ఆసియా దేశాల క్రీడా సమరంలో భారత క్రీడాకారులు అదిరిపోయే ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. మొదటి రోజు ఓ స్వర్ణ పతకం భారత వశమవగా, రెండో రోజు మరో స్వర్ణ పతకం లభించింది. ఈ రెండు స్వర్ణాలు కూడా రెజ్లింగ్ విభాగంలోనే లభించడం విశేషం.

ఇవాళ జరిగిన 60కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో వినేష్ ఫోగట్ సత్తా చాటారు. ఫైనల్లో తన ప్రత్యర్థిని మట్టికరిపించి విజేతగా నిలించారు. దీంతో భారత్ ఖాతాలో రెండో స్వర్ణం మొత్తంగా ఐదో పతకం చేరింది.

 
ఆసియా క్రీడల మొదటి రోజు పురుషుల 65 కేజీల రెజ్లింగ్ విభాగంలో బజ్‌రంగ్ పూనియా పసిడి పతకం సాధించిన విషయం తెలిసిందే. అలాగే 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో షూటర్లు అపూర్వి చండేలా, రవి కుమార్ కాంస్య పతకాన్ని సాధించారు. 

ఇక రెండోరోజైన ఇవాళ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో షూటర్ దీపక్ కుమార్, ట్రాప్ ఈవెంట్ లో లక్షయ్ షెరాత్ ఇప్పటికే  సిల్వర్ మెడల్స్ సాధించారు. అయితే తాజా స్వర్ణంతో ఇండియా పతకాల సంఖ్య ఐదుకు చేరింది.