Denmark Open: డెన్మార్క్ ఓపెన్ లో క్వార్టర్స్ కు చేరిన పీవీ సింధు.. హోరాహోరి పోరులో తెలుగమ్మాయిదే గెలుపు
PV Sindhu: రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్ లో క్వార్టర్స్ లోకి ప్రవేశించింది. టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఆమె తొలిసారి ఈ టోర్నీలో బరిలోకి దిగింది.
టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) లో కాంస్యం పతకం సాధించి.. వరుసగా రెండు ఒలింపిక్స్ లలో పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన తెలుగమ్మాయి పీవీ సింధు (PV Sindhu) మళ్లీ మెరిసింది. డెన్మార్క్ వేదికగా జరుగుతున్న డెన్మార్క్ ఓపెన్ (Denmark open) సూపర్ 1000 టోర్నమెంటులో ఆమె అదరగొట్టింది. థాయ్లాండ్ కు చెందిన ప్రత్యర్థి బుసనన్ (Busanan Ongbamrungphan) ను మట్టి కరిపించి క్వార్టర్స్ లోకి ప్రవేశించింది.
ఒలింపిక్స్ విజయం తర్వాత తొలి సారి బరిలోకి దిగిన సింధు.. డెన్మార్క్ ఓపెన్ లోని తొలి రెండు రౌండ్లలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మహిళల సింగిల్స్ లో పోటీ పడుతున్న ఆమె.. తొలి రౌండ్ లో టర్కీకి చెందిన నెస్లిహాన్ యిగిట్ ను ఓడించిన ఈ ప్రపంచ ఛాంపియన్.. రెండో రౌండ్ లో బుసానన్ పై 21-16, 12-21, 21-15 తేడాతో గెలిచింది.
దాదాపు గంట పాటు సాగిన ఈ మ్యచ్ లతో ఆమె విజయానికి చెమటోడ్చాల్సి వచ్చింది. తొలి రౌండ్ లో నెస్లిహిన్ పై అలవోకగా నెగ్గిన సింధుకు.. నేటి పోరులో బుసానన్ అంత ఈజీగా తలవంచలేదు. హోరాహోరిగా పోరాడింది.
ఇదిలాఉండగా.. ఈ టోర్నీలో పోటీ పడుతున్న మరో హైదరాబాదీ సైనా నెహ్వాల్ (Saina nehwal).. బుధవారం జరిగిన పోరులో జపాన్ కు చెందిన అయ ఓహోరి చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే.