Asianet News TeluguAsianet News Telugu

వీరూ భాయ్ నువ్వు కూడా ఇలా అయితే ఎలా?... ట్రెండ్ చూసి మోసపోయిన భారత మాజీ క్రికెటర్...

హిమా దాస్ స్వర్ణం సాధించింటూ ట్విట్టర్‌లో ఫేక్ ట్రెండ్.. నిజమని నమ్మి ట్వీట్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్, వెంటనే డిలీట్... 

Virender Sehwag gets trolls after fake tweet about Hima das after following twitter trends
Author
Birmingham, First Published Jul 30, 2022, 5:11 PM IST

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, క్రికెట్ మాత్రమే కాకుండా అన్ని రకాల క్రీడలను ఫాలో అవుతూ ఉంటాడు. అప్పుడప్పుడూ రాజకీయాలకు సంబంధించిన వ్యంగ్య పోస్టులు కూడా ఆయన ట్విట్టర్ ఖాతాలో కనిపిస్తూ ఉంటాయి. అయితే ట్విట్టర్‌లో నడుస్తున్న ఓ ట్రెండ్‌ని చూసి మోసపోయి వీరూ వేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది...

గాయం కారణంగా టోక్యో ఒలింపిక్స్‌కి దూరమైన భారత స్ప్రింటర్ హిమా దాస్, బర్మింగ్‌హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో బరిలో దిగుతోంది. ఆసియా గేమ్స్ 2020లో రెండు స్వర్ణ పతకాలు, ఓ రజతం సాధించిన హిమా దాస్, అండర్ 19 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ ఓ స్వర్ణం సాధించింది. దీంతో ఆమెపై ఈసారి భారత అంచనాలు ఉన్నాయి...

అయితే ఎవరు మొదలెట్టారో, ఎలా మొదలెట్టారో తెలీదు కానీ కామన్వెల్త్ గేమ్స్‌ 400 మీటర్ల ఈవెంట్‌లో హిమా దాస్ స్వర్ణం సాధించిందంటూ ఓ వీడియో... ట్విట్టర్‌లో తెగ వైరల్ అవ్వడం మొదలైంది. ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన హిమా దాస్ వీడియోను బర్మింగ్‌హమ్‌లో జరిగినట్టుగా చెబుతూ ట్వీట్లు వైరల్ అయ్యాయి...

ఇది ఎక్కడి దాకా వెళ్లిందంటే ఏకంగా హిమాదాస్ పేరు, 400 మీటర్ల గోల్డ్ ట్రెండింగ్‌లో టాప్‌లో నిలిచాయి. సాధారణ ట్విట్లర్ జనాలతో పాటు వెరిఫికేషన్ టిక్ మార్కు ఉన్న కొన్ని అధికారిక ఖాతాలు కూడా హిమా దాస్ నిజంగానే స్వర్ణం గెలిచిందేమోనని భావించి, ట్వీట్లు వేశారు. వీటిని చూసిన వీరేంద్ర సెహ్వాగ్... హిమా దాస్‌కి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు...

‘వాట్ ఏ విన్... భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. 400 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన హిమాదాస్‌కి కంగ్రాట్స్... ’ అంటూ ట్వీట్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్, ఆ తర్వాత అసలు విషయాన్ని తెలుసుకుని... దాన్ని వెంటనే డిలీట్ చేశాడు. అయితే అప్పటికే చాలామంది వీరూ ట్వీట్‌ని స్రీన్ షాట్ తీసి, ఈ మాజీ డాషింగ్ ఓపెనర్‌ని ట్రోల్ చేస్తున్నారు...

కాసేపటికి వెయిట్‌ లిఫ్టింగ్‌లో రజతం గెలిచిన సంకేత్ సగ్రార్‌కి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ బోణీ కొట్టింది. 55 కేజీల పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ కేటగిరిలో పోటిపడిన భారత వెయిట్‌లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సాగర్, కాంస్య పతకం సాధించాడు. 21 ఏళ్ల సంకేత్ మహదేవ్ తండ్రి ఓ పాన్ షాప్ యజమాని కావడం విశేషం. 

స్కాచ్ కేటగిరిలో 113 కేజీలను ఎత్తిన సంకేత్, సీ అండ్ జే ఈవెంట్‌లో 135 కేజీలను ఎత్తి... ఓవరాల్‌గా 248 కేజీలతో రెండో స్థానంలో నిలిచాడు. మలేషియాకి చెందిన మహ్మద్ అనీక్, 249 కేజీలతో టాప్‌లో నిలిచి స్వర్ణం సాధించాడు. రెండో స్థానంలో నిలిచిన సంకేత్‌కి, అనీక్‌కి మధ్య తేడా కేవలం ఒక్క కేజీ మాత్రమే... 

కామన్వెల్త్‌ పోటీల్లో వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో భారత్‌కి ఇది 49వ రజతం. ఓవరాల్‌గా వెయిట్‌లిఫ్టింగ్‌లో 126 పతకాలు సాధించింది భారత్. షూటింగ్‌లో 135 పతకాలు సాధించిన భారత షూటర్లు, ఈ లిస్టులో టాప్‌లో ఉన్నారు.

మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్‌ సభ్యులు మానికా బత్రా, రీత్ టెన్నిసన్, శ్రీజ అకుల, దియా చితలా... గుయనాతో జరిగిన మ్యాచ్‌లో 5-0 తేడాతో ఘన విజయాన్ని అందుకుని క్వార్టర్ ఫైనల్స్‌కి దూసుకెళ్లారు. 

Follow Us:
Download App:
  • android
  • ios