన్ డాన్ ఓడించడానికి పక్కా వ్యూహాలతో బరిలోకి దిగినట్లు తెలిపాడు. అవన్నీ సరైన సమయంలో అమలుచేయడంతో ఈ విజయం సాధ్యమయ్యింది. తనదైన రోజున ఎంతటి గొప్ప ఆటగాన్నయినా ఓడించే సత్తా వుందని ప్రణయ్ పేర్కొన్నాడు.