CWG 2022: ఎవరీ సంకేత్ సర్గర్.. పాన్ షాప్ ఓనర్ కొడుకు బర్మింగ్‌హామ్ వరకు ఎలా వెళ్లాడు..?
Sanket Mahadev Sargar: కామన్వెల్త్ క్రీడలలో భారత్ పతాక బోణీ కొట్టింది. పురుషుల 55 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్ కు చెందిన వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహాదేవ్ సర్గర్.. భారత్ కు రజతాన్ని అందించాడు.
అది మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో గల సంగ్లి టౌన్‌లోని అహల్యదేవి హోల్కర్ రోడ్. అదే రోడ్ కు కొంచెం దూరం వెళ్తే వచ్చే సందిలో ఓ పాన్ షాప్. పేరు సంకేత్ పాన్ షాప్. సాధారణ సమయంలో అయితే అక్కడికి ఏదో పాన్ కట్టించుకోవడానికో లేక టీ, టిఫిన్ కోసమో జనాలు వస్తుంటారు. కానీ శనివారం మధ్యాహ్నం ఆ పాన్ షాప్ దగ్గర ఎన్నడూ చూడనంత జనసందోహం. అక్కడ ఉంచిన 14 ఇంచుల టీవీ ముందు అంతా గుమిగూడి ఆసక్తిగా చూస్తున్నారు. కొద్దిసేపు కొల్హాపూర్ సంగతి పక్కనబెట్టి బర్మింగ్‌హామ్ కు వెళ్దాం. కామన్వెల్త్ క్రీడలలో భాగంగా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్ తరఫున ఆడుతున్న ఓ ఆటగాడు వచ్చాడు.. వెయిట్ లిఫ్టింగ్ లో 248 కిలోల బరువు ఎత్తాడు.. రజత పతకం పట్టాడు. అంతే కొల్హాపూర్ లో ఆ పాన్ షాప్ ముందు సంబురాలు స్టార్ట్. అసలెవరీ సంకేత్ సర్గర్..? అతడికి ఈ పాన్ షాప్‌నకు సంబంధమేంటి..?
సంకేత్ మహాదేవ్ సర్గర్.. కామన్వెల్త్ క్రీడలలో భారత్ తరఫున పతాక బోణీ కొట్టిన వెయిట్ లిఫ్టర్. ఈ 21 ఏండ్ల కుర్రాడిది మహారాష్ట్రలోని కొల్హాపూర్. పైన పేర్కొన్న పాన్ షాపు ఉన్నది అతడి పేరు మీదే. అతడి తండ్రి సంగ్లిలో పాన్ షాపు తో పాటు టీ, టిఫిన్ బండిని నడుపుతూ బతుకు బండిని ఈడుస్తున్నాడు.
తండ్రి కల..
1990లలో కొల్హాపూర్ లోని ఓ కుగ్రామం నుంచి సంగ్లికి మారిన సంకేత్ తండ్రి.. ముందు అక్కడ బతుకుదెరువు కోసం పండ్లు అమ్మేవాడు. ఆ తర్వాత పాన్ షాప్.. తదనంతరం దానినే కాస్త విస్తరించి ఉదయం పూట టిఫిన్లు, టీ అమ్మే బండిగా మార్చాడు. సంకేత్ తండ్రి మహాదేవ్ కు చిన్నప్పట్నుంచి క్రీడలంటే ఇష్టం. కానీ జీవన పోరాటంలో పడి ఆయనకు ఆ అవకాశం రాలేదు. కానీ తాను క్రీడాకారుడు కాకపోయినా తన కొడుకును మాత్రం స్పోర్ట్స్ పర్సన్ గానే చూడాలనుకున్నాడు మహాదేవ్. అందుకు అనుగుణంగానే చిన్ననాటి నుంచే తన కొడుకును ఆ విధంగా ప్రోత్సహించాడు.
సంకేత్ కు 12 ఏండ్ల వయసున్నప్పుడే మహదేవ్ అతడిని తమ పాన్ షాప్‌నకు దగ్గరగా ఉన్న ‘దిగ్విజయ్ వ్యాయామశాల’లో చేర్పించాడు. అది ప్రత్యేకించి వెయిట్ లిఫ్టింగ్ కు సంబంధించిన కోచింగ్ కూడా ఇచ్చేవారు. అక్కడ పడింది సంకేత్ తొలి అడుగు.
