సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు, క్రీడా కురువృద్ధుడు కోదండరామయ్య కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

కృష్ణాజిల్లా నందిగామ మండలం శెనగపాడు గ్రామానికి చెందిన కోదండరామయ్యకు చిన్నప్పటి నుంచి క్రీడల పట్ల ఆసక్తి ఉండేది. లయోలా కాలేజీలో ఇంటర్, హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. 1958లో బుచ్చిరామయ్య వద్ద వాలీబాల్‌లో ఓనమాలు నేర్చుకున్నారు..

తన ప్రతిభతో కేవలం ఏడాదిలోనే ఆంధ్రా వాలీబాల్ జట్టు సభ్యుడయ్యారు. మూడేళ్లోనే జట్టుకు కెప్టెన్‌గా నాయకత్వం వహించారు. 1963లో పటియాలాలోని భారత క్రీడా శిక్షణా సంస్థలో డిప్లొమా అందుకున్న ఆయన 1970లో జర్మనీలో డిప్లొమా చేశారు.

1971లో ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌లో వాలీబాల్ శిక్షకునిగా బాధ్యతలు చేపట్టారు. 1982 నుంచి 2015 వరకు ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ సంఘానికి అధ్యక్షునిగా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వాలీబాల్ అభివృద్ధికి కోదండరామయ్య ఎంతో కృషి చేశారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కోదండరామయ్య మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.