విశాఖ వేదికగా వెస్టిండీస్‌తో భారత్   రెండో వన్డే కోసం తలపడిన సంగతి తెలసిందే. ఈ మ్యాచ్ డ్రాగా మిగిలింది. అయితే.. ఈ మ్యాచ్ లో తొలుత టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకోవడం తనని ఆశ్చర్యానికి గురి చేసిందని భారత మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. 

‘విశాఖలో రాత్రివేళల్లో మంచు కురుస్తుందని తెలిసినా.. కోహ్లీ ముందుగా బ్యాటింగ్‌ చేయాలని తీసుకున్న నిర్ణయంతో నేను షాకయ్యా.  అయితే జట్టులో ముగ్గురు నాణ్యమైన స్పిన్నర్లు(చాహల్‌, కుల్దీప్‌, జడేజా) ఉండటంతోనే అతను ఈ నిర్ణయానికి వచ్చాడేమోననిపిస్తుంది. దీనికితోడు ఇలాంటి పరిస్థితుల్లో భారత బౌలర్లు ఒత్తిడిని అధిగమించి ఆడటాన్ని అతను పరీక్షించాలనుకున్నాడు. మరో ఏడు నెలల్లో ప్రారంభం కానున్న ప్రపంచకప్‌ ముందు బౌలర్ల విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది.’ అని లక్ష్మణ్‌ చెప్పుకొచ్చాడు.

ఇంతకుముందు దీనిపై యువ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ‘మంచులో బౌలింగ్‌ చేయడం చాలా కష్టం.. బంతి త్వరగా తడిచిపోతోంది. బంతిపై పట్టు దొరకడం ఇబ్బందిగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకొని మరింత ఎక్కువగా సాధన చేయాలి’ అని పేర్కొన్నాడు.