ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మొహాలీ స్టేడియం వేదికగా ఆసీస్‌తో జరిగిన నాలుగో వన్డేల్లో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్లు భారీ స్కోర్ చేసినప్పటికీ... ఫీల్డింగ్ లో చేసిన తప్పిదాల కారణంగా మ్యాచ్ చేజారిపోయింది. 

మ్యాచ్ ఓడిపోయినప్పటికీ..యువ క్రికెటర్  జస్ప్రీత్ బుమ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌తో బుమ్రా తన కెరీర్‌లో 100 అంతర్జాతీయ మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. అయితే సాధారణంగా బౌలింగ్‌తో ఆకట్టుకొనే బుమ్రా.. ఈ మ్యాచ్‌లో ఆడిన ఒక బంతిని సిక్సర్‌గా మలిచి.. తన వన్డే కెరీర్‌లో తొలి సిక్సర్‌ని నమోదు చేసుకున్నాడు. 

బుమ్రా చివరి బంతికి సిక్సర్ కొట్టడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఆనందంతో గంతులు వేశాడు. కోహ్లీ ఆనందంతో చప్పట్లు కొడుతూ.. ఎగురుతుండగా తీసిన వీడియోని బీసీసీఐ ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 


 
కాగా, మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేయగా.. హ్యాండ్స్‌కోంబ్(117), ఖవాజా(91), టర్నర్‌(84)ల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆసీస్ 6 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను 2-2 తేడాతో సమం చేసింది. కాగా, సిరీస్‌ విజేతను నిర్ణయించే మ్యాచ్‌ బుధవారం ఢిల్లీలో జరుగనుంది.