టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, యువ క్రికెటర్ రిషబ్ పంత్ లు కబడ్డీ ఆటకు కరెక్ట్ గా సరిపోతారని టీం ఇండియా సారధి విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డారు. తన తోటి క్రికెటర్లతో కోహ్లీ ఏకంగా ఓ కబడ్డీ జట్టునే తయారు చేశారు. ఇంతకీ మ్యాటరేంటంటే... ప్రస్తుతం ప్రొ కబడ్డీ లీగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా... ప్రో కబడ్డీ లీగ్ ముంబయి అంచె ఆరంభ పోటీలకు కోహ్లీ శనివారం హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన జనగనమన ఆలపించి ఈ పోటీలను ప్రారంభించారు. తన మాటలతో కబడ్డీ ఆటగాళ్లను ఆయన ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆయన తన కబడ్డీ జట్టు సభ్యలను కూడా ఎంపిక చేశారు. ఏ క్రికెటర్లు కబడ్డీకి బాగా సరిపోతారని మీడియా అడిగిన ప్రశ్నకు కొందరు క్రికెటర్ల పేర్లను కోహ్లీ పేర్కొన్నారు.

కబడ్డీ ఆడాలంటే బలంతోపాటు అథ్లెటిక్ స్వభావం కలిగి ఉండాలని కోహ్లీ అన్నారు. అందుకే తన జట్టులో ధోనీ, జబేజా, ఉమేష్ యాదవ్ సరిగ్గా సరిపోతారని చెప్పారు. అదేవిధంగా రిషబ్ పంత్ బలంగా కనిపిస్తాడు కాబట్టి అతను కూడా సెట్ అవుతాడని చెప్పారు. ఇక బుమ్రా సులువగా ప్రత్యర్థి కాళ్లను తాకి రాగలడని చెప్పారు. వీళ్లంతా చాలా బలంగా ఉంటారని కూడా కోహ్లీ పేర్కొన్నారు.

అయితే... ఈ క్రికెటర్లంత బలంగా తాను మాత్రం ఉండనని చెప్పాడు. చివరగా తన జట్టులో కేఎల్ రాహుల్ కి కూడా చోటు కల్పిస్తానని చెప్పారు. అనంతరం తనకు రాహుల్ చౌధురి అంటే ఇష్టమని చెప్పారు. కబడ్డీ ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరిగేందుకు భారత ఆటగాళ్లే కారణమని ఈ సందర్భంగా కోహ్లీ ప్రశంసలుకురిపించారు.