శిక్షణ శిక్షనే.. పని పనే..
తండ్రి ప్రత్యేక తర్ఫీదునిస్తున్నాడని సంకేత్ ఇంటిని అశ్రద్ధ చేయలేదు. ఒకవైపు శిక్షణ తీసుకుంటూనే మరోవైపు తన పాన్ షాప్, టిఫిన్ సెంటర్ లో పనిచేసేవాడు. ఉదయమే లేచి ట్రైనింగ్ పూర్తి చేసుకుని మళ్లీ టిఫిన్ సెంటర్ లో అమ్మానాన్నలకు చేదోడువాదోడుగా ఉండేవాడు.
నాన్న స్పూర్తి, గురజాల పోటీ...
‘నువ్వు ఏదైనా సాధించాలనుకుంటే నువ్వు కష్టపడాలి. లేకుంటే నువ్వు నాలాగే ఇదే పాన్ షాప్ లో పాన్లు కడుతూ బతుకునీడాల్సి వస్తుంది..’ ఈ మాటలు సంకేత్ మీద తీవ్రంగా ప్రభావం చూపాయి. 2018 కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా గోల్డ్ కోస్ట్ లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్ లో భారత ఆటగాడు పూజారి గురుజాల పోటీ పడుతున్నాడు. ఉదయమే లేచి ఆ మ్యాచ్ చూస్తున్నాడు సంకేత్. ఆ సమయంలో పాన్ కడుతూ తనతో తానే.. ‘వచ్చే కామన్వెల్త్ గేమ్స్ లో ఆ ప్లేస్ (55కిలోల వెయిట్ లిఫ్టింగ్) లో నేనుంటా.. దానికోసం నేను చాలా శ్రమించాలి.. మిగిలినవన్నీ అనవసరం..’ అని ఫిక్స్ అయ్యాడు.
ప్రయాణం ప్రారంభం..
అప్పటిదాకా సంకేత్ కు జాతీయ స్థాయిలకు వెళ్లాలని, అంతర్జాతీయంగా గుర్తింపు పొందాలనే ఆలోచన లేదు. కానీ పరిస్థితులు, అతడి చుట్టూ ఉన్న వాతావరణం అతడిని ఆ దిశగా ఉసిగొల్పింది. 2019లో అతడు జాతీయ స్థాయిలో మెరిశాడు. 2020లో కోల్కతాలో జరిగిన నేషనల్ లెవల్స్ పోటీలలో స్వర్ణం నెగ్గాడు. మరో ఏడాది తర్వాత కూడా అదే ఫలితాలు రిపీట్ అయ్యాయి. జాతీయ స్థాయిలలో పతకాలు, గుర్తింపు దక్కుతున్నా అతడి గురి మాత్రం ‘కామన్వెల్త్’. ఆ సమయం రానేవచ్చింది. బర్మింగ్‌హామ్ లో జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడలలో భాగంగా అతడు.. 248 కిలోల బరువును ఎత్తి రజతం సాధించాడు. పురుషుల 55 కిలోల విభాగంలో 248 కిలోలను ఎత్తిన సంకేత్.. రెండో స్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో 113 కిలోలు ఎత్తిన అతడు.. క్లీన్ అండ్ జర్క్‌లో 135 కిలోలు ఎత్తి రజతం గెలిచాడు.
‘నేను ఈ క్రీడలలో స్వర్ణం నెగ్గితే గుర్తింపు తప్పకుండా నన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇన్నాళ్లు నా కోసం కష్టపడుతున్న మా నాన్నకు మద్దతు ఇవ్వడం, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడం నా కల...’ కామన్వెల్త్ క్రీడలకు బయల్దేరే ముందు సంకేత్ అన్న మాటలివి. కామన్వెల్త్ క్రీడలు-2022లో భారత్ కు తొలి పతకం అందించాడు సంకేత్ సర్గర్. అందుకే కొల్హాపూర్ తో పాటు యావత్ భారతావని సంకేత్ ను అభినందిస్తున్నది.