ఎలాంటి ఆట అయినా గెలుపు, ఓటములు సహజం. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్ లో ఇది సర్వసాధారణం. ఈ క్రికెట్ లో అత్యంత ఉత్తమ రికార్డులు సాధించే అవకాశం ఎలా ఉందో... చెత్త రికార్డులు సాధించే అవకాశం కూడా అంతే ఉంది. అయితే... క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు తాజాగా నెలకొంది. బ్యాటింగ్  చేయడానికి క్రీజులోకి దిగిన జట్టులో ఒక్కరు కూడా కనీసం ఒక్క పరుగు కూడా చేయలేదు. అంతేకాదు... అందరూ డకౌట్ గానే మిగిలిపోయారు. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... అండర్‌-19 ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ మ్యాచ్‌లో భాగంగా బుధవారం కేరళలోని మలప్పురం జిల్లా పెరింథల్‌మన్న స్టేడియంలో వాయనాడ్‌, కాసరగోడ్‌ మహిళల జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కాసరగాడ్‌ జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు వీక్షిత, చైత్ర రెండు ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా.. ఒక్క పరుగు కూడా చేయలేదు. ఇక మూడో ఓవర్‌ నుంచి కాసరగోడ్‌ పతనం మొదలైంది.

వాయనాడ్‌ కెప్టెన్‌ నిత్య లూర్ధ్‌ మూడో ఓవర్లో 3 వికెట్లు తీశారు. తర్వాతి ఓవర్లలో మరో 3 వికెట్లను కాసరగోడ్‌ చేజార్చుకుంది. మరో బౌలర్‌ జోషిత ఐదు బంతుల్లో హ్యాట్రిక్‌ తీసి మొత్తం 4 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. దీంతో 10 మంది బ్యాటర్లు డకౌట్‌ అయ్యారు. ఇక నాటౌట్‌గా నిలిచిన 11వ బ్యాటర్‌ ఖాతా తెరవలేదు. వయనాడ్‌ బౌలర్లు నాలుగు రన్స్‌ ఎక్స్‌ట్రాల రూపంలో ఇవ్వడంతో కాసరగోడ్‌  5 పరుగుల లక్ష్యా‍న్ని మాత్రమే నిర్దేశించింది. కాగా, విజయానికి కావాల్సిన ఐదు పరుగులను మొదటి ఓవర్లోనే సాధించిన వయనాడ్‌ పది వికెట్లతో ఘన విజయం సాధించింది.