వెస్టిండీస్ టూర్ కి ఇటీవల టీం ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. కాగా... ఈ పర్యటన విషయంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పై టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  శుభమన్ గిల్ ని జట్టులో ఎంపిక చేయకపోవడం.. అజింక్య రహానెను కేవలం టెస్టు మ్యాచ్ లకు పరిమితం చేయడం పై సౌరవ్ గంగూలీ మండిపడుతున్నారు.

సెలక్షన్ కమిటీ మొత్తం మూడు ఫార్మాట్ లలో ఒకే ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని... అందరినీ సంతోషపరచడానికి జట్టుని ఎంపిక చేయడం సరికాదని గంగూలీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని గంగూలీ పేర్కొన్నారు.

అన్ని ఫార్మాట్లకు ఒకే ఆటగాళ్లను ఎంపిక చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా చేయడం వల్ల ఆటగాళ్లు మరింత ఆత్మవిశ్వాసంతో రాణిస్తారని పేర్కొన్నారు. కేవలం కొంత మంది ఆటగాళ్లు మాత్రమే మూడు ఫార్మాట్ లలో ఆడుతున్నారని... గొప్ప జట్లలో ఆటగాళ్లు స్థిరంగా ఉంటారని చెప్పారు. అందరినీ సంతోష పెట్టడానికి జట్టు ఎంపిక చేయకూడదని అభిప్రాయపడ్డారు. దేశానికి ఉత్తమ జట్టు అందించాలని సూచించారు.

ఇదిలా ఉండగా... వచ్చే నెలలో భారత్.. విండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్ కోసం ఎంపిక చేసిన జట్టులో అజింక్య రహానేను కేవలం టెస్టులకు మాత్రమే పరిమితం చేశారు. వెస్టిండీస్-ఏ సిరీస్ లో అద్భుత ప్రదర్శన కనపరిచిన శుభమన్ ని అసలు ఎంపిక చేయలేదు. ఈ విషయంలో ఇప్పటికే సోషల్ మీడియాలో విమర్శలు వెలువడుతున్నాయి.