పరుగుల వీరుడు , ప్రపంచ ఛాంపియన్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ కి కరోనా సోకిందంటూ గత రెండు రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కరోనా నిబంధనలను పాటించకుండా పార్టీలు చేసుకున్నారని.. అందుకే కరోనా సోకిందంటూ వార్తలు వచ్చాయి. కాగా.. తనకు కరోనా వచ్చిందంటూ వస్తున్న వార్తలపై ఉసేన్ బోల్ట్ స్పందించారు.

తనకు కరోనా వచ్చిందని వస్తున్న వార్తలను బోల్ట్ కొట్టి పారేశాడు. తనకు కరోనా సోకినట్లు ఇంకా ధృవీకరణ కాలేదని, కరోనా నిర్ధారణ పరీక్ష రిపోర్టులు ఇంకా రావలసి ఉందని తెలిపాడు. శనివారం తాను కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నానని, అప్పటినుంచి ఇప్పటివరకు జమైకా ఆరోగ్య శాఖ నుంచి ఎటువంటి సమాచారం రాలేదని చెప్పాడు. ఇదిలా ఉంటే ఇటీవల తన 34వ జన్మదినం సందర్భంగా బోల్ట్ భారీ పార్టీ ఇచ్చాడు. స్నేహితులతో పాటు మరికొందరు వీఐపీలు ఈ పార్టీకి హాజరయ్యారు.

ఈ పార్టీలో ఎవరూ మాస్కులు ధరించకపోవడం, కనీస సోషల్ డిస్టెన్సింగ్ కూడా పాటించకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ పార్టీ తరువాతి నుంచే బోల్ట్ అనారోగ్యం బారినపడడంతో అతడు కరోనా బారిన పడి ఉంటాడని అనేకమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి సమయంలో బర్త్‌డే పార్టీ చేసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.