కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. సామాన్యుడు సెలబ్రిటీ అన్న తేడా లేకుండా అందరిని వణికిస్తోంది ఈ వైరస్. ప్రపంచంలోనే అతి వేగవంతమైన రన్నర్ ఉసైన్ బోల్ట్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. జమైకాలోని తన ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు. 

మాస్కు ధరించకుండా, గత వారం తన 34వ పుట్టినరోజు వేడుకలను భారీ ఎత్తున చేసుకున్నాడు. ఇంకేముంది... కరోనా ను ఇంట్లోకి ఆహ్వానిస్తే సోకకుండా ఉంటుందా చెప్పండి. ఆ బర్త్ డే పార్టీ నిర్వహించిన తరువాతే ఈ దిగ్గజ అథ్లెట్ కరోనా బారినపడ్డాడు. 

100, 200 మీటర్ల పరుగు పందాల రికార్డు హోల్డర్ కి కరోనా వైరస్ సోకినట్టుగా జమైకా ఆరోగ్య శాఖ ధృవీకరించింది. నిన్న మధ్యాహ్నం బెడ్ మీద పడుకొని తాను కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నానని, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపాడు. ముందు జాగ్రత్తగా క్వారంటైన్ లో ఉన్నట్టుగా చెప్పుకొచ్చాడు. స్టే సేఫ్ పీపుల్ అని క్యాప్షన్ పెట్టి ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడియోను పోస్ట్ చేసాడు. ఫలితాల్లో ఈ జమైకన్ చిరుత కరోనా పాజిటివ్ గా తేలాడు.