CWG 2022: ‘షూటింగ్’ లేకున్నా తోపులమే.. ‘కామన్వెల్త్’లో దుమ్మురేపిన భారత్
Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడలలో భారత్ అనుకున్నదానికంటే మంచి ఫలితాలు రాబట్టింది. వాస్తవానికి ఈ క్రీడలలో ‘షూటింగ్’ను తీసేశారు కానీ ఉండుంటే భారత్ పతకాల సంఖ్య మరింత పెరిగేది.
సోమవారం బర్మింగ్‌హామ్ వేదికగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు స్థాయికి తగ్గట్టుగానే రాణించారు. పలు క్రీడలలో ఇప్పటివరకు ఒక్క పతకం కూడా తీసుకురాని ఆటగాళ్లు.. కామన్వెల్త్ లో ఆ క్రీడలలో ఏకంగా స్వర్ణాలు తెచ్చారు. లాన్ బౌల్స్, ట్రిపుల్ జంప్, ట్రాక్ అండ్ ఫీల్డ్ లో గతంలో భారత్ పతకాలు సాధించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు భారత్.. ఆ ఖాళీలను పూరించింది. ఈ క్రీడలలో భారత్ 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ఈసారి ఈ మెగా ఈవెంట్ లో షూటింగ్ ను తీసేశారు గానీ ఉండుంటే మన పతకాల సంఖ్య మరింత పెరిగేది.
26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలు.. మొత్తంగా 66 పతకాలతో మూడో స్థానం. 2018లో గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ సాధించిన పతకాలవి. పాయింట్ల పట్టికలో అప్పుడు భారత్ మూడో స్థానంలో ఉంది. తాజాగా భారత్.. 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే గత క్రీడలలో షూటింగ్ లో భారత్ 16 (66 లో 16 షూటింగ్ నుంచే) పతకాలు సాధించింది. కానీ ఈసారి ఆ క్రీడాంశం లేకున్నా మనకు పతకాలకు లోటు లేదు.
2022కు ముందు భారత్ మొత్తంగా 503 పతకాలు సాధిస్తే అందులో షూటింగ్ లో సాధించినవే 135. అదీగాక భారత్ అప్పటివరకు (2018 దాకా) 181 స్వర్ణ పతకాలు గెలిస్తే అందులో షూటింగ్ లో గెలిచిన బంగారు పతకాలే 63. కానీ ఈసారి బర్మింగ్‌హామ్ లో షూటింగ్ ను తీసేశారు. అయినా భారత్ నిరాశపడలేదు. షూటింగ్ లో పతకాల లోటును ఈసారి వెయిట్ లిఫ్టర్లు, రెజ్లర్లు, బాక్సర్లు మరిపించారు.
ఏ ఏ క్రీడల్లో ఎన్ని పతకాలు వచ్చాయంటే..
పతకాల పట్టికలో భారత్ 2018తో పోలిస్తే ఒక స్థానం దిగజారినా మన క్రీడాకారులు మెరుగ్గా రాణించారు. ముఖ్యంగా రెజ్లర్లు (ఈ క్రీడలలో భారత్ కు తొలి పతకం రెజ్లింగ్ లోనే వచ్చింది. 1934లో రెజ్లర్ రషీద్ అన్వర్ కాంస్యం గెలిచాడు), బాక్సర్లతో పాటు బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ లో భారత్ కు పతకాలు వచ్చాయి.
రెజ్లింగ్ - 12
వెయిట్ లిఫ్టింగ్ - 10
అథ్లెటిక్స్ - 08
బాక్సింగ్ - 07
టేబుల్ టెన్నిస్ - 07
బ్యాడ్మింటన్ - 06
జూడో - 03
హాకీ - 02
లాన్ బౌల్స్ - 02
స్క్వాష్ - 02
క్రికెట్ - 01
పారా పవర్‌లిఫ్టింగ్ - 01