World Athletics Championship 2022: ఏడో స్థానంతో ముగించిన అన్నూ రాణి.. భారత్ ఆశలన్నీ గోల్డెన్ బాయ్ పైనే..
World Athletics Championship 2022: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో భారత మహిళా జావెలిన్ త్రోయర్ అన్నూరాణి ఫైనల్స్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
అమెరికాలోని యూజీన్ వేదికగా జరుగుతన్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్-2022 లో భారత యువ క్రీడాకారిణి అన్నూ రాణి పోరాటం ముగిసింది. జావెలిన్ త్రో లో ఫైనల్స్ కు అర్హత సాధించిన ఆమె.. ఫైనల్స్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఐదు ప్రయత్నాలలో భాగంగా ఒకేసారి 60 మీటర్లకు పైగా బరిసెను విసరగలిగింది. మిగిలిన నాలుగుసార్లు ఆమె విఫలమైంది. దీంతో ఈ ఛాంపియన్షిప్స్ ఫైనల్స్ లో ఆమె ఏడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
శుక్రవారం ముగిసిన జావెలిన్ త్రో మహిళల ఫైనల్స్ లో బరిలోకి దిగిన అన్నూ రాణి.. ఐదు ప్రయత్నాల్లో ఒక్కసారి మాత్రమే 61.12 మీటర్ల దూరం విసిరింది. తొలిసారి 56.18 మీటర్లు వేసిన ఆమె.. ఆ తర్వాత నాలుగు ప్రయత్నాల్లో 61.12, 58.14, 59.98, 58.70 మీటర్ల దూరం విసిరింది. దీంతో ఆమెకు నిరాశతప్పలేదు.
ఈ పోటీలలో భాగంగా అర్హత రౌండ్లలో ఆమె 59.60 మీటర్ల దూరం విసిరి ఫైనల్స్ కు క్వాలిఫై అయి భారత శిబిరంలో ఆశలు రేపింది. అయితే ఫైనల్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కెల్సీ లీ బార్బర్ (ఆస్ట్రేలియా) మరోసారి తన సత్తా చాటింది. ఫైనల్స్ లో ఆమె ఏకంగా 66.91 మీటర్ల దూరం విసిరి స్వర్ణం నెగ్గింది. అమెరికాకు చెందిన కారా వింగర్ 64.05 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచి రజతం సాధించింది. ఇక జపాన్ త్రోయర్ హరుకా కిటగుచి 63.27 మీటర్ల దూరం విసిరి కాంస్యం గెలచుకుంది.
ఇదిలాఉండగా ఈ సీజన్ లో అన్నూరాణి జంషెడ్‌పూర్ లో జరిగిన నేషనల్స్ లో భాగంగా ఏకంగా 63.82 మీటర్ల దూరం విసిరి కెరీర్ బెస్ట్ నమోదు చేసింది. ఆ దూరం విసిరినా ఆమెకు ఈ పోటీలలో కాంస్యమైనా దక్కేది. ఫైనల్స్ లో మూడో స్థానంలో నిలిచిన జపాన్ అమ్మాయి విసిరిన దూరం 63.27 మీటర్లు మాత్రమే..
ఆశలన్నీ అతడిమీదే..
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో అన్నూ రాణి పోరాటం ముగియడంతో ఇప్పుడు అందరి చూపు టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రా మీదే ఉంది. గురువారం ముగిసిన క్వాలిఫికేషన్స్ రౌండ్ లో అతడు.. తొలి ప్రయత్నంలోనే నీరజ్ ఏకంగా 88.39 మీటర్ల దూరం విసిరి తుది పోరుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. నీరజ్ తో పాటు మరో భారత క్రీడాకారుడు రోహిత్ యాదవ్ కూడా 11వ స్థానంతో ఫైనల్స్ కు అడుగుపెట్టాడు. మరి వీరిలో భారత్ కు పతకాలు తెచ్చేది ఎవరో వేచి చూడాలి. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఫైనల్స్ జరుగుతాయి.